Business

ఏప్రిల్ నెల బ్యాంకు సెలవులు ఇవి-BusinessNews-Mar 28 2024

ఏప్రిల్ నెల బ్యాంకు సెలవులు ఇవి-BusinessNews-Mar 28 2024

* ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉ‍న్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్‌ కోఫౌండర్‌ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్‌ ఏఐ కంపెనీ కోసం గూగుల్‌ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్‌లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్‌లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్‌ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్‌ ట్రెండ్‌ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్‌ కంపెనీల్లో అత్యధికంగా ఉంది.

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota Kirloskar Motor) కార్ల ధరలను పెంచనుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 1 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరకుల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. దేశీయంగా టయోటా కంపెనీ గ్లాంజా వంటి హ్యాచ్‌బ్యాక్‌ల మొదలు ఫార్చూనర్‌ వంటి ఎస్‌యూవీల వరకు వివిధ రకాల కార్లను విక్రయిస్తోంది. టయోటా జనవరిలో ఒకసారి ధరల పెంపు చేపట్టింది. ఈ ఏడాది ధరలు పెంచడం రెండోసారి. మరోవైపు కార్ల తయారీ సంస్థ హోండా కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది.

* అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు; బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్ స్టాక్స్‌ రాణించడంతో సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1.10 గంటలకు సెన్సెక్స్‌ 900కి పైగా పాయింట్ల లాభంతో 73,902 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 284 పాయింట్ల లాభంతో 22,412 ఎగువన కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క యాక్సిస్‌ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో కొనసాగుతుండడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి ట్రేడింగ్‌ సెషన్‌ కూడా కావడం గమనార్హం.

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి. ఏప్రిల్ 2024లో సెలవుల జాబితా

ఏప్రిల్ 1 (సోమవారం): మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ కారణంగా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 5 (శుక్రవారం): బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు. జుమాత్-ఉల్-విదా కోసం తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 9 (మంగళవారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూలో గుఢి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
ఏప్రిల్ 10 (బుధవారం): రంజాన్ ( కేరళలోని బ్యాంకులకు హాలిడే)
ఏప్రిల్ 11 (గురువారం): చండీగఢ్, గ్యాంగ్‌టక్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం మినహా చాలా రాష్ట్రాల్లో రంజాన్ కారణంగా బ్యాంకులకు హాలిడే.
ఏప్రిల్ 13 (శనివారం): అగర్తలా, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్‌లలో బోహాగ్ బిహు/చీరోబా/బైసాఖీ/బిజు ఫెస్టివల్
ఏప్రిల్ 15 (సోమవారం): గౌహతి, సిమ్లాలో బోహాగ్ బిహు/హిమాచల్ డే
ఏప్రిల్ 17 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో శ్రీరామ నవమి
ఏప్రిల్ 20 (శనివారం): అగర్తలాలో గరియా పూజ కోసం బ్యాంకులకు హాలిడే
ఏప్రిల్ 21- ఆదివారం
ఏప్రిల్ 27- నాలుగో శనివారం
ఏప్రిల్ 28- ఆదివారం

* 2024 ప్రారంభంలో వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఫిబ్రవరి, మార్చిలో భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ్ బంగారం ధర రూ. 7000 దగ్గరకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ రోజు (మార్చి 28) దేశంలో బంగారం ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్‌, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.61850 (22 క్యారెట్స్), రూ.67460 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 350, రూ. 380 వరకు పెరిగింది. చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 61850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 67460 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z