WorldWonders

శివబాలకృష్ణ స్కాం…ప్రభుత్వానికి ₹3800కోట్ల నష్టం-CrimeNews-Mar 21 2024

శివబాలకృష్ణ స్కాం…ప్రభుత్వానికి ₹3800కోట్ల నష్టం-CrimeNews-Mar 21 2024

* కర్ణాటక సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో సీఎం జగన్ ఫొటోతో ఉన్న చేతి గడియారాలు బయటపడటం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు డేగ కన్ను వేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి బాగేపల్లి చెక్ పోస్టు వద్ద సోదాలు చేస్తుండగా… ఏపీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న 96 వాచీలను ఎన్నికల అధికారులు గుర్తించారు.

* ఒక యువతి కిడ్నాప్‌ డ్రామా ఆడింది. కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బంధించారని ఆరోపించింది. (Woman fakes kidnapping) చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలు తండ్రి మొబైల్‌కు పంపింది. విడిపించేందుకు రూ.30 లక్షలు డిమాండ్‌ చేసింది. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ కిడ్నాప్‌ వ్యవహారాన్ని బయటపెట్టారు.

* హైద‌రాబాద్‌లోని లింగంప‌ల్లి రైల్వే స్టేష‌న్‌లో 10 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైద‌రాబాద్‌కు ఓ వ్య‌క్తి గంజాయి త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు లింగంప‌ల్లి స్టేష‌న్‌కు చేరుకుని నిఘా ఉంచారు. రైలు దిగి స్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న ఆ యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువ‌కుడి బ్యాగులో ఉన్న 10 కిలోల గంజాయిని సీజ్ చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

* తవ్వేకొద్దీ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో టీడీఆర్‌ స్కాం వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. కృష్ణకుమార్‌ని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పని చేసిన బీవీ కృష్ణ కుమార్.. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్‌ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ చర్య వల్ల ప్రభుత్వానికి 3800 కోట్ల నష్టం జరిగిందని‌ ఏసీబీ అంచనా వేస్తోంది. మరో ఇద్దరు హెచ్‌ఎండీఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బడా బిల్డర్ల ప్రాజెక్ట్‌ల ప్లానింగ్‌లో టీడీఆర్‌ విలువ తగ్గించి, తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి నష్టం చేశారు. శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణకుమార్‌ అమెరికాకు వెళ్లిపోగా, అక్కడ నుంచి హైదరాబాద్‌కు రప్పించే ప్రయత్నాలను ఏసీబీ అధికారులు చేస్తున్నారు. శివబాలకృష్ణ, కృష్ణ కుమార్, మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు సిండికేట్‌పై ఏసీబీ దృష్టి పెట్టింది.

* పేగు బంధాన్ని మరిచి కన్న పేగునే గాలి కొదిలేసింది ఓ మహిళ. అభం శుభం తెలియని ఎనిమిది నెలల ఆడ శిశువును రాత్రి వేళ పొలాల్లో వదిలేసి వెళ్లడంతో కుక్కలు పీక్కుతిన్నాయి. స్థానికులను తీవ్రంగా కలచి వేసిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేస్లాపూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ బుధవారం రాత్రి పొలంలో పసిబిడ్డను పడేసి వెళ్లింది. వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేయడంతో ప్రాణాలు విడిచింది. శరీర భాగాలను పీక్కుతిని సుమారు అర కి.మీ. దూరం లాక్కెళ్లి పడేశాయి. మృతదేహాన్ని గమనించిన స్థానికులు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై విజయ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z