ఓ రెస్టారంట్‌కు డిన్నర్ చేసేందుకు వెళ్లిన ఐదుగురికి భయానక అనుభవం ఎదురైంది. భోజనం అనంతరం తీసుకున్న మౌత్ ఫ్రెష్నర్ (Mouth Freshener) కారణంగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో ఆస్పత్రిపాలయ్యారు. హరియాణాలోని గురుగ్రామ్ (Gurugram)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రేటర్ నొయిడాకు చెందిన అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, నలుగురు స్నేహితులతో కలిసి సెక్టార్ 90లోని ఓ రెస్టారంట్‌కు వెళ్లారు. భోజనం అనంతరం వారంతా వెయిటర్ ఇచ్చిన మౌత్‌ఫ్రెష్‌నర్ తీసుకున్నారు. కొద్దిసేపటికే నోట్లో మంట, వాంతులు కావడంతోపాటు రక్తం కూడా వచ్చినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనానంతరం రెస్టారంట్ సిబ్బంది పరారైనట్లు ఆరోపించారు. అయితే, మౌత్ ఫ్రెష్నర్కు బదులు పొడి మంచు (Dry Ice) ఇవ్వడం వల్లే ఇలా జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. ఆమేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z