* నగర శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఐడీఏ బొల్లారంలో భారీగా దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే మాదక ద్రవ్యాలను శుక్రవారం డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ పోల్ సహకారంతో బొల్లారంలో డ్రగ్స్ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. స్థానికంగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పీఎస్‌ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి.. రూ. 9 కోట్ల విలువైన 90 కిలోల మేపిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత పదేళ్లుగా ఈ డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. విదేశాలకు తరలిస్తున్న కస్తూరిరెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో వాటిని పెట్టి బయటకు తరలిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోనూ నిషేధిత డ్రగ్స్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
* కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీ కోరిన ఈడీ. సుధీర్ఘ వాదనలు వినిపించిన ఇరువర్గాల లాయర్లు. తీర్పు రీజర్వ్ చేసిన జడ్జి. అరెస్ట్ అవసరం ఏంటో చెప్పాలన్న కేజ్రీవాల్ లాయర్లు. అరెస్ట్ అక్రమమని వాదన. తనిఖీలకు కేజ్రీవాల్ సహకరించలేదన్న ఈడీ లాయర్లు.
* టిడిపి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ఎగవేశారు గంటా శ్రీనివాసరావు అండ్ కో. ఏకంగా రూ. 390 కోట్ల 7 లక్షల 52 వేల 945 రుణం ఎగవేసినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరిట గతంలో కూడా ఓ బ్యాంకుకు టోకరా పెట్టారు గంట శ్రీనివాసరావు అండ్ కో. అప్పుకు సంబంధించి జప్తుగా పెట్టిన జీవీఎంసీ సమీపంలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో గంటా అండ్ కో ఆస్తులను వేలంపాట వేయాలని బ్యాంకు ఇవ్వాళ నోటీసులిచ్చింది. పద్మనాభం మండలం అయినాడ వద్ద స్థిరాస్తిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటీసులో తెలిపింది ఇండియన్ బ్యాంక్. 16-04-24 తేదీన 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది బ్యాంకు.
* లిక్కర్ కేసులో అరెస్టై.. ఊరట కోసం ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కెదురైంది. సుప్రీం కోర్టు శుక్రవారం ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ చేయలేమన్న సుప్రీం.. రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండబోదని, ట్రయల్ ఎదుర్కొని తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ‘‘చట్టం అందరికీ ఒకటే, రాజకీయ నాయకులైనంత ప్రత్యేక విచారణ ఇక్కడ జరపలేం. రిట్ పిటిషన్ లో లేవనెత్తి అంశాలను విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారణ జరపుతాం. ఈ కేసులో పిటిషనర్(కవిత) ట్రయల్ ఎదుర్కొని తీరాల్సిందే’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్ , జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే కవిత వేసిన రిట్ పిటిషన్‌కు సంబంధించి.. ఆరు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఈడీకి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
* నిర్మల్ జిల్లాలోని తాటిగూడ గ్రామంలో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేండ్ల చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. తాటిగూడ గ్రామానికి చెందిన అమర్ సింగ్, సరిత దంపతులకు కూతురు భూక్యా శాన్వి(4) ఉంది. అయితే మార్చి 2వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న శాన్విపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ పాపకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది శాన్వి. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
* ముంబై – గోరఖ్‌పూర్ గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటన నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించింది. సీటింగ్ కమ్ లగేజీ రేక్ కోచ్‌లో మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. ప్రయాణికులను ఇతర రైళ్లల్లో తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
* బేగంపేట పైగా కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలను తల్లీకూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శాలువాతో సత్కరించి, సన్మానించారు. దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్న తీరును డీసీపీ ప్రశంసించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z