Politics

రేవంత్ చుట్టూ మానవబాంబులు-NewsRoundup-Mar 07 2024

రేవంత్ చుట్టూ మానవబాంబులు-NewsRoundup-Mar 07 2024

* తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు (TS SSC Hall tickets) విడుదలయ్యాయి. విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. పదో తరగతి రెగ్యులర్‌/ప్రైవేటు/ఓఎస్‌ఎస్‌సీ/ఒకేషనల్‌ విద్యార్థులు తమ Hall tickets పొందేందుకు జిల్లా పేరు, స్కూల్‌, పేరు, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే ఈ పరీక్షలను ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు.

* హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారిలో పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అల్వాల్‌ సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. భారాస హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. నగరంలో గంజాయి, పబ్బులు, డ్రగ్స్‌ వచ్చాయని విమర్శించారు. గత భారాస ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రజల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్టు చెప్పారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యం తన దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్‌ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు ప్రస్తుతం మోక్షం లభించిందదని, ఈ కారిడార్‌తో ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.

* టెస్టుల్లో సూపర్‌ ఫామ్‌ని కొనసాగిస్తున్న టీమ్‌ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉన్న ఓ రికార్డు బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్‌పై ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో జైస్వాల్ 655 పరుగులు చేశాడు. 2016లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ 655 పరుగులు చేశాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (57; 58 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకం బాదడంతో ఇంగ్లిష్‌ జట్టుపై అత్యధిక రన్స్‌ (712) చేసిన భారత ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో 700కు పైగా రన్స్‌ చేసిన రెండో భారత ఆటగాడిగానూ జైస్వాల్ రికార్డు సృష్టించాడు. సునీల్ గావస్కర్‌ వెస్టిండీస్‌పై రెండుసార్లు (774 పరుగులు, 1971.. 732 పరుగులు.. 1979) ఈ ఘనత సాధించాడు.

* ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై సచివాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసనకు దిగారు. తొలుత సచివాలయం ప్రధాన గేట్ వద్ద ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. అయితే, సీఈవో ముఖేశ్‌ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, ఇప్పుడు కలవలేరని సిబ్బంది పాల్‌కు తెలిపారు. దీంతో ఆయన ఐదో బ్లాక్ మెట్ల వద్దే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సీఈవో కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వీల్లేదని భద్రతా సిబ్బంది ఆయనను బయటకు తరలించారు.

* పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో మహిళలంతా సురక్షితమేనని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు. పెద్దఎత్తున మహిళలతో గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ప్రదర్శనకు దీదీ నాయకత్వం వహించారు. సందేశ్‌ఖాలీ ఘటనల (Sandeshkhali Incidents) విషయంలో టీఎంసీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విరుచుకుపడిన మరుసటిరోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే విషయంలో విఫలమైన బెంగాల్‌ ప్రభుత్వం.. దానిపై బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ విమర్శించిన విషయం తెలిసిందే.

* యూకో బ్యాంక్‌ (UCO Bank)లో రూ.820 కోట్ల మేర ఐఎంపీఎస్ లావాదేవీల కుంభకోణంపై సీబీఐ (CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా రాజస్థాన్‌, మహారాష్ట్రల్లోని 67 చోట్ల సోదాలు నిర్వహించినట్లు సీబీఐ వెల్లడించింది. బ్యాంకులో గతేడాది నవంబర్ 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మందికి పైగా కస్టమర్ల ఖాతాల్లో డబ్బులు జమైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నవంబర్‌ 21న కేసు నమోదు చేసిన సీబీఐ.. పలుచోట్ల సోదాలు జరిపి కొన్ని ఆధారాలు సేకరించింది. ఏడు ప్రైవేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్‌ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41వేల ఖాతాదారులకు తప్పుగా మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఇతర బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి సొమ్మూ కట్‌ అవకుండానే యూకో బ్యాంక్‌ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బు జమ కావడంపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. ఆ కూపీ లాగే దిశగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమైన తేదీల్లోనే యూకో బ్యాంకులో వేలాది కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై ఆరా తీస్తున్నారు. పొరపాటున తమ ఖాతాల్లో జమ అయిన మొత్తాలను చాలామంది ఇదే అదునుగా విత్‌డ్రా చేసుకొని బ్యాంకుకు తిరిగి చెల్లించని వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

* భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌.. అంతర్జాతీయ వేదికపై చైనా (China) తీరును మరోసారి తూర్పారపట్టారు. పొరుగుదేశం రాతపూర్వక ఒప్పందాలను పాటించకపోవడం ఆందోళనకర విషయమన్నారు. సరిహద్దుల్లో 2020లో (నాలుగు దశాబ్దాల్లో మొదటిసారి) చోటుచేసుకున్న రక్తపాతానికి చైనానే కారణమన్నారు. టోక్యోలో అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన రైసినా రౌండ్‌టేబుల్‌ ప్రారంభ సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి (S Jaishankar).. చైనా తీరుపై నిప్పులు చెరిగారు.

