* తిరుపతిలోని తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో నడిచే పలు విద్యా సంస్థల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 31న నోటిఫికేషన్ (Job Notifications) విడుదలైన విషయం తెలిసిందే. తితిదేకు చెందిన వివిధ డిగ్రీ కళాశాలలు/ఓరియంటల్ కాలేజీల్లో 49 లెక్చరర్ల పోస్టులు; తితిదే జూనియర్ కాలేజీల్లో 29 జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన APPSC ఆధ్వర్యంలో నియమించనున్నారు. అయితే, తొలుత జూనియర్ లెక్చరర్ పోస్టులకు నేటినుంచి (మార్చి5) ఆన్‌లైన్ దరఖాస్తులు మొదలయ్యాయి. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు 8 నుంచి అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏపీపీఎస్సీ (APPSC) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. నోటిఫికేషన్‌లోని కొన్ని ముఖ్యాంశాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 5 నుంచి మార్చి 25 అర్ధరాత్రి 11.9గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మార్చి 7 నుంచి మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి: జులై 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఇచ్చారు.
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.
ఈ పోస్టులకు సబ్జెక్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్- 4, కామర్స్- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2 చొప్పున మొత్తం 29 పోస్టులు ఉన్నాయి.
డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మంచి అకడమిక్ రికార్డుతో పాటు 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు నెట్/స్లెట్ అర్హత తప్పనిసరి.
సబ్జెక్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. బోటనీ- 3, కెమిస్ట్రీ- 2, కామర్స్- 9, డెయిరీ సైన్స్- 1, ఎలక్ట్రానిక్స్- 1, ఇంగ్లిష్- 8, హిందీ- 2, హిస్టరీ- 1, హోమ్ సైన్స్- 4, ఫిజికల్ ఎడ్యుకేషన్- 2, ఫిజిక్స్- 2, పాపులేషన్ స్టడీస్- 1, సంస్కృతం- 1, సంస్కృత వ్యాకరణం- 1, స్టాటిస్టిక్స్- 4, తెలుగు- 3, జువాలజీ- 4 పోస్టుల చొప్పున ఉన్నాయి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకైతే రూ.370.
వేతనం: జూనియర్ లెక్చరర్లకు రూ.57,100- రూ.1,47,760; డిగ్రీ లెక్చరర్లకు రూ.61,960- రూ.1,51,370 చొప్పున నెలవారీ వేతనం అందజేస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
*వైకాపా(YSRCP)ను వీడిన మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ వేదికగా తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి గుమ్మనూరును తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పారు.
* భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారత్ ఎప్పుడూ ఒక దేశం కాదని.. ఉపఖండమంటూ డీఎంకే ఎంపీ ఏ రాజా (DMK MP A Raja) చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. డీఎంకే ఇటీవల ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో రాజా చేసిన ఈ వ్యాఖ్యలపై భాజపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాముడి గురించీ ఆయన తప్పుగా మాట్లాడారని.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్.. రాజా వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని, వాటిని ఖండిస్తున్నామని ప్రకటించింది. ‘భారత్ ఒక దేశం కాదు. ఎప్పుడూ ఒక దేశంగా లేదు. ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి.. వంటి లక్షణాలు ఉంటే ఒకే దేశం అంటారు. కానీ, భారత్ అలా కాదు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులున్న రాష్ట్రాలు కలిసి దేశంగా ఏర్పడ్డాయి. అందుకే ఇది దేశం కాదు.. ఉపఖండం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది’ అని ఏ రాజా వ్యాఖ్యానించారు.
* మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ నేతలతో భారాస అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటించారు. నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు. బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మళ్లీ చేర్చుకోవద్దని నేతలు కోరారు. దీనిపై స్పందించిన అధినేత కేసీఆర్.. వారిని మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యులతో చర్చించి నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.
* రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు అందించేందుకు కేంద్ర జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. మరో 29 మంది ఐపీఎస్‌లను రాష్ట్రానికి కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయడంతో పాటు మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సహకరించాలని కోరారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన మోదీకి 11 అంశాలపై సీఎం వినతిపత్రం అందజేశారు.
* లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయనతో ప్రవీణ్ కుమార్ చర్చించారు.
* మూడు రాజధానులంటూ ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతున్న ఏపీ సీఎం జగన్.. మరోసారి విశాఖ జపం చేశారు. ‘‘ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా. ఈసారి సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా. నగర అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళిక అవసరం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేదు. కేంద్రం సహకారం ఉండాలి’’అని అన్నారు.
* నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలీసు శాఖను కోరారు. ఈ మేరకు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
* కడప జైలులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమని వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి తెలిపారు. ‘జైలు అధికారులు నన్ను ప్రలోభాలకు గురి చేసేలా ప్రవర్తించారు. పులివెందుల కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కూడా నా భార్యను బెదిరించారు. వివేకా హత్య చేయించిన వాళ్లే ఇప్పుడు నాపై బురద జల్లుతున్నారు’అని చెప్పారు.
* కర్ణాటక ప్రభుత్వానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం షాహిద్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో మెయిల్ వచ్చినట్లు తెలిపారు. రామేశ్వరం కేఫ్ ఘటన మరువకముందే.. బాంబు బెదిరింపులు రావడంపై పోలీసు శాఖ అప్రమత్తమైంది.
* ప్రముఖ కృత్రిమ మేధ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) ప్లాట్‌ఫామ్‌లో ఓపెన్‌ఏఐ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘రీడ్ ఏ లౌడ్’ పేరిట వచ్చిన ఈ ఫీచర్ సమాధానాలను బయటకు పెద్దగా చదువుతుంది. ఫోన్ చూసి టెక్ట్స్ చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
* లెబనాన్ భూభాగం నుంచి చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లో (Israel) కేరళవాసి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ఆ దేశ సరిహద్దుల్లోని భారతీయులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
* విదేశాలకు వెళ్లిన పాకిస్థాన్ బాక్సర్ తోటి ఆటగాళ్ల బ్యాగ్‌లోని సొమ్మును దొంగిలించాడు. ఆ పై అక్కడి నుంచి పరారయ్యాడని ఆ దేశ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. పాక్‌కు చెందిన ఐదుగురు క్రీడాకారుల బృందం పారిస్ ఒలింపిక్స్ అర్హత టోర్నీలో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లగా ఈ ఘటన జరిగింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z