* పెండింగులో ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి భారాస (BRS) అభ్యర్థిని ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు భారాస ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. హైదరాబాద్ స్థానాన్ని మాత్రం పెండింగులో ఉంచింది. నేడు శ్రీనివాస్ యాదవ్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో భారాస అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్లయింది.
భారాస అభ్యర్థులు వీళ్లే..
సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్
కరీంనగర్ – వినోద్‌కుమార్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
ఖమ్మం – నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్ – మాలోత్ కవిత
చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
వరంగల్ – డాక్టర్ కడియం కావ్య
జహీరాబాద్ – అనిల్‌కుమార్
నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
నాగర్‌కర్నూల్ – ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
మెదక్ – వెంకట్రామిరెడ్డి
మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి
మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
భువనగిరి- క్యామ మల్లేశ్
నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
హైదరాబాద్- గడ్డం శ్రీనివాస్ యాదవ్
* సాగునీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని రైతులే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘ సాగునీరు లేదు.. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. రాష్ట్రమంతటా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ముఖ్యమంత్రికి మాత్రం ఈ విషయం పట్టడం లేదు. ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి ఆయనకు ఆలోచన లేదు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారు. అప్పులు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. రజాకార్లను తలపించేలా వాళ్లు ప్రవర్తిస్తున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ తమిళనాడు మంత్రిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ స్థానిక భాజపా నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మత్య్స, పశుసంవర్ధక శాఖ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 19న అక్కడ 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మార్చి 22న తండుపాతులో జరిగిన డీఎంకే కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి రాధాకృష్ణన్.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి కామరాజ్‌ను ప్రధాని మోదీ ప్రశంసించడంపైనా ఆయన విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర భాజపా నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి రాధాకృష్ణన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పోలీసులు సదరు మంత్రిపై కేసు నమోదు చేశారు.
* తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.
* సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా.. ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని, సందేశాలు పంపారని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నాననీ చెప్పడం లేదని వెల్లడించారు. ‘‘జగన్మోహన్రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, రఘురామకృష్ణరాజుకు భాజపా నుంచి టికెట్ రానివ్వరని ముందే పిల్ల సజ్జల వెబ్సైట్లు, మీడియా ఛానల్స్‌లో చెప్పారు. జగన్ నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశారు. జైల్లో చంపే ప్రయత్నం చేశారు. తన మతానికి చెందిన అధికారిని అడ్డం పెట్టుకొని, ఇక్కడి ప్రభుత్వ అధినేతలతో కుమ్మక్కై నన్ను అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో చంపేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిలో విఫలమయ్యారు. పోలీసులను అడ్డం పెట్టుకుని లేపేయాలని చూశారు. ప్రతి ఒక్కరికీ ప్రతిసారీ విజయం దక్కదు. నాకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారు. అపజయాన్ని అంగీకరిస్తున్నా. జగన్ ఇంత పని చేస్తారని తెలిసినా, ఏ మూలనో ఒక నమ్మకం ఉండడంతో తేలికగా తీసుకున్నా’’ అని తెలిపారు.
* విపక్ష కూటమిలో అసంతృప్తి జ్వాలలు చల్లరాడం లేదు. అసెంబ్లీ, ఎంపీ టికెట్ ఆశించిన ఆశావాహలు.. సీట్లు దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. తిరుపతి సీటును జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరికో మద్దతు పలకమంటే తాను అంగీకరించినా.. పార్టీ కేడర్ అంగీకరించదని పేర్కొన్నారు. తిరుపతి టికెట్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి చర్చించాలని సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అభ్యర్థిపై పునరాలొచిస్తారని నమ్ముతున్నానని అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన నేతలు అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఉన్నపళంగా పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదన్న సుగుణమ్మ.. తిరుపతికి తమ కుటుంబం చేసిన పనులను గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
* మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాలేశ్వరుడి ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆలయం గర్భగుడిలో జరిగిన ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందిస్తూ.. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనా విభాగం.. బాధితులకు సాయం చేయడంలో నిమగ్నమైనట్లు ప్రధాని మోదీ తెలిపారు.
* రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. రాత్రి పూట 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. సోమవారం మధ్యాహ్నం వరకు నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 41.1, డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత నిజామాబాద్ మోర్తాడ్‌లో 41 డిగ్రీలు, ఆసిఫాబాద్ (కుమ్రంభీం) 40.9, చాప్రాలా (ఆదిలాబాద్) 40.8, రైనిగూడెం (సూర్యాపేట) 40.7, కోరట్‌పల్లి (నిజామాబాద్) 40.7, వడ్డేమాన్ (మహబూబ్‌నగర్) 40.6, దస్తూరాబాద్ (నిర్మల్) 40.6, ఆదిలాబాద్ 40.5, సిరికొండ 40.5, డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
* రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై .. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ పోటీ పడనున్నారు. 2009 నుంచి వయనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తున్నది. 2019 జనరల్ ఎలక్షన్స్‌లో సురేంద్రన్ పాతానమిట్ట స్థానం నుంచి పోటీ చేశారు. 2016 ఎన్నికల్లో మంజేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి సురేంద్రన్ 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన బైపోల్స్ లో పోటి చేసి ఓటమి చెందారు. 2020లో కేరళ బీజేపీ చీఫ్‌గా నియమితుడయ్యారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆందోళనలు చేపట్టారు. కేరళలోని తిరువనంతపురం తర్వాత వయనాడ్ స్థానం కీలకంగా మారింది. తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ శశిథరూర్ మధ్య పోటీ జరగనున్నది.
* రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వివాదస్పద చరిత్ర ఉన్న నేతలకు మొండి చేయిచూపిస్తుంది. తాజాగా, ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా పనిచేసిన ఓ నేతకు సీటు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. అదే సమయంలో నోరు పారేసుకుని పార్టీ ఇస్తున్న అవకాశాల్ని చేజార్చుకోవద్దని హితువు పలుకుతోంది.
* దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. తెదేపా కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా?అని ప్రశ్నించారు. తెదేపా హయాంలో అక్రమార్కులు రావడానికే భయపడ్డారని చెప్పారు. చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ‘‘దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ తెదేపా. వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా.. మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తా. జగన్ మాదిరిగా రూ.10 ఇచ్చి.. రూ.100 లాగడం కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం’’ అని చెప్పారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించేందుకు తెదేపా కార్యకర్తలు కృషి చేయాలని.. అదే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75 శాతం ఓట్లు పడేలా పనిచేయాలని చెప్పారు. వైకాపాకు ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు.
* తెలంగాణలో పలు సంచలనాలతో రాజకీయ ప్రకంపనలకు సిద్ధం కాబోతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అయితే.. ఈ మొత్తానికి ప్రధాన సూత్రధారి అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారికి ‘టచ్’లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుపై వేటు.. అరెస్ట్ తర్వాత పత్తా లేకుండా పోయిన ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారితో సంభాషణ జరిపినట్లు తాజా సమాచారం. మా ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు? అని ఆ సందర్భంలో ఆయన సదరు ఉన్నతాధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘‘ఎంతైనా మనం మనం పోలీసులం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా చేస్తున్నారో.. గత ప్రభుత్వంలో మేం కూడా అలాగే చేశాం’’ అని ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని.. జూన్ లేదంటే జులైలో తిరిగి హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్లు సమాచారం.
* హీరోయిన్ తాప్సీ పెళ్లికూతురిగా ముస్తాబైంది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది.
* లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీని బీజేపీ విలీనం చేశారుఉ. ఈ క్రమంలో జనార్థన్ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా బీజేపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు. తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)ని సోమవారం బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో జనార్ధన్ రెడ్డి తన పార్టీని బీజేపీలో కలిపారు. దీంతో, లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
* శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో వైకాపా నేతలు హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించారు. భూమిని యథాతథ స్థితిలో ఉంచాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారు. ఓ వైపు భూ వివాదంపై విచారణ కొనసాగుతుండగానే.. 10 జేసీబీలతో 62 ఎకరాల భూమిని చదును చేయించారు. పోలీసులు వారికే అనుకూలంగా ఉన్నారని భూ యజమానులు ఆరోపిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z