అతడో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్. వయసు 60 ఏళ్లు. ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. ప్రస్తుతం అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే చట్టపరంగా సాధ్యం కావడం లేదు. దీంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ సలహా ఇచ్చారు. పెళ్లి చేసుకుని భార్యను నిలబెట్టాలని సూచించారు. దీంతో ఓ మహిళను అతడు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యను ఆర్జేడీ తరఫున ఎన్నికల బరిలోకి దింపబోతున్నాడు. నవాదా జిల్లాలోని కోనన్‌పుర్ గ్రామానికి చెందిన అశోక్ మహతో అనే గ్యాంగ్‌స్టర్ కథే ఇది. షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతోపాటు నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి విడుదలయ్యాడు. లాలూ సూచనతో పట్నా భక్తియార్‌పుర్‌లోని కరౌటా జగదాంబ ఆలయంలో ఓ మహిళను మంగళవారం రాత్రి తన మద్దతుదారుల మధ్య అశోక్ మహతో వివాహం చేసుకున్నాడు. ముంగేర్ బరియార్‌పూర్ గ్రామానికి చెందిన ఆమె గతంలో దిల్లీలో పని చేసేది. ఇక తన భార్యను ముంగేర్ లోక్‌సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా అశోక్ మహతో పోటీలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, జేడీయూ నేత లాలన్ సింగ్ పోటీ చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z