* క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకునే విషయంలో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ ఉండేలా ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం అనుమతి ఉన్న కార్డు నెట్‌వర్క్‌లు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలతో కలిసి క్రెడిట్ కార్డులను (Credit Card) జారీ చేస్తున్నాయి. అయితే, ఏ నెట్‌వర్క్ కార్డును ఇవ్వాలనేది కార్డు జారీ చేసే సంస్థలే నిర్ణయిస్తున్నాయి. ఇది ఆయా నెట్‌వర్క్‌లతో వాటికి ఉన్న ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని తాజాగా ఆర్‌బీఐ (RBI) సమీక్షించింది. జారీ సంస్థలు, నెట్‌వర్క్‌ల మధ్య ఉన్న ఒప్పందాల వల్ల కార్డు ఎంపికలో వినియోగదారులకు పరిమిత ఆప్షన్లు ఉన్నాయని గుర్తించింది. ఈ పరిస్థితిని మార్చేందుకు పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 కింద దఖలుపడిన అధికారాలను ఉపయోగించి మార్గదర్శకాలను జారీ చేసింది.
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-2025) 6.80% జీడీపీ వృద్ధి అంచనాతో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన అభివృద్ధిని సాధించనుంది. ఈ వృద్ధి పథం భారతదేశాన్ని 2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ స్థితికి చేరుస్తుంది. అలాగే, ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం తెలిపింది. దేశీయ సంస్కరణల మద్దతుతో ఎగువ మధ్యాదాయ వర్గానికి అధిక తలసరి ఆదాయాన్ని అందిస్తూ దేశం స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని నివేదిక అంచనా వేసింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత అమాంతం పుంజుకున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకు షేర్లు కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. దీంతో సెన్సెక్స్ 74 వేలు, నిఫ్టీ 22,400 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,587 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగింది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో బలంగా పుంజుకుంది. ఇంట్రాడేలో 74,151.27 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 408.86 పాయింట్ల లాభంతో 74,085.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 117.75 పాయింట్ల లాభంతో 22,474 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 22,497.20 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ 7 పైసలు బలపడి 82.83గా ఉంది.
* ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో(Bajaj Auto).. ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్‌జీతో (CNG) నడిచే ద్విచక్ర వాహనాన్ని తీసుకురానుంది. ఇప్పటికే త్రీ వీలర్ విభాగంలో సత్తా చాటుతున్న ఆ కంపెనీ.. తాజాగా తన ద్విచక్ర వాహన వ్యాపారంలో సంచలనం నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా వచ్చే త్రైమాసికం నాటికి మొదటి సీఎన్‌జీ బైక్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌బజాజ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z