DailyDose

హైదరాబాద్‌లో ₹50లక్షల హవాలా సీజ్-CrimeNews-Mar 07 2024

హైదరాబాద్‌లో ₹50లక్షల హవాలా సీజ్-CrimeNews-Mar 07 2024

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సం‍స్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. వివరాల్లోకి వెళితే.. 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్‌ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ కొనసాగగా తాజాగా చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. వైఎస్సార్‌ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్‌ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది.

* ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రాసిక్యూషన్‌కు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ పేరుతో పవర్ మిస్ యూజ్ చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రణీత్‌ రావును డీజీపీ ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్‌ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌ రావుపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం మారటంతో ట్యాపింగ్ రికార్డ్స్ ధ్వంసం చేసిన ప్రణీత్ రావు.. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశాడు. 42 హార్డ్ డిస్క్‌ల్లో డేటాను రిమూవ్ చేశారు. ఎస్ఐబీ ఆఫీస్‌లోని లాగర్ రూమ్‌లో ఉన్న లాప్‌టాప్‌, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు. ఫోన్ టాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎమ్ఈఐ నంబర్ల వివరాల సైతం ధ్వంసం చేశాడు. డేటా బేస్ లో ఉన్న మొత్తం డేటాను ప్రణిత్‌ రిమూవ్ చేశాడు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశాడనే దర్యాప్తు చేపట్టారు.

* సాహితీ ఇన్‌ఫ్రాకు సీసీఎస్‌ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్‌ పోలీసులు గాలిస్తున్నారు. ప్రీలాంచ్‌ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా (ఎస్‌ఐవీఐపీఎల్‌) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది.

* ఏపీలోని నెల్లూరు ( Nellore) జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు (Couple) మృతి చెందారు. జిల్లాలోని వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద బైకుపై వెళ్తున్న దంపతుల వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. దీంతో వారు దంపతులు కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు వైఎస్‌ఆర్‌ నగర్‌కుచెందిన పుష్ప, ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* హైద‌రాబాద్ న‌గ‌రంలో రూ. 50 ల‌క్ష‌ల హ‌వాలా డ‌బ్బును సైబ‌రాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ప‌ట్టుకున్నారు. డ‌బ్బును త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి 10 గంట‌ల‌కు హ‌వాలా డ‌బ్బు త‌ర‌లిస్తున్నట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఇన్నోవా క్రిస్టా వాహ‌నంలో త‌ర‌లిస్తున్న రూ. 50 ల‌క్ష‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను కూడా అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న రాయ‌దుర్గం పోలీసులు స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z