DailyDose

చీరాలలో 457కిలోల గంజాయి పట్టివేత-CrimeNews-Mar 08 2024

చీరాలలో 457కిలోల గంజాయి పట్టివేత-CrimeNews-Mar 08 2024

* మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్‌ షాక్‌ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్‌ నగర్‌ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

* ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వ్యవహారంపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు నివేదికలో స్పష్టం చేశారు. ఎస్ఐబీలోని కీలక ఫైల్స్‌ను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద ప్రణీత్‌రావు పై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. రహస్య సమాచారం సేకరణ, వ్యక్తిగత వివరాలు తస్కరించడం వంటి వాటిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదుకు రంగం సిద్ధమైంది.

* మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్న కూలీలకు ఊహించని పరిణామం ఎదురైంది. 150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి నిధి వారి కంటపడింది ఇంటి నిర్మాణం కోసం (మంగళవారం మార్చి 5న) గుంతలు తవ్వుతున్న కూలీలకు బ్రిటీష్ కాలం నాటి వెండి నాణేలు లభ్యమైనాయి. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి వివాదానికి దారి తీసింది. సంజయ్ పాల్ అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి కూలీలను పెట్టుకున్నాడు. ఈ క్రమంగా అక్కడ తవ్వుతుండగా ఇద్దరు కార్మికుల వెండి నాణేలు లభించాయి. ఈ సంగతి సంజయ్ పాల్ పొరుగువారికి తెలియడంతో వివాదం రేగింది.త మకూ వాటా కావాలని పట్టుబట్టడంతో వాగ్వాదానికి దారి తీసింది. దీంతో సంజయ్ కుమారుడు హరీష్ జంగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాటా అడిగిన ఇంటి పొరుగువారితో పాటు ఇద్దరు కార్మికులను అరెస్టు చేస్తామని చెప్పారు. కొన్ని వెండి నాణేలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈవిషయానికి సంబంధించి పురావస్తు శాఖ నుంచి వివరాలను సేకరించి తగిన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు ప్రకటించారు.

* నగరంతో పాటు శివారుల్లో టానిక్‌ వైన్‌ మార్ట్‌ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో వందల కోట్ల అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ జీవో జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయ్యింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. 2016 నుండి 2019వరకు అన్ లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్‌కు అనుమతి లభించగా, ఐదేళ్లకు ఒకసారి షాప్ రెన్యూవల్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్‌కు ఐదు లక్షలు మాత్రమే అదనంగా యానివల్ ఫీజు నిర్ణయించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

* రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్న కంటెయినర్‌ను బాపట్ల జిల్లా సెబ్‌ అధికారులు గురువారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బాపట్ల శివారున 216ఎ జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డులో సూర్యలంక కింది వంతెన వద్ద పైలెట్ వాహనంతో వెళ్తున్న కంటెయినర్‌ లారీని బాపట్ల, చీరాల సెబ్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వాహనం లోపల ఉన్న గంజాయి బస్తాలను గుర్తించారు. పైలట్‌ వాహనంగా కారు నడుపుతూ వస్తున్న తణుకుకు చెందిన బత్తుల జానకీరాముడు, లారీ నడుపుతున్న గూడపాటి వేణుబాబు, చెన్నైకు చెందిన చిన్నమత్తు దేవరసులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా పాత ఫర్నీచర్‌తో కంటెయినర్‌లో కొంత భాగాన్ని మూసేసి గంజాయిని దాచి తరలిస్తున్నట్లు జిల్లా సెబ్‌ అధికారి జి.నరసింహారావు తెలిపారు. మొత్తం 457 కిలోలు ఉన్న 17 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశామని.. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాను పట్టుకుంటామని స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z