Business

జొమాటో మహిళలకు యూనిఫాం-BusinessNews-Mar 09 2024

జొమాటో మహిళలకు యూనిఫాం-BusinessNews-Mar 09 2024

* దేశంలో దాదాపు రెండు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Fuel price) స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పందించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వీటి ధరలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ‘‘భారత్‌ వెలుపల ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు (యుద్ధాలను ఉద్దేశిస్తూ) మెరుగుపడనివ్వండి. అప్పుడే చమురు ధరల్లో స్థిరత్వం వస్తుంది. ఆ తర్వాత పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ (Diesel) ధరల తగ్గింపుపై దృష్టి సారించగలం. అయితే, ప్రపంచంలో ఎక్కడో ఓచోట దాడులు జరిగినా సరకు రవాణా, బీమా ధరలు పెరుగుతున్నాయి. దీంతో చమురు మార్కెట్‌లో అస్థిరతలు నెలకొంటున్నాయి’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

* టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాదిలో తొలి రెండు నెలల కాలంలో ఆయన నికర ఆస్తి భారీగా క్షీణించింది. మస్క్‌ సంపదలో ఇప్పటివరకు 40 బిలియన్‌ డాలర్లకు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3లక్షల కోట్లకు పైమాటే) పైగా ఆవిరైనట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన మూడో స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్‌ సూచీ ప్రకారం ప్రస్తుతం మస్క్‌ నికర సంపద 189 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 201 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో ఫ్రాన్స్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానంలో ఉండగా.. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 198 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్‌ తర్వాత 182 బిలియన్‌ డాలర్లతో మెటా అధినేత జుకర్‌బర్గ్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జుకర్‌ సంపద విలువ ఏకంగా 53శాతం పెరగడం విశేషం.

* ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వినూత్నంగా జరిపింది. తన సంస్థలో పనిచేసే డెలివరీ విమెన్‌కు కొత్త యూనిఫాం అందించింది. ఎరుపు రంగు కుర్తాలు అందిస్తూ.. ఇకపై యూనిఫాంలో భాగంగా కచ్చితంగా టీ-షర్ట్‌ ధరించాలనే నియమం లేదని తెలిపింది. సౌకర్యంగా ఉంటేనే టీ-షర్ట్‌ లేకపోతే కుర్తాను ఎంచుకోవచ్చని వెల్లడించింది. ‘‘జొమాటో టీ-షర్ట్‌లు ధరించడంపై చాలామంది మహిళా డెలివరీ ఉద్యోగులు అసౌకర్యాన్ని వ్యక్తంచేశారు. మహిళా ఉద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా టీ-షర్ట్‌ మాత్రమే కాకుండా కుర్తాలను ఎంచుకొనే సదుపాయం కల్పించాం’’ అని జొమాటో తన లింక్డిన్‌ పోస్ట్‌లో తెలిపింది. జొమాటో అందించిన కొత్త యూనిఫాంపై మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. కంపెనీ కొత్త ఆలోచనకు కృతజ్ఞత తెలిపారు. కుర్తాలను ధరించి అందంగా ముస్తాబై జొమాటో నిర్వహించిన ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

* ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ శనివారం కీలక ప్రకటన చేశారు. త్వరలో ఎక్స్‌ టీవీ యాప్‌ను లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో ట్విట్టర్‌ పేరును ఎక్స్‌గా మార్చిన విషయం తెలిసిందే. అమెజాన్‌, శాంసంగ్‌ యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు చూసేందుకు వీలుగా ఈ యాప్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లుగా మస్క్‌ వెల్లడించారు. ఓ సోషల్‌మీడియా యాజర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎలాన్‌ మస్క్‌ టీవీ యాప్‌ రెండు కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నది. ఎలాన్‌ మస్క్‌ తీసుకురాబోయే ఎక్స్‌ టీవీ యాప్‌ య్యూటూబ్‌తో పోటీ పడనుందని భావిస్తున్నారు. ఎక్స్‌ టీవీ యాప్‌ వచ్చేవారం విడుదలవనున్నది. ఈ యాప్‌ యూట్యూబ్‌ను పోలి ఉండనున్నది. ఎలోన్ మస్క్ ఎక్స్‌ యాప్‌కు చెందిన వీడియోలను టీవీ యాప్‌ ద్వారా టీవీకి పంపాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి సమూలంగా మార్పులను చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్‌ను ఎక్స్‌గా మార్చారు. అలాగే, ఎక్స్‌ను ప్రస్తుతం ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫోన్‌ నంబర్‌తో సంబంధం లేకుండా ఎక్స్‌ నుంచి నేరుగా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకునే ఫీచర్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z