ScienceAndTech

ECILలో ఉద్యోగాలు-NewsRoundup-Mar 26 2024

ECILలో ఉద్యోగాలు-NewsRoundup-Mar 26 2024

* భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ఇకమీదట అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌గా జరగనుంది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌ల సిరీస్‌గా కొనసాగిన ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చినట్లు సోమవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. 2024-25 మధ్య జరిగే ఈ సిరీస్‌ షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. తొలి టెస్టు ఈ ఏడాది నవంబర్‌ 22న పెర్త్ వేదికగా మొదలవుతుంది. రెండో టెస్టు (పింక్ బాల్ టెస్టు) డే/నైట్‌ జరగనుంది. దీనికి అడిలైడ్‌ ఓవల్‌ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో టెస్టు బ్రిస్బేన్‌, నాలుగో టెస్టు మెల్‌బోర్న్‌, ఐదో టెస్టుకు సిడ్నీ వేదిక కానుంది. 1991-92 తర్వాత భారత్‌, ఆసీస్‌ అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడటం ఇదే తొలిసారి. ఈ ఏడాది డిసెంబరులో భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసీస్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా విడుదలైంది. తొలి రెండు వన్డేలు డిసెంబరు 5, 8న బ్రిస్బేన్‌లో, మూడో వన్డే డిసెంబరు 8న పెర్త్‌లో జరుగనుంది.

* ఎట్టకేలకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని వైకాపా ప్రకటించింది. ఇటీవల 24 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్‌.. అనకాపల్లి సీటును పెండింగ్‌లో పెట్టారు. తాజాగా ఈ స్థానానికి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడిని ఖరారు చేసినట్టు వైకాపా అధిష్ఠానం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఇప్పటికే తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మాడుగుల అసెబ్లీ స్థానానికి ముత్యాల నాయుడు కుమార్తె ఈర్ల అనురాధను అభ్యర్థిగా నియమించారు.

* దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ – యూజీ (CUET UG 2024) పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగించారు. షెడ్యూల్‌ ప్రకారం నేటితో దరఖాస్తుల గడువు ముగియనుండగా.. మార్చి 31 రాత్రి 9.50గంటల వరకు అభ్యర్థులు https://exams.nta.ac.in/CUET-UG/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ ఛైర్మన్‌ ప్రొ. జగదీశ్‌ కుమార్‌ వెల్లడించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్‌టీఏ తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో సీయూఈటీ యూజీ పరీక్షను హైబ్రిడ్‌ పద్ధతి (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహించాలని నిర్ణయించారు. జూన్‌ 30న ఫలితాలను విడుదల చేస్తారు.

* జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు సమక్షంలో కోశాధికారి ఎ.వి.రత్నంకి అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..‘‘స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్‌ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారు. జనసేన కోసం ఓ బెల్దారీ మేస్త్రి రూ.లక్ష విరాళం అందించారు. ఇలా ఎందరో కూలీలు కూడా రూ.100, రూ.200 చొప్పున విరాళాలు ఇచ్చారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బును పార్టీకి విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉంది. ఎన్నికల వేళ ఈ మొత్తం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

* తెలుగుదేశం పార్టీలో టిక్కెట్‌ దక్కని పలువురు సీనియర్‌ నేతలకు అధినేత చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పగించారు. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌, విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడిగా గండి బాబ్జి, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా బి.వి.రాముడు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్‌, మన్నె సుబ్బారెడ్డిని నియమించారు.

* ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారికి గుడ్‌న్యూస్‌. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు జోనల్‌ కార్యాలయాలు, ప్రాజెక్టు సైట్‌లలో పనిచేసేందుకు మొత్తం 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. భారీ వేతనాలతో కూడిన ఈ పోస్టుల భర్తీకి మార్చి 23న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌ 13 మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగనుంది. మొత్తంగా 30 పోస్టులు భర్తీ చేస్తుండగా.. విభాగాల వారీగా చూస్తే ఈసీఈలో 5, ఈఈఈ 7, మెకానికల్‌ 13, సీఎస్‌ఈ 5 చొప్పున ఉన్నాయి.
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతన స్కేల్‌ : ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.40,000 – రూ.1,40,000 వరకు వేతనం అందుతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చొప్పున చెల్లించాలి.
వయో పరిమితి: 2024 ఏప్రిల్‌ 13 నాటికి అభ్యర్థుల వయస్సు 27ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాలకు వయో సడలింపు ఉంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్
ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ రూపంలో రాత పరీక్ష ఉంటుంది.
తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. హాల్‌టిక్కెట్లు, పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలను ఆ తర్వాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
పరీక్ష కేంద్రాలివే.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి/నాగ్‌పుర్‌, దిల్లీ/నోయిడా, కోల్‌కతా
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు కంపెనీలో పనిచేస్తామని బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రూ.4లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

* కాకినాడ శివాలయంలో (kakinada shivalayam) అర్చకులపై దాడి ఘటనపై దేవాదాయశాఖ విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ కమిషనర్ విజయరాజ్, ఇతర అధికారులు ఆలయానికి వచ్చి.. ఘటనపై విచారణ చేపట్టారు. అర్చకుడిపై దాడి చేసిన వైకాపా నేత చంద్రరావును దేవాదాయశాఖ కమిషనర్ విజయరాజ్ ప్రశ్నించారు.

* ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, భారాస (BRS) నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు తనకు తెలియదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రణీత్‌రావు బంధువులు తమ ఊరిలో ఉన్నారని.. వారికి ఏ పార్టీతో సంబంధం ఉందో విచారణ చేస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ మారాలంటూ కొందరి ద్వారా తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. తెదేపాలో ఉన్నప్పుడూ తెలంగాణ కోసం పోరాడానన్న ఎర్రబెల్లి.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చ లేదని చెప్పారు. ఇరికించాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. ఇబ్బంది పెట్టాలనే తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదన్నారు. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని భాజపా నుంచి ఆయన్ను తొలగించినట్లు తెలిసిందని చెప్పారు. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని.. అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దని ఎర్రబెల్లి కోరారు.

* విమానాలకు అత్యంత కీలకమైన నావిగేషనల్‌ సిగ్నల్స్‌కు (GPS Signals) సంబంధించి యూరప్‌లో కొంతకాలంగా తరచూ ఆటంకాలు ఎదురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా తూర్పు యూరప్‌లో జీపీఎస్‌ జామింగ్‌ (GPS Jamming) తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 1600లకు పైగా విమానాలు వీటి బారిన పడినట్లు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సైట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు, వీటికి రష్యానే కారణం కావచ్చని పలు యూరప్‌ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బాల్టిక్‌ ప్రాంతాన్ని నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ సమస్య పీడిస్తున్నట్లు వీటిని ట్రాక్‌ చేసే ఓపెన్‌-సోర్స్‌ ఇంటెలిజెంట్‌ గ్రూప్‌ ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే 1614 విమానాలు ప్రభావితమైనట్లు పేర్కొంది. పోలాండ్‌, దక్షిణ స్వీడన్‌ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని తెలిపింది. ఫిన్లాండ్‌లోనూ ఇదే పరిస్థితి. బాల్టిక్‌ సముద్రంతోపాటు నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలు ఇటువంటి సమస్య ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఇది సాధారణంగా జరిగే జీపీఎస్‌ జామింగ్‌ కాదని.. గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతోందని వెల్లడించింది. ఇదే సమయంలో జీపీఎస్‌ వ్యవస్థను నిలిపివేసే సామర్థ్యం రష్యాకు ఉందని స్వీడన్‌ ఆర్మీ కూడా ఇటీవల అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.

* కేంద్రంలోని అధికార భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న అటల్‌ పెన్షన్‌ యోజనపై (Atal Pension Yojana) ఇరు పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఈ పథకాన్ని డిజైన్‌ చేయడంలో కేంద్రం విఫలమైందంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వాటిని కొట్టిపారేశారు. పేదలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతోందని పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులకు ఉద్దేశించిన అటల్‌ పెన్షన్‌ యోజన పథకంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు. పథకం ప్రచారంలోనే తప్ప.. వాస్తవంలో లబ్ధిదారులకు చేరడం లేదని పేర్కొన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక చందాదారుడు పథకం నుంచి వైదొలుగుతున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని జత చేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఇచ్చిన టార్గెట్‌లను పూర్తి చేయడానికి చాలా మంది బ్యాంక్‌ ఉద్యోగులు చందాదారుల అనుమతి తీసుకోలేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ సర్వేలో తేలినట్లు ఆ కథనం వెల్లడించింది. 83 శాతం మంది వెయ్యి రూపాయల పెన్షన్‌ శ్లాబులో ఉన్నారని, లబ్ధిదారులకు తెలీకుండా ఖాతాలు తెరవడమే అందుక్కారణమని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఇచ్చే పెన్షన్‌ ఏ మూలకూ రాదని, స్కీమ్‌ను సరిగా డిజైన్‌ చేయలేదంటూ విమర్శించారు.

* పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

* జగన్‌ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏటా జాబ్‌ కేలండర్‌ అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా.. ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

* భారాస పాలనలో హైదరాబాద్‌లో 36 ఫ్లైఓవర్లు నిర్మించామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాస, భాజపా ఒక్కటేనంటూ అసత్య ప్రచారం చేసి, మైనార్టీ సోదరులను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దిల్లీ మద్యం కేసులో ఆధారాలుంటే కిషన్‌రెడ్డి కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు.

* మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై తాజాగా అమెరికా నుంచి స్పందన వచ్చింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామంది.

* అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కాలం ఒక్కసారిగా కలిసొచ్చింది. ఆయనకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ఊరట లభించింది. అదే సమయంలో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్‌ ఒకటి పూర్తయింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది.

* తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బాధ్యులు అప్పటి ముఖ్యమంత్రేనని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై న్యాయవిచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.

* ఉద్యోగాల రూప కల్పన విషయంలో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దేశ యువత ఇదే విషయంపై తమని ప్రశ్నిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు యువతకు చేసిన వాగ్ధానం ‘యువ న్యాయ్‌’ ద్వారా ఉపాధి విప్లవానికి కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టిందని ఆయన హామీ ఇచ్చారు. ‘ప్రధాని మోదీ జీ యువతకు ఉపాధి కోసం మీ వద్ద ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? అనే ప్రశ్న ప్రతి యువతీ యువకుల్లో ఉంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధం ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z