Politics

పిఠాపురం నుండి రాంగోపాల్‌వర్మ పోటీ-NewsRoundup-Mar 14 2024

పిఠాపురం నుండి రాంగోపాల్‌వర్మ పోటీ-NewsRoundup-Mar 14 2024

* కాంగ్రెస్‌ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో తీవ్ర నీటి సంక్షోభం (Water Crisis ) నెలకొన్న విషయం తెలిసిందే. గ‌త ఏడాది స‌రిప‌డినంత వ‌ర్షపాతం న‌మోద‌వ‌క‌పోవ‌డంతో బెంగ‌ళూర్‌లో ఎన్నడూ లేని విధంగా నీటి సంక్షోభం త‌లెత్తింది. దీంతో అవసరాలకు సరిపడా నీరు లేక నగర వాసులు గత నెలరోజులకు పైగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. 60 శాతం మంది పైగా నీటి కోసం ట్యాంక‌ర్లపై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. నీటి కోసం జనం ట్యాంకుల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నీటి సంక్షోభంపై కర్ణాటక డిప్యూటీ సీఎం (Karnataka Deputy Chief Minister) డీకే శివకుమార్‌ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి కొరతే లేదంటూ వ్యాఖ్యానించారు. నగరంలో ఉన్న నీటి వనరులను గుర్తించామని.. ప్రజలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సరైన సమయానికి అందరికీ నీళ్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘బెంగళూరులో నీటి సంక్షోభం అనేదే లేదు. సిటీలో 7 వేల బోర్‌వెల్స్ ఎండిపోయాయి. అయినా ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంది. నీటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాం. ఎవరికీ సమస్య రాకుండా ట్యాంకర్‌లను ఏర్పాటు చేసి నీళ్లు సరఫరా చేస్తాం. అందరికీ నీళ్లు సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

* ఏపీలో కూటమి జాబితా రెండు పార్టీల్లో చిచ్చును రేపుతుంది. స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు టికెట్‌ ఇస్తే సహించేది లేదంటూ నిరసనలు తెలుపుతున్నారు. పెనుమలూరు(Penumalur) లో స్థానికేతరుడికి టికెట్‌ ఇవ్వడాన్ని నియోజకర్గ నాయకులు బోడె ప్రసాద్‌, అనుచరులు తీవ్ర నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్త (TDP worker ) ఒకరు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అక్కడే ఉన్న నాయకులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా బోడే ప్రసాద్‌(Bode Prasad) మాట్లాడుతూ ఐదేండ్లు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని, ఇందుకోసం కొట్లాది రూపాయలను వెచ్చించానని అన్నారు. నియోజకవర్గంలో స్థానికులకు ఎవరికి టికెట్‌ ఇచ్చినా సహకరిస్తామని, స్థానికేతరులకు ఇస్తే చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్‌గా నైనా పోటీ చేసి గెలుస్తానని పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని తెలిపారు. నాకు టికెట్‌ ఇవ్వడం లేదని తెలిసి నా గుండె పగిలిందని వాపోయారు. నేను ఇక్కడే ఉండి పోరాటం చేస్తానని ప్రకటించారు.

* ఇకపై ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికల మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. అయితే, తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డితో బెంగళూరు వెళ్లిన అక్కడ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నారని ప్రచారం జరిగింది. అయితే, పార్టీ మారనున్నారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. బెంగళూరులో డీకే శివకుమార్‌ను ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిసినట్లు తెలిపారు. రెండు రోజుల కింద కలిశానని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్‌ నాకు మిత్రుడని పేర్కొన్నారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీల నుంచి పోటీచేయరన్నారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే నాకు చివరి ఎన్నికలని స్పష్టత ఇచ్చారు.

* జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. పదేండ్ల సమయాన్ని, డబ్బు ఖర్చుపెట్టినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనను పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంపాదనను, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించిన గుర్తింపు దక్కలేదని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. అందులోనే మన ప్రభుత్వం వస్తుంది.. అందరికీ న్యాయం చేస్తుందని బొలిశెట్టి పేర్కొన్నారు. ఇప్పుడు కావాల్సింది సంయమనం.. చేయాల్సింది యుద్ధం అని రాసుకొచ్చారు.

* రాజకీయాల్లో నడిగడ్డకు ప్రత్యేక చరిత్ర ఉందని, కాంగ్రెస్ వారు చూపే ప్రలోభాలకు స్థానిక సంస్థల ప్రతినిధులు గురై భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి (Naveen Kumar Reddy) మద్దతుగా స్థానిక సంస్థల ప్రతినిధులతో సన్నాhaక సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు.

* వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(MP Sanjeev Kumar) గురువారం ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ(TDP) లో చేరారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను టీడీపీలో చేరానని వెల్లడించారు. వైసీపీలో సామాజిక న్యాయం లేదని ఆయన విమర్శించారు.

* జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురం(Pithapuram) జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేయనున్నారు. ఈ మేరకు ఆయనే గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేనని , ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందని స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలంలో జనసేన(Janasena) ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన పవన్‌కల్యాణ్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. గతంలో గాజువాక, భీమావరం నుంచి పోటీ చేశానని తెలిపారు. పాపం జగన్‌కు గ్రాఫిక్స్‌ (Jagan Graphics) పై అవగాహన లేదని దుయ్యబట్టారు. నన్ను కొట్టే ప్రతి దెబ్బను వాడుకుని ఎదుగుతానని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతున్నామని ధీమాను వ్యక్తం చేశారు. జగన్‌ పోతాడు.. వైసీపీ పోతుంది. పొత్తులు గెలుస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రతినెలా జనవాణి నిర్వహిస్తామని ప్రకటించారు.

* పంజాబ్‌లో 8 లోక్‌స‌భ స్థానాల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) పోటీ చేయ‌నున్న‌ది. ఆ 8 మంది స‌భ్యుల జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో అయిదు మంది ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే ఉన్నారు. అమృత్‌స‌ర్ నుంచి మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖ‌ద్దూర్ సాహిబ్ నుంచి లాల్‌జిత్ సింగ్ భుల్లార్‌, బ‌ఠిండా నుంచి గుర్మీత్ సింగ్ కుడియా, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీట్ హ‌య‌ర్‌, పాటియాలా నుంచి బ‌ల్బీర్ సింగ్ పోటీ చేయ‌నున్నారు. ఫ‌తేఘ‌ర్ సాహిబ్ సీటు నుంచి గురుప్రీత్ సింగ్ జీపీని రంగంలోకి దించారు. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఆయ‌న ఈమధ్యే ఆప్‌లో చేరారు. ఫ‌రీద్‌కోట్ స్థానం నుంచి పంజాబీ న‌టుడు క‌రంజిత్ అన్మోల్ పోటీలో ఉన్నారు. పంజాబ్‌లో మొత్తం 13 పార్ల‌మెంట‌రీ స్థానాలు ఉన్న విష‌యం తెలిసిందే.

* ప్ర‌ముఖ హాలీవుడ్ సింగ‌ర్ ‘ఎడ్ షీరన్’ (Ed Sheeran) భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న ఈ సింగ‌ర్ న‌గ‌రమంతా చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. మంగ‌ళ‌వారం ఒక పాఠశాలను సందర్శించిన ఎడ్ అక్కడ పిల్లలతో కాసేపు సమయం గడిపాడు. అనంతరం బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా ఏర్పాటు చేసిన పార్టీలో సందడి చేసి అర్మాన్ మాలిక్ తో కలిసి బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేశాడు. అయితే బుధ‌వారం రాత్రి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను క‌లుసుకున్నాడు ఎడ్.

* ఏపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ(TDP) పూర్తిస్థాయిలో సన్నద్ధం అవుతుంది. పది రోజుల క్రితం మొదటి జాబితాను ప్రకటించిన చంద్రబాబు(Chandra Babu) గురువారం 34 మందితో కూడిన రెండో జాబితాను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 144లో 128 మంది పేర్లను వెల్లడించినట్లయింది. మరో 16 స్థానాలకు ఆయన తుది విడతను జాబితాను వెల్లడించే అవకాశముంది. మొత్తం 175 స్థానాలకు గాను పొత్తుల్లో భాగంగా టీడీపీ 144, జనసేన 21 సీట్లు, బీజేపీ 10 అసెంబ్లీను పంచుకున్నారు. ఏపీలో 25 పార్లమెంట్‌ స్థానాలుండగా 17 టీడీపీ , జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

* ఏపీ వాసులకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య పరుగులుపెట్టే వందేభారత్ రైలును ఈ నెల 12న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు తిరిగే ఈ వందేభారత్ రైలు టికెట్లు మార్చి 17 నుంచి ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ప్రయాణీకులకు లభిస్తాయి. ప్రతీ రోజూ ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో 20841 రైలు నెంబర్‌తో బయల్దేరే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఖుర్దారోడ్(ఉదయం 5.33 గంటలకు), బలుగావ్(ఉదయం 6.23 గంటలకు), ఇచ్చాపురం(ఉదయం 7.18 గంటలకు), పలాస(ఉదయం 8.18 గంటలకు), శ్రీకాకుళం రోడ్(ఉదయం 9 గంటలకు), విజయనగరం(ఉదయం 9.43 గంటలకు) ఈ ట్రైన్ స్టాప్‌లు. అలాగే తిరుగు ప్రయాణంలో 20842 రైలు నెంబర్‌తో బయల్దేరే ఈ రైలు.. మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి.. రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 443 కిలోమీటర్లను సుమారు 5.45 గంటల్లో కవర్ చేస్తుంది. ఈ ట్రైన్‌లో రెండు ఏసీ చైర్ కారు, ఆరు ఎగ్జిక్యూటివ్ చైర్ కారు బోగీలు ఉన్నాయి.

* నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే ఆర్జీవీ ఇప్పుడు ఎందుకు ఈ ట్వీట్ చేశారు అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆర్జీవీ పవన్ పై సెటైరికల్ గా ఈ ట్వీట్ చేశారా..? లేక పవన్ కు పోటీగా ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా.? అని అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z