Politics

తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభ: NewsRoundup-Mar 09 2024

తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభ: NewsRoundup-Mar 09 2024

* హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్‌లో రూ.148.05 కోట్లతో నిర్మించిన లెవల్‌ -2 ఫ్లైఓవర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ‘‘కొడంగల్‌లో చేదు అనుభవం ఎదురైనా మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేశా. ఎల్బీనగర్‌ నియోజకవర్గం నాకు 30 వేల మెజార్టీ ఇచ్చి ప్రజా గొంతుకను చేసింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నా గుండె వేగం పెరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నా బంధువులు, ఆత్మీయులే ఉన్నారు. హైదరాబాద్‌లో జనాభా పెరుగుతోంది. వారి అవసరాలకు తగ్గట్టు కృష్ణా జలాలు పెంచాం. మెట్రో రైలును విస్తరిస్తూ ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకూ తీసుకెళ్తాం. ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ వరకు మెట్రో రాబోతోంది. పాతబస్తీ మెట్రోను ఆపాలని ఎవరో దిల్లీకి లేఖ రాశారంట. అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తున్న వారికి నగర బహిష్కరణ తప్పదు.” అని రేవంత్ అన్నారు.

* పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి వెంకటేశ్‌, చదలవాడ అరవిందబాబు, జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు, రాజా రమేశ్‌ పరిశీలించారు. ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు, భవిష్యత్‌ కార్యాచరణను చంద్రబాబు, పవన్ ప్రకటించనున్నారు. ఎన్డీఏలో తెదేపా చేరిన తర్వాత జరగబోయే తొలి బహిరంగ సభ కావడంతో.. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బహిరంగసభకు ప్రధాని మోదీ కూడా హాజరవుతారనే సమాచారం ఉందన్నారు. ‘‘చిలకలూరిపేట సభ ద్వారా దేశానికి ఒక సందేశం ఇస్తాం. చంద్రబాబు, పవన్‌ దిల్లీ వెళ్లిన దగ్గర్నుంచి జగన్‌, వైకాపాలో కలవరం మొదలైంది. మూడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలనే దుర్బుద్ధితో వైకాపా ప్రచారం చేస్తోంది. సీఎం జగన్‌ ఏపీని సర్వనాశనం చేశారనే సమాచారం దిల్లీ పెద్దలకు ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే సభ చరిత్రలో నిలిచిపోతుంది’’ అని తెలిపారు.

* తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (ఋఅహుల్ ఘంధి) మరోసారి స్పష్టం చేశారు. కులగణనతో పాటు ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ద్వారా ఇప్పటివరకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయొచ్చన్నారు. పేదల కోసం సరైన విధానాలు, ప్రణాళికలను రూపొందించడమే కాక విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో అభివృద్ధికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

* ఎన్డీఏలో చేరాలన్న తెదేపా, జనసేన పార్టీల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ఎక్స్‌’(ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘దేశాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల మేలు కోసం కలిసి పనిచేస్తాం’’ అని తెలిపారు.

* భాజపా, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం దిల్లీ నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ఐదేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికి కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నాం. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దు. సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి.. స్పష్టత వచ్చింది. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుంది. మా మధ్య ఎలాంటి గందరగోళం లేదు’’ అని తెలిపారు.

* ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 4-1 తేడాతో భారత్‌ గెలిచింది. అనంతరం ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ మాట్లాడుతూ జట్టును చూస్తే గర్వంగా ఉందన్నారు. తొలి టెస్టులో ఓటమి పాలైనా తర్వాత మ్యాచుల్లో గొప్పగా పుంజుకున్నామని తెలిపారు. ఈ సిరీస్‌కు ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనా ప్రతిభ గల ప్లేయర్లు భారత్‌లో ఎంతోమంది ఉన్నారని, యువకులు జట్టులో చేరి అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారని ఆనందం వ్యక్తంచేశారు.

* గతంలో రైతు బంధును భారాస ప్రభుత్వం ఐదు నెలలపాటు ఇచ్చిందని, తాము వారి కంటే తక్కువ సమయంలోనే అందజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్టు చెప్పారు.

* తన తండ్రి షేక్‌ హాజీవలిపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పందించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బెయిల్‌ రద్దు చేయాలని కోరారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ నెల 12న హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో వాయిదాకు వెళ్తున్నా. నా తండ్రిపై జరిగిన దాడిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా. పులివెందుల వైకాపా నాయకులకు దమ్ముంటే నన్ను టచ్ చేయాలి. నా కుటుంబం జోలికి రావాల్సిన అవసరం ఏముంది? నా కుటుంబం జోలికి వచ్చారు కాబట్టి.. వార్ వన్ సైడ్‌ అవుతుంది. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. దేనికైనా సిద్ధం. పులివెందుల వైకాపా నాయకులు ఢీ అంటే ఢీ .. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’ అని పేర్కొన్నారు.

* టెస్టు క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ(భ్ఛ్ఛీ) చర్యలు చేపట్టింది. టీ20 లీగ్‌ల వైపు మొగ్గు చూపే క్రికెటర్లను అడ్డుకొనేందుకు తాజాగా ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశారు. దీనికోసం రూ.40 కోట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు కాంట్రాక్ట్‌ ప్లేయర్లు అందుకొన్న ఫీజుతోపాటు అదనంగా ప్రతీ టెస్టు మ్యాచ్‌కు ఇన్సెంటివ్‌గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టుకే ఇలాంటి స్కీమ్‌ను అమల్లోకి తెచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z