Business

ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ-BusinessNews-Mar 27 2024

ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ-BusinessNews-Mar 27 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగింపు పలికాయి. నిన్న నష్టాలతో ముగిసినా బుధవారం ఆటోమొబైల్‌, రియాలి, పవర్‌ అండ్‌ కేపిటల్‌ గూడ్స్‌ షేర్ల కొనుగోలుతో నేడు భారీ లాభాల బాట పట్టాయి. దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 526 పాయింట్ల లాభంతో 72,996 వద్ద నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 22,123 వద్ద ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మారుతి సుజికీ, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా, హీరోమోటో కార్పో, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, అపోలో హాస్పిటల్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, విప్రోలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి.

* మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్‌చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల యూజర్లపై ఫేస్‌బుక్‌ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్‌ క్రంచ్‌’ కథనం ప్రకారం.. స్నాప్‌చాట్‌ (Snapchat) యాప్‌కి, తమ సర్వర్‌లకు మధ్య నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్‌బుక్‌ 2016లో ‘ప్రాజెక్ట్ ఘోస్ట్‌బస్టర్స్’ అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్‌ బిహేవియర్‌ను అర్థం చేసుకోవడానికి, స్నాప్‌చాట్‌పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్‌బుక్‌ ఈ చొరవను రూపొందించింది.

* స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు అమ్మినా, కొనుగోలు చేసినా అదే రోజు సెటిల్‌మెంట్‌ చేసే ప్రక్రియను సెబీ వేగవంతం చేస్తోంది. గురువారం నుంచి ఐచ్ఛిక ప్రాతిపదికన టి+0 సెటిల్‌మెంట్‌ (T+0 settlement) బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. ప్రయోగాత్మకంగా తొలుత కేవలం 25 షేర్లకు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే దీన్ని వర్తింపజేయనుంది. ప్రస్తుతం మనం స్టాక్‌ మార్కెట్లో ఏదైనా షేర్లు కొనుగోలు చేస్తే టి+1 రోజున అంటే ట్రేడ్‌ చేసిన తదుపరి రోజున సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. అయితే టి+0తో ట్రేడ్‌ జరిగిన రోజే సెటిల్‌మెంట్‌ పూర్తవుతుంది. దీని బీటా వర్షన్‌ను మూడు, ఆరు నెలల తర్వాత సమీక్షించనుంది. అన్ని సజావుగా జరిగితే విస్తృత స్థాయిలో టి+0 (T+0 settlement) అమల్లోకి వస్తుంది.

* దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ తమ డెబిట్‌కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 (జీఎస్‌టీ అదనం) వరకు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ (SBI) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్‌టీ అదనం) వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 చేసింది. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ఇప్పుడు రూ.175 ఛార్జీ ఉండగా.. దాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రూ.250కు సవరించింది. అలాగే ప్లాటినం డెబిట్‌ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ప్రైడ్‌, ప్రీమియం బిజినెస్‌ కార్డుపై రూ.350 వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తుండగా.. దాన్ని రూ.425కు సవరించింది. కొత్త ఛార్జీలన్నింటికీ జీఎస్‌టీ అదనం.

* గూగుల్‌ యాజమాన్యంలో యూట్యూబ్‌ అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో 22.5లక్షల వీడియోలను తొలగించింది. కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్‌ తెలిపింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 90లక్షల వీడియోలను తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ వీడియోల్లో 96శాతం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లు గుర్తించామని.. అయితే 53.46శాతం వీడియోలు ఒక వ్యూ రాక ముందే తొలగించినట్లు నివేదిక పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z