Business

Windows నూతన అధిపతిగా పవన్ దావులూరి-BusinessNews-Mar 26 2024

Windows నూతన అధిపతిగా పవన్ దావులూరి-BusinessNews-Mar 26 2024

* హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీ (Mahindra University)కి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) కీలక ప్రకటన చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి రూ.500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్లలో తమ కుటుంబం ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీని అత్యుత్తమ కేంద్రంగా మార్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100కోట్లు పక్కన పెట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఈ యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థ ఇందిరా మహీంద్రా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు మరో రూ.50కోట్లు ఇస్తామని ప్రకటించారు.

* మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త బాస్‌ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి (Pavan Davuluri)ని ఆ కంపెనీ నియమించింది. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్‌ పనయ్‌ (Panos Panay) గతేడాది అమెజాన్‌లో చేరడంతో ఆయన స్థానంలో పవన్‌కు బాధ్యతలు అప్పగించారు. మైక్రోసాఫ్ట్‌లో పవన్ 2001లో చేరారు. దాదాపు మూడేళ్లుగా కంపెనీలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పవన్‌.. ఐఐటీ మద్రాసులో తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1999లో అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ పట్టా అందుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచే మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా పదవి చేపట్టారు. వీటితోపాటు మైక్రోసాఫ్ట్‌లో వివిధ పదవులు నిర్వహించారు. తాజా నియామకానికి ముందు ఆయన విండోస్ సిలికాన్ అండ్‌ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌కు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

* ఒక వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంలో భాగంగా ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లను పెంచే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ మేరకు ప్రకటన రావొచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిఛార్జ్‌ మరింత భారం కాకముందే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్లను ఎంచుకుంటే మేలు. తద్వారా ఒకే తరహా ప్రయోజనాల కోసం ఎక్కువ మొత్తం చెల్లించకుండా ఆదా చేసుకునే అవకాశం ఉంది.

ఏడాది గడువుతో ఎయిర్‌టెల్‌ మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. వాటి ధరలు రూ.3,359, రూ.2,999, రూ.1,799. ఒక్కో దాంట్లోని ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..

రూ.3,359 ప్లాన్‌..
ఎయిర్‌టెల్‌లో అధిక ప్రయోజనాలు ఉన్న ప్లాన్‌ ఇదే. అలాగే కంపెనీ అందిస్తున్న వాటిల్లో ఇదే అత్యంత ఖరీదైనది. దీంట్లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. ఏడాది వ్యవధితో డిస్నీ+ హాట్‌స్టార్‌ సభ్యత్వం కూడా ఉంటుంది. వీటితో పాటు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్లు, వింక్‌ మ్యూజిక్‌ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులు.

రూ.2,999 ప్లాన్‌..
ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ.2,999 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్లు, వింక్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ ప్లాన్‌ గడువు కూడా 365 రోజులు.

రూ.1,799 ప్లాన్‌..
ఏడాది కాలపరిమితితో వస్తున్న ప్లాన్లలో తక్కువ ధర ఉన్నది ఇదే. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 5జీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, వింక్‌ మ్యూజిక్‌, ఉచిత హలోట్యూన్లు, అపోలో 24/7 సర్కిల్‌ వంటివి ఉన్నాయి. దీంట్లో 24జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. కేవలం దీర్ఘకాల వ్యాలిడిటీ మాత్రమే కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది. డేటా ఎక్కువగా అవసరమయ్యే వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఎయిర్‌టెల్‌ వచ్చే జులై-అక్టోబరు మధ్య టారిఫ్‌లను 15% వరకు పెంచొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ఆర్పు రూ.208గా ఉంది. మార్కెట్‌ వాటా పరంగా జియో అగ్రగామిగా ఉండగా.. ఎయిర్‌టెల్‌ ద్వితీయ స్థానంలో ఉంది. వొడాఫోన్‌ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

* వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రాంతాల మధ్య సేవలందిస్తోన్న 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఈ రైళ్లు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నిర్దేశిత తేదీల్లో సర్వీసులందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.

* ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ-బీజేపీ బేరసారాల ఆడియో కలకలం రేపుతోంది. రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు. సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతలు ప్రతిపాదించారు. పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరిగినట్లు బీజేపీలో చర్చ జరుగుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z