Devotional

కన్నులపండువగా నెమలి కన్నయ్య కళ్యాణం

కన్నులపండువగా నెమలి కన్నయ్య కళ్యాణం

ఉమ్మడి జిల్లాల్లో ప్రముఖ పుణ్యక్షేతంగా విరాజిల్లుతున్న గంపలగూడెం మండలం నెమలి శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి తిరుకళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి 10 గంటలకు కనులపండువగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఫాల్గుణ మాస శుద్ధ పౌర్ణమి నాడు పున్నమి వెలుగుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది నుంది భక్తుల మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, భక్త జనుల హరే కృష్ణ నామస్మరణల నడుము బాజాభజంత్రీల మధ్య వివిధ రకాల పూలమాలలతో సిద్ధం చేసిన కళ్యాణ వేదికపై స్వామివారు, దేవతామూర్తుల కళ్యాణఘట్టాన్ని శ్రీమాన్ పరాశరాం వేంకటరమణాచార్యులు, పరాశరాం విఖనసాచార్యుల పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు తిరునగిరి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం సంప్రదాయబద్ధంగా ముగించారు. అంతకుముందు పెండ్లి కుమారుడైన వేణుగోపాలస్వామి, పెళ్ళికుమార్తెలు రుక్మిణీ, సత్యభామలను పట్టు పీతాంబరాలతో అలంకరించి శేషవాహనంలో అధిష్టింపజేసి కల్యాణవేదిక వద్దకు తోడ్కొని వచ్చారు.

స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరపున ఆలయ సహాయ కమిషనర్ నూతక్కి వెంకటసాంబశివరావు, ఆలయ కమిటీ అధ్యక్షురాలు కావూరి శశిరేఖ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన వంటి వివాహతంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. రాత్రి 11 గంటలకు స్వామి వారు దేవతామూర్తుల మెడలో లోక కళ్యాణార్ధం మాంగల్యధారణ చేశారు. మొత్తం 193 మంది దంపతులు కళ్యాణపీటలపై కూర్చుని కన్యాదానం చేశారు. దాతలు, కన్యాదాతలతో ముత్యాల తలంబ్రాలు పోయించి, భక్తులకు పంపిణీ చేశారు. కళ్యాణ పీటలపై కూర్చున్న వారికి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. ఆలయ పరిసరాల్లో వివిధ రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఉత్సవమూర్తులు గరుడవాహనారూఢులై ఆలయ ప్రవేశం చేశారు.

డీసీపీ కంచి శ్రీనివాసరావు, ఏసీపీ మురళీమోహన్ ఆదేశాల మేరకు తిరుపూరు సీఐ షేక్ అబ్దుల్ నబీ పర్యవేక్షణలో స్థానిక ఎస్సై ఎస్. శ్రీను ఆధ్వర్యంలో 370 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువూరు, మధిర ఆర్టీసీ డిపోల నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు రవాణా కల్పించారు. ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో ఆశా, ఆరోగ్య సిబ్బంది, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మండల పరిషత్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు వారి పరిధిలోని సదుపాయాలను భక్తులకు కల్పించారు. తిరువూరు అగ్నిమాపక కేంద్రం నుండి వాహనం తీసుకుని వచ్చి అందుబాటులో ఉంచారు. దాత వై.వెంకటరత్నం సహకారంతో వచ్చిన భక్తులకు అన్నదానం, ఆలయ కమిటీ వారి అధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదం అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు ఉభయ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించారు. ఆలయ ఈఓ నూతక్కి వెంకట సాంబశివరావు, ఆలయ చైర్మన్ కావూరి శశిరేఖ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z