* లోక్‌సభ ఎన్నికల్లో (LokSabha Elections 2024) అమేఠీలో భాజపా (BJP) విజయం ఖాయమైందని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (Smriti Irani) ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును ఊహించిన కాంగ్రెస్ (Congress) అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తుందని ఎద్దేవా చేశారు. గురువారం నియోజకవర్గంలో రూ.206 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

* సరిహద్దులో భిన్న సవాళ్లు ఎదురవుతోన్న వేళ.. వాటికి పదునైన జవాబు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) ఉద్ఘాటించారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా దీటుగా స్పందిస్తుందన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ నిర్వహించిన ‘డిఫెన్స్‌ సమ్మిట్‌’లో మాట్లాడిన ఆయన.. శాంతి సమయంలోనూ యుద్ధానికి సంసిద్ధతతో ఉండాలన్నారు. చైనా సరిహద్దులో కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటోన్న వేళ రక్షణమంత్రి ఈ విధంగా స్పందించారు.

* కరీంనగర్‌ అంటే భారాస అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటని.. ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్‌ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్‌ కదనభేరి సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పాలమూరు సభలో సీఎం భాష నాకైతే అర్థం కాలేదు. గొంతు కోస్తా.. మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి.. అవే ఆయనను కూల్చుతాయి. రేవంత్‌ను ఖమ్మం, నల్గొండ బాంబులే ఏదైనా చేయొచ్చు. భారాస నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. సీఎంగా రేవంత్‌ ఐదేళ్లు నిక్షేపంగా ఉండాలి. ఐదేళ్ల పాలన చూశాకే ఎవరు గొప్పవాళ్లో ప్రజలకు తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరవు అని సీఎం అంటున్నారు. కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వొచ్చు. కానీ, కేసీఆర్‌ని బద్నాం చేయాలని రిపేర్‌ చేయడం లేదు. పదేళ్లు మోదీ ప్రధానిగా.. ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. కరీంగనగర్‌కు మీరేం చేశారో.. అంతకుముందు వినోద్ కుమార్ ఏం చేశారో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా?’’ అని సవాల్‌ విసిరారు.

* ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో మార్చి15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాలల వేళలు నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.

* ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన తర్వాత.. శ్రీనగర్‌లో ఇవాళ తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. బక్షి స్టేడియం వేదికగా ‘వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్మూకశ్మీర్‌’ కార్యక్రమంలో రూ.6,400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అద్భుతమైన శ్రీనర్‌ ప్రజల తాను ఒకడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, వారి మనసులు గెలుచుకునేందుకు తాను శ్రీనగర్‌ వచ్చినట్లు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగిందని తెలిపారు. 2023లో కశ్మీర్‌లో 2 కోట్ల మంది పర్యటించారని పేర్కొన్నారు. తన నెక్ట్స్‌ మిషన్‌ ‘వెడ్డింగ్‌ ఇన్‌ ఇండియా’ అని.. వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ హబ్‌గా జమ్మూకశ్మీర్‌ను తయారు చేయబోతున్నామన్నారు.

* వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడని మండిపడ్డారు ఎంపీ కేశినేని నాని. అయినా బాబును రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఎంపీ కేశినేని నాని కౌంటర్‌ ఇచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు వచ్చాడో.. మళ్లీ ఎందుకు వెళ్తున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎంపీ కేశినేని నాని గురువారం మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు తానే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టానని చెప్పారు. పార్లమెంటులో సభ్యులు ఏం మాట్లాడాలనేది చంద్రబాబు స్లిప్పులు రాసి పంపించేవాడని ప్రస్తావించారు. ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మళ్ళీ ప్యాకేజీ వద్దంటూ స్పెషల్ కేటగిరి కావాలంటూ రివర్స్ అయ్యాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే ఆలోచనతో కాంగ్రెస్‌తో బాబు కలిశాడని దుయ్యబట్టారు. పనికిరాని కొడుకు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసి తాను ప్రధాని కావాలనేది చంద్రబాబు దురాలోచన అని ఆరోపించారు. అందుకే అప్పట్లో ఆత్మ పోరాట దీక్షల పేరుతో ప్రధానమంత్రి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల డబ్బులతో ప్రత్యేక విమానంలో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరిగాడని గుర్తుచేశారు. ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుని బొక్క బోర్లా పడినట్లు తెలిపారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా కరుణాకటాక్షాల కోసం ఎన్డీయే కూటమిలో చేరటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు.

* మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌) ఆక్రమించి పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి అధికారులు సర్దిచెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z