Business

ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు-BusinessNews-Mar 23 2024

ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు-BusinessNews-Mar 23 2024

* ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించింది. దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లి ధరల్ని అదుపు చేయడానికి, తగిన నిల్వల్ని అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన ఆంక్షల గడువు మార్చి 31తో ముగియనుంది. ఈనేపథ్యంలో వీటి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్రం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్‌లో తెలిపింది.

* నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్‌ కమ్యూనిటీలో రెండు పడక గదుల ఫ్లాట్‌ కొనుగోలు చేయాలంటే కోటి రూపాయలు ఉండాల్సిందే. ప్రస్తుతం నగరంలో సగటు చదరపు అడుగు ధర సుమారు రూ.5 వేలు పలుకుతోంది. ఇది బేస్‌ ధర మాత్రమే. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల గదికి రూ.70 లక్షల వరకు అవుతుంది. కారు పార్కింగ్‌, క్లబ్‌ హౌస్‌ సభ్యత్వం, గ్యాస్‌, ఈవీ ఛార్జింగ్‌ పాయింట్ల వంటి మౌలిక వసతుల కోసం మరో పది లక్షల వరకు తీసుకుంటున్నారు. 5 శాతం జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ ఛార్జీలు కలిపి మరో 10 లక్షల వరకు అవుతున్నాయి. ఇంటీరియర్‌ కోసం మరో రూ.పది లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.కోటి పెడితే రెండు పడకల ఫ్లాట్‌ మాత్రమే వస్తోంది.

* ప్రమోటర్‌ గ్రూప్‌.. వేదాంతా ప్రతిపాదిత హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ విభజనకు గనుల శాఖ నో చెప్పింది. హిందుస్తాన్‌ జింక్‌ను రెండు విభిన్న సంస్థలుగా విడదీసేందుకు వేదాంతా గ్రూప్‌ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు మైన్స్‌ సెక్రటరీ వీఎల్‌ కాంతారావు తాజాగా వెల్లడించారు. వాటాదారుగా కంపెనీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలియజేశారు. వెరసి విభజన ప్రతిపాదనను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కంపెనీలో ప్రభుత్వం 29.54 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)ను పెంచుకునే బాటలో జింక్, సిల్వర్‌సహా బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్‌ జింక్‌ ఇంతక్రితం ప్రతిపాదించింది. కాగా.. బిజినెస్‌ల విభజనకు సలహాదారు సంస్థను నియమించుకునే యోచనలో ఉన్నట్లు గతంలో హిందుస్తాన్‌ జింక్‌ ప్రకటించింది. కంపెనీ విలువను మెరుగుపరచేందుకు కార్పొరేట్‌ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్‌ బిజినెస్‌లను రెండు చట్టబద్ధ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇంతక్రితం నియంత్రణ సంస్థలకు తెలియజేసింది.

* ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ గత ఆరు నెలలుగా మొండిబాకీలు (ఎన్‌పీఏ) గణనీయంగా తగ్గాయి. ప్రైవేట్‌ రంగంలో 67 శాతం బ్యాంకుల్లో మాత్రమే ఎన్‌పీఏలు తగ్గాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వాటిల్లో 77 శాతం బ్యాంకులు గత ఆరు నెలలుగా మొండిబాకీలు తగ్గినట్లు వెల్లడించాయి. సగం పైగా బ్యాంకులు రాబోయే ఆరు నెలల్లో తమ స్థూల ఎన్‌పీఏలు 3–3.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) అసెట్‌ క్వాలిటీ మెరుగుపడింది. పీఎస్‌బీలు, విదేశీ బ్యాంకుల్లో గత ఆరు నెలల్లో ఎన్‌పీఏలేమీ పెరగలేదు. కానీ 22 శాతం ప్రైవేట్‌ బ్యాంకుల్లో మాత్రం పెరిగాయి. 18వ ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వేను గతేడాది జూలై–డిసెంబర్‌ మధ్య కాలంలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్‌ బ్యాంకులు కలిపి మొత్తం 23 బ్యాంకులు ఇందులో పాల్గొన్నాయి. అసెట్ల పరిమాణంపరంగా బ్యాంకింగ్‌ రంగంలో వీటి వాటా 77 శాతంగా ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z