Devotional

సద్గురుకు బ్రెయిన్ సర్జరీ-NewsRoundup-Mar 20 2024

సద్గురుకు బ్రెయిన్ సర్జరీ-NewsRoundup-Mar 20 2024

* పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు దాదాపు 2వేల చీరలు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు విజయభాస్కర్‌రెడ్డికి చెందిన కేవీఆర్‌ మార్టులో ఓటర్లకు పంచేందుకు చీరలు సిద్ధంగా ఉంచారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలికి చేరుకుని చీరలు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తెదేపా నాయకులతో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.

* తెలంగాణలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని 5,348 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఈమేరకు ఈనెల 16నే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్‌, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్‌, ఎంఎన్‌ జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు జారీ చేశారు. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించారు. ఇందుకోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతకు సంబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాలని చెప్పారు. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేషన్‌ ఇచ్చి నేరుగా ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు.

* మనీ లాండరింగ్‌ కేసుల్లో విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అనుసరిస్తోన్న తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) విచారం వ్యక్తం చేసింది. నిందితులకు డీఫాల్ట్‌ బెయిల్‌ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జ్‌షీట్లు దాఖలు చేయడాన్ని ప్రశ్నించింది. విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచే ఈ పద్ధతి న్యాయస్థానాన్ని ఇబ్బందికి గురిచేస్తోందని పేర్కొంది. ‘‘విచారణ పూర్తయ్యేంతవరకు నిందితులను అరెస్టు చేయకూడదనేది డీఫాల్ట్‌ బెయిల్‌ ముఖ్య ఉద్దేశం. దర్యాప్తు పూర్తయ్యేవరకు విచారణ చేయొద్దని మీరు చెప్పలేరు. అరెస్టు కూడా చేయడానికి వీలులేదు. అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేస్తూ.. విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచలేరు’’ అని ఈడీ తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజుకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం సూచించింది.

* శాకాహారం మాత్రమే కోరుకునే వారికోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ (Pure Veg Fleet)ను ప్రారంభిస్తున్నట్లు జొమాటో (Zomato) వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే డెలివరీ బాయ్స్‌ యూనిఫామ్‌ రంగు విషయంలో విమర్శలు రావడంతో ఎరుపు రంగు యూనిఫామ్‌నే కొనసాగిస్తామని సంస్థ ప్రకటించింది. అయితే దీనిపై తాజాగా గ్రామీ అవార్డు విజేత రికీ కెజ్‌ స్పందించారు. ఈ కొత్త సేవలు ఎవరినీ బాధించవని అన్నారు. ఈమేరకు ఎక్స్‌ (గతంలో ట్విటర్) వేదికగా స్పందించారు.

* భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతోపాటు చేరిన కోహ్లీ.. డబ్ల్యూపీఎల్‌ విజేతగా నిలిచిన మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్సీబీ కెప్టెన్లు ఫాఫ్‌ డుప్లెసిస్‌, స్మృతి మంధానతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సింగిల్ టైటిల్‌ను డబుల్‌ చేస్తే మరెంతో ప్రత్యేకమవుతుంది. ఈ సందర్భంగా అభిమానులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మొదట నన్ను ‘కింగ్‌’ అనే పదంతో పిలవడం ఆపేయండి. ఇలాంటి పదంతో పిలిస్తుంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. నన్ను విరాట్ అని మాత్రమే పిలిస్తే చాలు. అని అన్నాడు.

