ScienceAndTech

టెస్లా ఇండియా రాకకు మార్గం సుగమం-BusinessNews-Mar 15 2024

టెస్లా ఇండియా రాకకు మార్గం సుగమం-BusinessNews-Mar 15 2024

* దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించేందుకు గానూ కేంద్రం ఇ-వెహికల్‌ పాలసీని (E-Vehicle Policy) తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల దేశం ఈవీల తయారీకి గమ్యస్థానంగా మారడంతో పాటు అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. దేశంలోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా కార్ల తయారీ కంపెనీ టెస్లాకు ఈ పాలసీ ద్వారా మార్గం సుగమమైంది. కొత్త ఈవీ పాలసీ ప్రకారం.. ఏదైనా కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు (5 వేల మిలియన్‌ డాలర్లు) దేశంలో పెట్టుబడిగా పెడితే.. పలు రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్తతరహా సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు మేకిన్‌ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. పైగా పర్యావరణానికి మేలు జరుగుతుందని, క్రూడాయిల్‌ దిగుమతులు తగ్గి తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని తెలిపింది.

* కేరళకు చెందిన నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ముత్తూట్‌ మైక్రోఫిన్‌ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ ఏడాది జూన్‌ నాటికి ఆంధ్రప్రదేశ్‌లోకీ ప్రవేశించాలని యోచిస్తోంది. ఈ నెలలో తెలంగాణలోని భువనగిరి, జనగాం, హన్మకొండ, పరకాలలో నాలుగు శాఖలను ప్రారంభించనుందని కంపెనీ తెలిపింది. ఈ సంస్థ చిన్న వ్యాపారాలు చేసే మహిళలకు సూక్ష్మ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలో 18 రాష్ట్రాల్లోని 1,424 శాఖల ద్వారా 32.80 లక్షల యాక్టివ్‌ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. సంస్థ వృద్ధి వ్యూహంలో భాగంగా కొత్త ప్రాంతాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోందని సంస్థ సీఈఓ సదాఫ్‌ సయ్యద్‌ తెలిపారు. ముత్తూట్‌ పప్పాచాన్‌ గ్రూప్‌లో భాగమైన ముత్తూట్‌ మైక్రోఫిన్‌.. టైలరింగ్‌, కూరగాయల విక్రయం, టీ-షాప్‌ నడిపే చిన్న వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న మహిళలకు సూక్ష్మ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది.

* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో ఇటీవల వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు వడ్డీ రేట్ల తగ్గింపుపై నీలిమేఘాలు అలముకొనేలా చేశాయి. దీంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దేశీయ మార్కెట్‌ సూచీలూ అదే బాటలో నడిచాయి. ఉదయం 72,886.77 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. ఇంట్రాడేలో 72,484.82 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 453.85 పాయింట్ల నష్టంతో 72,643.43 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 123.30 పాయింట్లు కోల్పోయి 22,023.35 వద్ద స్థిరపడింది.

* పేటీఎం (Paytm) పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్‌ షేర్లు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్ ప్రారంభమైన తర్వాత బీఎస్ఈలో ఐదు శాతం పెరిగి రూ.370.90 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ తాకాయి. గురువారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (NPCI) పేటీఎం ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వన్‌97 కమ్యూనికేషన్‌కు థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP)ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కెట్లో పేటీఎం షేర్ల విలువ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో కూడా ఐదు శాతం పెరిగి రూ.370.70 వద్ద కొనసాగుతున్నాయి.

* భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పుంజుకున్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 10.47 బిలియన్ డాలర్లు పెరిగి 636.1 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఈ నెల ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.55 బిలియన్ డాలర్లు పుంజుకుని 625.63 బిలియన్ డాలర్లకు చేరాయి.

* ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టంచేశారు. ఆ ప్రచారం ఉత్త ఊహాగానమేనని కొట్టిపారేశారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆమె మాట్లాడారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z