Business

5జీ డేటాను భారీగా వాడుతున్న భారతీయులు-BusinessNews-Mar 25 2024

5జీ డేటాను భారీగా వాడుతున్న భారతీయులు-BusinessNews-Mar 25 2024

* దేశీయ విపణిలోకి అధిక సామర్థ్యం కలిగిన, ఒకసారి ఛార్జింగ్‌తోనే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే వీలున్న విద్యుత్తు కార్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అడుగుపెట్టే వీలుంది. కాలుష్య తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో, కొనుగోలుదార్లు ‘స్వచ్ఛ ఇంధన’ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. పర్యావరణ హితమైన స్వచ్ఛ ఇంధన వాహనాలను ప్రోత్సహించే విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం కంపెనీలకూ ఉత్సాహాన్నిచ్చింది. ఇ-మొబిలిటీ ప్రోత్సాహక పథకం 2024 కింద ఏప్రిల్‌ 1 నుంచి 4 నెలల కోసం రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అందుకే దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీలు, వివిధ రకాల విద్యుత్‌ వాహనా (ఈవీ)లను విపణిలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ వంటి సంస్థలు అధునాతన ఈవీలను సాధ్యమైనంత త్వరగా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

* వాహన తయారీలోకి ప్రవేశించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల సంస్థ షావోమి (Xiaomi) గురువారం నుంచి తమ తొలి కారు మోడల్‌కు ఆర్డర్లు స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ లీ జున్‌ సోమవారం కీలక విషయాలు వెల్లడించారు. ఆకర్షణీయ లుక్‌, డ్రైవ్‌ చేయడానికి సులభంగా ఉండే స్మార్ట్‌ కారును తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ధర 5,00,000 యువాన్ల (దాదాపు రూ.58 లక్షలు) కంటే తక్కువే ఉంటుందని తెలిపారు.

* భారత్‌లో 5జీ వినియోగదార్లు డేటాను విరివిగా వాడుతున్నారు. 4జీ వినియోగదార్లతో పోలిస్తే ఏకంగా 3.6 రెట్ల డేటాను వాడుతున్నట్లు టెలికాం గేర్‌ తయారీ కంపెనీ నోకియా తన నివేదికలో పేర్కొంది. టెలికం వినియోగదారులకు సేవలందించేందుకు కంపెనీలు నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా అక్టోబరు 2022లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2023లో మొత్తం డేటా రద్దీలో 15 శాతం వాటా 5జీదేనని ఆ నివేదికలో తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 5జీ అందుబాటులోకి వచ్చాక ఆ టెక్నాలజీ కొన్నిసార్లు వాడకపోయినా 5జీ మొబైళ్లను కొనుగోలు చేస్తున్నారు. 4జీ డివైజెస్‌ సంఖ్యతో పోలిస్తే 17 శాతం మేర 5జీ మొబైళ్లు వాడుతున్నారు. అంటే 79.6 కోట్లలో వీటి వాటా 13.4 కోట్లుగా ఉంది. భారత్‌లో డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 20% వృద్ధితో నెలకు 17.4 ఎక్సాబైట్స్‌గా నమోదవుతోంది. 1 ఎక్సాబైట్‌ 100 కోట్ల జీబీకి సమానం. సగటున ఒక్కో వినియోగదారు నెలకు 24 జీబీ వాడుతున్నారు. అంటే భారత్‌లో డేటా వినియోగం చాలా భారీగా ఉంది. మొత్తం మొబైల్‌ డేటా రద్దీలో 20 శాతం వాటాకు ఇది చేరింది.

* దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్థలాలకు డిమాండ్‌ పెరుగుతోంది. కొవిడ్‌ భయాలు తొలగి క్రమంగా దాదాపు చాలా కంపెనీలు వర్క్‌ఫ్రంహోం కల్చర్‌కు స్వస్తి పలుకుతాన్నాయి. ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. దాంతో దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్‌ స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ జనవరి-మార్చి మధ్యకాలంలో ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్‌ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కొల్లియర్స్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్‌-6 నగరాలైన బెంగళూరు, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, పుణెలో సమీప భవిష్యత్తులో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్‌ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం.

* ప్రపంచ నంబర్‌1 కంపెనీ యాపిల్ తయారుచేస్తున్న ఐఫోన్లు, వాచ్‌లకు ఉన్న క్రేజ్‌ తెలిసిందే. అలాంటి విలువైన కంపెనీలో ఉద్యోగం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. కానీ, యాపిల్ తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. యాపిల్‌ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.

* స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేసేవారికి ఇప్పటి వరకు టి+1 రోజున అంటే ట్రేడ్‌ చేసిన మరుసటి రోజున సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. అయితే తాజాగా సెబీ నిబంధనలు మారుస్తున్నట్లు ప్రకటించింది. దాంతో టి+0తో ట్రేడ్‌ జరిగిన రోజే షేర్ల సెటిల్‌మెంట్‌ పూర్తవుతుంది. ప్రస్తుతానికి సెబీ ఈ సెటిల్‌మెంట్‌పై నమూనా పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 28, 2024 నుంచి బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. టి+0 సెటిల్‌మెంట్‌ను కేవలం 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. తద్వారా వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. అన్ని షేర్లకు ఒకే రోజు సెటిల్‌మెంట్‌ను అమలు చేయడానికి ముందు ఈ 25 షేర్లపై జరిపే పరీక్షా ఫలితాలను బట్టి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. మూడు, ఆరు నెలల కాలంపాటు ఈ పరీక్షల ప్రగతిని సెబీ పరీక్షించనుంది. అన్ని సజావుగా జరిగితే విస్తృత స్థాయిలో టి+0 అమల్లోకి వస్తుంది. బీటా వర్షన్‌ వినియోగదార్లతో పాటు అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం పూర్తిస్థాయిలో అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి రానుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z