* శివసేన, ఎన్సీపీ పార్టీల్లో చీలికలకు తాము కారణం కాదని భాజపా(BJP) అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) అన్నారు. ‘న్యూస్‌ 18’ ఆధ్వర్యంలోని రైజింగ్ భారత్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీలను చీలుస్తున్నారని మాపై ఆరోపణలు చేసేవారు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray)కు ఉన్న ‘పుత్ర ప్రేమ్‌’(కుమారుడిపై ప్రేమ).. శివసేన రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణమైంది. ఏక్‌నాథ్‌ శిందే అర్హతకు తగ్గట్టుగా బాధ్యతలు ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇక ఎన్సీపీ విషయానికి వస్తే.. శరద్‌ పవార్(Sharad Pawar) ‘పుత్రి ప్రేమ్‌’(కూతురిపై ప్రేమ) దానిని చీల్చింది. అజిత్‌ పవార్‌కు సముచిత గౌరవం దక్కితే.. ఆయన బయటకు వచ్చేవారే కాదు’ అని అమిత్‌ షా విశ్లేషించారు.

* రామేశ్వరం కెఫే బాంబు పేలుడు(Rameshwaram Cafe Blast) కేసులో నిందితుడికి సంబంధించిన ప్రాంతం గురించి కేంద్రమంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో మంత్రి క్షమాణలు చెప్పాల్సివచ్చింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్టు పెట్టారు. నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుధాలను వినియోగించడంలో ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాడని ప్రాథమికంగా తేలింది. దాంతో మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అనుసరిస్తోన్న బుజ్జగింపు రాజకీయాలే కారణమంటూ విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె క్షమాపణలు తెలిపారు.

* పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) – హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న యాక్షన్‌ డ్రామా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad BhagatSingh). మంగళవారం సాయంత్రం ఈ సినిమా నుంచి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ప్రోమో విడుదలైంది. దీనిని ఉద్దేశించి ఓ రాజకీయ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్‌ చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదన్నారు. సినిమాలోని ఒక సీన్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక వ్యక్తి గాజు గ్లాస్‌ కింద పడేస్తాడు. అది ముక్కలవుతుంది. షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఈ సీన్ ఎందుకు రాశావు అని హరీశ్‌ శంకర్‌ను అడిగా. ‘‘అందరూ మీరు ఓడిపోయారు అంటున్నారు. వాళ్లందరికీ నేను ఒక్కటే చెబుతున్నా. గాజుకు ఉన్న లక్షణం ఏమిటంటే.. పగిలేకొద్ది పదునెక్కిద్ది. మీ నుంచి మేము ఇలాంటివి కోరుకుంటాం. మీరు తగ్గితే మాకు నచ్చదు’’ అని హరీశ్‌ చెప్పాడు. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్‌ చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ, హరీశ్‌ శంకర్‌ బాధపడలేక ఆ డైలాగ్‌ చెప్పా’’ అని అన్నారు.

* ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో (World Happiness Report) ఫిన్లాండ్‌ మరోసారి అగ్రభాగాన నిలిచింది. ఏడు దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవ’మైన బుధవారం (మార్చి 20న) యూఎన్‌ ఆధారిత సంస్థ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌(1), డెన్మార్క్‌(2), ఐస్‌లాండ్‌(3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఈ జాబితాలో (World Happiness Report) భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. చైనా (60), నేపాల్‌ (93), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌(118) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది.

* ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అనూహ్యంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటోన్న సద్గురుకు స్కానింగ్‌ నిర్వహించగా.. బ్రెయిన్‌లో కొంత తేడాను గమనించారు వైద్యులు. ఈ నెల 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తరలించగా.. ఆయనకు బ్రెయిన్‌ సర్జరీని విజయవంతంగా చేసినట్టు తెలిసింది.

* పార్లమెంట్‌ ఎ‍న్నికల వేళ పలువురు కీలక నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు పార్టీలు మారుతూ రాజకీయ వేడిని పెంచుకుతున్నాయి. తాజాగా సస్పెండెడ్‌ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్‌ పార్టీ చేరారు. ఐదు రోజుల కింద డానిష్‌ అలీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆరోజు నుంచే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని ఊహాగానాలు ఉచ్చాయి. అనుకున్నట్టుగానే ఆయన బుధవారం కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి సీట్ల పంపణీలో పొందినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్రలో డానిష్‌ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ, విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్‌ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z