Politics

16న వైకాపా అభ్యర్థుల జాబితా విడుదల-NewsRoundup-Mar 13 2024

16న వైకాపా అభ్యర్థుల జాబితా విడుదల-NewsRoundup-Mar 13 2024

* ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లైఫ్‌ సైన్సెస్‌ సేవలు అందించడమే లక్ష్యంగా థర్మోఫిషర్‌(Thermofisher) సెంటర్‌ను ప్రారంభించారు. సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీలోని అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు వీలుగా ఈ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హై ఎండ్‌ ఇమేజింగ్‌ టూల్స్‌గా పలు పరిశోధనలకు అవసరమైన టెక్నాలజీని అందించడంలో థర్మోఫిషర్‌ ముఖ్య భూమికను పోషిస్తోంది. ఈ క్రమంలో ఏఐసీలోనే సెంటర్‌ను నెలకొల్పడం వలన పరిశ్రమ అవసరాలకు సాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ నందికూరి, ఏఐసీ సీఈవో మధుసూదన్‌ రావు, థర్మోఫిషర్‌ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

* మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. 18వ శ‌తాబ్ధ‌పు మ‌రాఠా రాణి అహ‌ల్యాభాయ్ హోల్క‌ర్ పేరుతో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ను వ్య‌వ‌హ‌రించాల‌నే ప్ర‌తిపాద‌న‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది.

* దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందుకు రూ.8400కోట్లు ఖర్చవనున్నది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వివరించారు. తొలి కారిడార్‌ లజ్‌పత్‌నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ మధ్య.. 8.4 కిలోమీటర్లు ఉంటుందన్నారు. రెండో కారిడార్‌ ఇంద్రలోక్‌ నుంచి ఇంద్రప్రస్థ మధ్య 12.4 కిలోమీటర్లు ఉంటుందన్నారు.

* పొరుగు దేశం పాకిస్థాన్‌ (Pakistan) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు (Pakistan President) అసిఫ్‌ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఓ త్యాగానికి సిద్ధపడ్డారు. ఈ పదవీ కాలంలో జీతం (salary) తీసుకోకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది.

* తన సోదరుడు బాబూన్ బెనర్జీతో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లు పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. ఇక ఆయనకు నచ్చింది చేసుకోవచ్చని చెప్పారు. అలాగే తన తమ్ముడికి బీజేపీతో సంబంధాలున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘నేను, నా కుటుంబం బాబూన్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నాం’ అని మీడియాతో అన్నారు. ప్రతి ఎన్నికల ముందు ఆయన ఏదో ఒక సమస్య సృష్టిస్తాడని ఆమె విమర్శించారు. ‘నేను అత్యాశపరులను ఇష్టపడను. వంశపారంపర్య రాజకీయాలను నమ్మను. కాబట్టి అతడికి (ప్రసూన్ బెనర్జీ)కి ఎన్నికల్లో టికెట్‌ ఇస్తా. అందుకే బాబూన్‌ను తిరస్కరించా. సోదరుడితో అన్ని సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించుకున్నా’ అని అన్నారు.

* కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని ముద్రగడ వాయిదా వేసుకున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి కార్లలో ర్యాలీగా వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాపు సోదరులకు ముద్రగడ ఓ లేఖ రాశారు. తాను వైసీపీలో చేరతానని ప్రకటించిన తర్వాత.. ఊహించిన దానికంటే కూడా భారీ స్థాయిలో స్పందన వచ్చిందని ముద్రగడ లేఖలో తెలిపారు. అయితే సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికే కాదు.. కనీసం నిలడడానికి కూడా స్థలం సరిపోదని.. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరినీ చెక్‌ చేయడం చాలా ఇబ్బందని చెప్పడంతో తాడేపల్లికి ర్యాలీగా వెళ్లాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ఒక్కడినే వెళ్లి సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరతానని వెల్లడించారు. అందర్నీ నిరుత్సాహపరిచినందుకు క్షమించాలని అభిమానులను కోరారు. మీ అందరి ఆశీస్సులు తప్పకుండా అందించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

* ఏపీలో అధికార వైసీపీ పార్టీ(YCP) అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు ముమ్మరం చేసింది. ఈనెల 16న ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌(YSR Ghat) వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(CM Jagan) అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. అందరికంటే ముందుగానే జాబితాను సిద్ధం చేసుకున్న జగన్‌ వాటిని ప్రకటించడంలో జాప్యం చేస్తూ వస్తున్నారు.

* భీమవరంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మంగళవారం నాడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏపీ సీఎం జగన్‌తో పాటు భీమవరం ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. జగన్‌ తాలూకూ జలగలను తీసిపారేయాలని.. భీమవరంలో ఉండే జలగలతో సహా వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏస్థాయికి వస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు. స్థానికంగా రౌడీయిజం పోవాలని ధ్వజమెత్తారు. పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌కు ఇంటి స్థలం అమ్మే వ్యక్తులను తాను బెదిరించినట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్రంథి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ కావాలంటే భీమవరంలో తనకు ఉన్న 9 ఎకరాల్లో ఎంత కావాలంటే అంత ఇస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి.. కేవలం 24 సీట్లకే పరిమితమయ్యాడని.. ఇప్పుడు 21 సీట్లు మాత్రమే అంటున్నారని అన్నారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర పవన్‌ కళ్యాణ్‌ తాకట్టు పెట్టాడని విమర్శించారు.

* పెద్దపల్లి జిల్లా రామగుండంలోని(Ramagundam) 62.5మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం బీ థర్మల్‌( B Therma) విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తికి మళ్లీ అంతరాయం(Disrupted) కలిగింది. మంగళ వారం సాయంత్రం బాయిలర్‌ ట్యూబ్‌ లికేజీగా గుర్తించిన ఇంజినీర్లు వెంటనే యూనిట్‌లో విద్యుత్‌ను నిలిపివేసి యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. గురువారం సాయంత్రం వరకు ఉత్పత్తి దశలోకి వచ్చేలా పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

* త్వరలో ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లు నియామకమయ్యే అవకాశం ఉన్నది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెలక్షన్‌ కమిటీ సమావేశం జరుగనున్నది. కమిషనర్ల నియామకం తర్వాత సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు నోటిఫికేషన్‌ మరో ఐదారు రోజులు పడుతుందని పేర్కొన్నాయి. సెలక్షన్‌ కమిటీ సమావేశానికి ముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదర్‌ న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఎలక్షన్‌ కమిషనర్‌ పదవికి ఎంపిక చేసిన అభ్యర్థుల బయోడేటాతో వివరాలను పంపాలని మంత్రిత్వ శాఖను కోరారు.

* పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సీఏఏ)పై ఆప్ నేత‌, ఢిల్లీ మంత్రి అతిషి కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. పాకిస్తాన్‌, ఆప్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన శ‌ర‌ణార్ధులు త‌ల‌దాచుకునేందుకు రెండు కోట్ల ఇండ్ల‌ను బీజేపీ స‌మ‌కూరుస్తుందా అని ఆమె ప్ర‌శ్నించారు. వారికిచ్చేందుకు బీజేపీ వ‌ద్ద కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల ఇండ్లు ఏమైనా ఉన్నాయా అని ఆమె నిల‌దీశారు.

* షహరాన్‌పూర్‌లోని భైలా గ్రామానికి చెందిన అంకిత్‌ అనే వ్యక్తికి మీరట్‌లోని కుషావలీ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. వీరి వివాహ తంతుకు వధువు ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అంకిత్‌ తన గ్రామం నుంచి పెళ్లి మండపానికి కారులో బయల్దేరాడు. అయితే, అంతా వెళ్లేలా కారు లోపల కూర్చోకుండా.. టాప్‌ పైకి ఎక్కి విగ్రహంలా నిల్చొని ఊరేగింపుగా బయల్దేరాడు. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై అతని ఫొటోలు తీసేందుకు డ్రోన్‌ను కూడా ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు విషయం తెలుసుకున్న మన్సూర్‌పూర్‌ పోలీసులు వరుడికి షాకిచ్చారు. ఎన్‌హెచ్‌-58లో వరుడి బరాత్‌ను అడ్డుకున్నారు. ఊరేగింపుకు ఉపయోగించిన ఎస్‌యూవీ వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఖతౌలీ సర్కిల్‌ ఆఫీసర్‌ యతేంద్ర సింగ్‌ నగర్‌ తెలిపారు. వరుడు వివాహ వేదిక వద్దకు మరో కారులో వెళ్లేందుకు అనుమతించినట్లు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z