* దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులు సభలు, సమావేశాల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఈ హడావుడి ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లలోనూ కనిపిస్తోంది. భాజపా కమలం బ్యాడ్జ్‌లు, ఆప్ లోగోతో గడియారాలు, కాంగ్రెస్ కండువాలు.. ఇలా ఎలెక్షన్ థీమ్‌తో వివిధ రకాల వస్తువులు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ-కామర్స్ సైట్లలోని సెర్చ్ బార్లో రాజకీయ పార్టీ పేరు ఎంటర్ చేస్తే చాలు జెండాలు, లాకెట్లు, పెన్నులు, కండువాలు.. ఇలా రకరకాల వస్తువులు తెరపై దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రెండ్ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రారంభమైంది. కానీ, 2020 కరోనా సంక్షోభం కావడంతో ఆదరణ తగ్గింది. కాని ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈసారి తాకిడి మరింత ఎక్కువగా ఉంది. అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు వీటిని మాత్రం ఎందుకు విక్రయించొద్దనే ఉద్దేశంతోనే విక్రేతలు ఎలక్షన్ ఆధారిత వస్తువులను సైతం తమ సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
* ఐపీఎల్ వేళ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ (prepaid plan) యూజర్ల కోసం ‘‘అన్లిమిటెడ్ డేటా’’ పేరుతో రూ.49 రీఛార్జి ప్లాన్ ప్రవేశపెట్టింది. జియో తీసుకొచ్చిన కొత్త డేటా ప్లాన్ ఒక రోజు వ్యాలిడిటీతో 25జీబీ డేటా అందిస్తోంది. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే దీన్ని రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
* దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) ద్విచక్ర వాహన విభాగంలో నూతన అంకానికి తెర లేపనుంది. ఈ ఏడాది జూన్ నాటికి తొలి సీఎన్జీ బైక్ (CNG Bike)ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ (Rajiv Bajaj) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ (CSR) కింద రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ‘‘పర్యావరణ పరిరక్షణతోపాటు అధిక మైలేజ్ కోరుకునే బైకర్లను దృష్టిలో ఉంచుకుని బజాజ్ ఆటో సీఎన్జీ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ బైక్‌ను మరో కొత్త బ్రాండ్ పేరుతో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. తయారీ వ్యయం ఎక్కువకావడం వల్ల పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే ధర ఎక్కువగా ఉంటుంది. ఇందులో పెట్రోల్, సీఎన్జీ రెండు ఆప్షన్లు ఉంటాయి. దీని కోసం బైక్ ట్యాంక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాం. 20 ఏళ్ల క్రితం విడుదలైన పల్సర్ బైక్‌కు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించింది. త్వరలో ఇది 2 మిలియన్ యూనిట్ల మైలు రాయిని చేరుకోనుంది. పల్సర్ తరహాలోనే బజాజ్ సీఎన్జీ బైక్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అని రాజీవ్ బజాజ్ తెలిపారు.
* విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు 642.50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ నెల 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.396 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 642.492 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు వారం 10.47 బిలియన్ డాలర్ల వృద్ధితో 636.095 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్లతో ఆల్‌టైం గరిష్ట స్థాయిని తాకాయి. 2021 అక్టోబర్ తర్వాత డాలర్‌పై రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తల ప్రభావంతో తగ్గిన ఫారెక్స్ నిల్వలు.. తాజాగా క్రమంగా పుంజుకుంటున్నాయి.
* అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలతో శుక్రవారం దేశీయ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.875 తగ్గి రూ.66,575 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం ధర రూ.67,450 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే. మరోవైపు గురువారంతో పోలిస్తే కిలో వెండి ధర రూ.77,750 నుంచి రూ.760 తగ్గి రూ.76,990 వద్ద ముగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం స్పాట్ గోల్డ్ (24 క్యారట్స్) ధర రూ.875 తగ్గి రూ.66,575 వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ కుమార్ చెప్పారు. గ్లోబల్ మార్కెట్లలో కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 35 డాలర్లు క్షీణించి 2167 డాలర్ల వద్ద ముగిసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z