Business

ఉద్యోగులకు ఎయిరిండియా ఉద్వాసన-BusinessNews-Mar 16 2024

ఉద్యోగులకు ఎయిరిండియా ఉద్వాసన-BusinessNews-Mar 16 2024

* ఎయిరిండియా కంపెనీ సంస్థలో 180 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత కొన్ని వారాల్లో 180 మందికి పైగా నాన్‌-ఫ్లయింగ్‌ సిబ్బందికి ఎయిరిండియా లేఆఫ్‌ ఇచ్చింది. ఈ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలు, పునర్‌నైపుణ్య అవకాశాలను వినియోగించుకోలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 జనవరిలో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన తర్వాత.. వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు టాటా గ్రూప్‌ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొంతమంది సిబ్బందికి లేఆఫ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

* దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.26 కోట్ల మంది ప్రయాణం చేశారని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది. 2023 ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.20 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.8% అధికం. ఈ ఏడాది జనవరిలో ప్రయాణించిన 1.31 కోట్ల మందితో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. గత నెలలో విమానాల జాప్యం కారణంగా 1.55 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సర్వీసులు రద్దు చేయడంతో 29,143 మంది ప్రయాణికులపై ప్రభావం పడగా, సంస్థలు పరిహారంగా రూ.99.96 లక్షలు చెల్లించాయి.

* లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2022 నుంచి ప్రాథమిక వేతనాలను 16 శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఆమోదించింది. ఈ తాజా నిర్ణయంతో ఎల్‌ఐసీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఉన్న బకాయిలు పొందనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం తెలిపిన ప్రాథమిక వేతనం పెంపుతోపాటు అలవెన్సులతో కలిపి మొత్తం 22 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వేతన పెంపుతో 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 30,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

* భారత్‌, బ్రిటన్‌ (India-UK) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాని (Free Trade Agreement)కి సంబంధించి తాజాగా జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అయితే, ఈ ఒప్పందం ఇప్పుడప్పుడే ఖరారయ్యే అవకాశాలు కన్పించట్లేదు. ఎన్నికల (Elections) నేపథ్యంలో చర్చలకు తాత్కాలికంగా విరామమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటిష్ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. మరికొద్ది రోజుల్లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అటు బ్రిటన్‌ కూడా ఈ ఏడాదే సాధారణ ఎన్నికలకు వెళ్లనుంది. 2024 రెండో అర్ధభాగంలో అక్కడ ప్రధానిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘చర్చల నుంచి ఇరు వర్గాలూ వైదొలగడం లేదు. ఉమ్మడి ఆశయాలకు అనుగుణంగా ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు’’ అని బ్రిటిష్‌ అధికారి ఒకరు చెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

* ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రైవేటు రంగ యెస్‌ బ్యాంకు దక్షిణాది రాష్ట్రాలపై మరింత దృష్టి పెట్టింది. అందులోనూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బాగా దగ్గర కావాలని భావిస్తోంది. ఇందుకోసం కొత్తగా ప్రారంభించే 200 శాఖల్లో ఎక్కువభాగం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభిస్తామని యెస్‌ బ్యాంకు ఎండీ, సీఈఓ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో యెస్‌ బ్యాంకు వ్యాపారం బాగా పెరుగుతున్నట్లు వివరించారు. 2023 డిసెంబరు నాటికి హైదరాబాద్‌తో తమకు 2.64 లక్షల మంది ఖాతాదార్లున్నారని, 2022 డిసెంబరుతో పోల్చితే ఈ సంఖ్య 30% అధికమని తెలిపారు. హైదరాబాద్‌లో డిపాజిట్లు 16.6% వృద్ధితో రూ.8,887 కోట్లకు, రుణాలు 24% వృద్ధితో రూ.11,157 కోట్లకు చేరుకున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 యెస్‌ బ్యాంకు శాఖలు ఉండగా, ఈ నెలాఖరు లోపు మరో 4 ప్రారంభించనున్నారు. నల్లగండ్ల, కోకాపేట, నిజాంపేట, మల్కాజ్‌గిరిలలో ఈ కొత్త శాఖలు ఏర్పాటవుతాయి. ఆ తర్వాత మరో 2 శాఖలు ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z