* తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశానికి విజయవాడ వస్తుండగా.. ఆయన కారును గుంటూరు వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, తాను క్షేమంగా ఉన్నానని నాని ప్రకటించారు.
* సినీ రంగం నుంచి మరో నాయిక రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ నేహాశర్మ (Neha Sharma) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections 2024) పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిహార్ (Bihar) నుంచి ఆమెను బరిలోకి దింపాలని నేహా తండ్రి, కాంగ్రెస్ నేత అజిత్ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.
* మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఈడీ (ED) అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై జర్మనీ (Germany) విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ (MEA) పిలిచి నిలదీసింది.
* లోక్‌సభ ఎన్నికలకు మరో ఇద్దరు అభ్యర్థులను భారాస ప్రకటించింది. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ మినహా భారాస లోక్‌సభ అభ్యర్థులందరూ ఖరారయ్యారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మరో సారి అవకాశం ఇచ్చిన భారాస అధినేత కేసీఆర్.. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీకి కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. గులాబీ టికెట్లు పొందిన వారిలో ఇద్దరు విశ్రాంత అఖిలభారత సర్వీసు అధికారులు ఉన్నారు. ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించారు.
భారాస అభ్యర్థులు వీరే..
సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్
కరీంనగర్ – వినోద్‌కుమార్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
ఖమ్మం – నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్ – మాలోత్ కవిత
చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
వరంగల్ – డాక్టర్ కడియం కావ్య
జహీరాబాద్ – అనిల్‌కుమార్
నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
నాగర్‌కర్నూల్ – ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
మెదక్ – వెంకట్రామిరెడ్డి
మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి
మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
* ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కసరత్తు చేశామని చెప్పారు. సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదన్నారు. తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన, భాజపా నేతలు కూడా హాజరయ్యారు. ఇందులో చంద్రబాబు పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ‘‘ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనబడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోను. సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు మేం చూసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తాం. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశాం. నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేదే కూటమి లక్ష్యం. ఎన్డీయే కేంద్రంలో 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో కూటమికి 160కిపైగా అసెంబ్లీ సీట్లు వస్తాయి. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నాం. ఆ పార్టీ అభ్యర్థి.. ఈ పార్టీ అభ్యర్థి అని చూడొద్దు. అందరూ ఎన్డీయే అభ్యర్థులుగానే భావించాలి. మూడు పార్టీలు వేసే పునాది.. 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
* తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్ స్థానాలున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు భీమిలి టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు. చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చెబుతున్నారు. నిర్ణయం ఎటూ తేలకపోవడంతో ఈ రెండుచోట్లా అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో పడింది. తాజాగా శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్లను భాజపాకు కేటాయించడంతో… మరో మాజీమంత్రి కళా వెంకటరావు చీపురుపల్లి టికెట్ అడుగుతున్నారు. చీపురుపల్లికి ఆయన పేరూ పరిశీలనలో ఉంది. మరోపక్క నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో… అక్కడ తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న బంగార్రాజు పేరును భీమిలికి పార్టీ అధినాయకత్వం పరిశీలించింది. ఆయా స్థానాల అంశం గంటా, కళా వెంకటరావు, బంగార్రాజుల మధ్య తిరుగుతుండటంతో నిర్ణయం పెండింగ్‌లో పడింది.
* ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ మెరిసింది. దిల్లీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సామ్ కరన్ (63; 47 బంతుల్లో 6×4, 1×6) అర్ధ శతకం బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శిఖర్ ధావన్ (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26) పరుగులు చేశారు. బెయిర్ స్టో (9), జితేశ్ శర్మ(9) విఫలమయ్యారు. లివింగ్‌స్టోన్ (38*; 2×4, 3×6)), హర్‌ప్రీత్ బ్రర్ (2*) నాటౌట్‌గా నిలిచారు.
* విజయవాడలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన పార్టీ వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని నేతలు పట్టుకున్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ పని చేస్తున్నారని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది. కేశినేని చిన్ని ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నట్టు నేతలు ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఐజీ పంపితేనే వచ్చానని పట్టుబడిన కానిస్టేబుల్ చెప్పాడన్నారు. కేశినేని చిన్ని కదలికలపై నిఘా పెట్టినట్టు తమకు తెలిసిందన్నారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్‌లో లభ్యమయ్యాయన్నారు. ఉన్నతాధికారి సీతారామాంజనేయులు నేతృత్వంలో ట్యాపింగ్ వ్యవహారం జరుగుతోందని మండిపడ్డారు.
* అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన పార్టీ(Janasena)ఖరారు చేసింది. గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం, బాలరాజు పోలవరం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరికీ నియామక పత్రాలను అందజేశారు. తెదేపా, భాజపా, జనసేన పొత్తులో భాగంగా తొలుత పి.గన్నవరం సీటును తెదేపాకు కేటాయించారు. మహాసేన రాజేశ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ సీటును జనసేనకు కేటాయించారు.
* ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యవహరించడంపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును భువనేశ్వరి పంపిణీ చేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 20న నారా భువనేశ్వరీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని.. ఇది ఎన్నికల రూల్స్ ప్రకారం ప్రలోభాల కిందకే వస్తుందని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 21న ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.
* కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పోటీ చేస్తున్న వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మైనారిటీ ముఖ్య నేత ఏపీ అబ్దుల్లాకుట్టిని పోటీకి దింపవచ్చునన్న ప్రచారం సాగుతోంది. ఇక్కడ ఎల్‌డీఎఫ్ నుంచి అన్నీ రాజా పోటీలో ఉన్నారు. కేరళలో బీజేపీ 12 మంది అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించింది. దాని మిత్రపక్షమైన బీడీజేఎస్ కూడా నాలుగు స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్ మినహా మూడు నియోజకవర్గాలైన కొల్లాం, ఎర్నాకుళం, అలత్తూర్‌లలో అభ్యర్థుల ఖరారు ఒకటి లేదా రెండు రోజుల్లో వెలువడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట సీనియర్ నేత సందీప్ వారియర్‌ను బరిలోకి దించే అవకాశం ఉందని సమాచారం.
* ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావత్‌ను రనౌట్ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 251 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్.. తాజా రనౌట్‌తో కలిపి 24 రనౌట్లు చేశాడు. అంతకుముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. జడేజా 227 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 23 రనౌట్‌లు చేశాడు. తాజా రనౌట్‌తో జడేజా ఆల్‌టైమ్ రికార్డును 42 ఏళ్ల ధోని బ్రేక్ చేశాడు.