Politics

హరీష్‌రావు మాజీ PA అరెస్ట్-CrimeNews-Mar 27 2024

హరీష్‌రావు మాజీ PA అరెస్ట్-CrimeNews-Mar 27 2024

* కేరళ (Kerala) సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్‌ (Veena Vijayan)తోపాటు మరికొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) అక్రమ నగదు చలామణి చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరికొందరికి త్వరలో సమన్లు జారీ చేయనుంది.

* పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించే నైజీరియన్‌ ఇవాల ఉడోక స్టాన్లీకి సహచరుడు మహ్మద్‌ ఉస్మాన్‌ అలియాస్‌ ఫైజల్‌(29)ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని కొల్వాలే జైల్లో విచారణ ఖైదీగా ఉంటూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇతన్ని నాలుగైదు రోజుల క్రితం పీటీ వారెంటుపై నగరానికి తీసుకొచ్చారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కేసు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే ఉన్నా నిందితుడిని గోవాలోని కొల్వాలే జైలులోనే రిమాండులో ఉంచాలని న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. దీంతో పోలీసులు ఫైజల్‌ను తిరిగి అక్కడికే తరలించారు. ఫైజల్‌ను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

* ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల వ్యవహారంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మాజీ పీఏ నరేశ్‌కుమార్‌తో పాటు కొర్లపాటి వంశీ, వెంకటేశ్‌గౌడ్‌, ఓంకార్‌ ఉన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు దుర్వినియోగమయ్యాయంటూ మెదక్‌ జిల్లాకు చెందిన రవినాయక్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల గోల్‌మాల్‌ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయం స్పందించింది. హరీశ్‌రావు పీఏ.. సీఎంఆర్ఎఫ్‌ చెక్కులు కాజేశారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. నరేశ్‌ అనే వ్యక్తి హరీశ్‌రావు వద్ద పీఏ కాదని, కంప్యూటర్‌ ఆపరేటర్‌గా.. తాత్కాలిక ఉద్యోగిగా కార్యాలయంలో పనిచేశారని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత డిసెంబరు 6న కార్యాలయం మూసివేసి సిబ్బందిని పంపించేశామని తెలిపారు. ఆ క్రమంలో సమాచారం లేకుండా కొన్ని చెక్కులను నరేశ్‌ తన వెంట తీసుకెళ్లినట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపజేయడం బాధాకరమన్నారు.

* ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది.. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు ఆందోల్‌ గ్రామానికి బయల్దేరారు. మన్సాన్‌పల్లి వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బూదెమ్మ(48), సంగమ్మ(45) మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z