* మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. రేవంత్‌రెడ్డిని దెబ్బతీయాలని భాజపా, భారాస ఏకమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు డీకే అరుణ ఏం చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆమె జాతీయ హోదా తీసురావచ్చు కదా! కానీ, పార్టీలో మాత్రం జాతీయ పదవి తెచ్చుకున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత సంపత్‌కు కాంగ్రెస్‌లో మంచి పదవి వస్తుంది. వాల్మీకి, బోయలను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నికల కోడ్ ముగియగానే వాల్మీకి, బోయల డిమాండ్‌లు నెరవేరుస్తాం. గద్వాల్, అలంపూర్ ప్రాంతంలోని బోయల గురించి తెలుసు. ఇప్పుడు అందరూ ఒక వైపు రండి.. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. దిల్లీలో మన పరిపాలనను అభినందిస్తున్నారు. ఎవరు ఏ సమస్యతో వచ్చిన.. వాటి పరిష్కారం కోసం పని చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి .. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారు. ట్యాపింగ్ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ చేసిన వారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుంది. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. తగిన ఫలితం ఉంటుంది. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలు ఉంటాయి. అధికారులకు ఆ రోజే చెప్పా.. వినలేదు. ఇవాళ జైలుకు వెళ్తే.. అటు వైపు చూడటం లేదు. ఓటు విలువ తెలుసు.. అందుకే దిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశా. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
* దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya vidyalayas) 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) నోటిఫికేషన్ కోసం తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం తమ వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ను సందర్శించాలని సూచించింది.
* తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. దిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అతి త్వరలో తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి సొంతగూటికి చేరుతున్నట్లు చెప్పారు. అవసరమైతే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి చేరుతానని వెల్లడించారు.
* ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి (United Nations) విధించిన ఆంక్షలు కొరియా ద్వీపకల్పంలో శాంతిని పెంపొందించడానికి అడ్డంకిగా ఉన్నాయని రష్యా (Russia) ఆరోపించింది. అంతేకాకుండా ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఇవి ఏమాత్రం ఉపయుక్తంగా లేవని తెలిపింది. ఉత్తర కొరియా (North Korea) అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐరాస నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం రష్యా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మాస్కో, ప్యాంగాంగ్ మధ్య ఆయుధాల బదిలీలపై భద్రతా మండలి విచారణ చేపట్టడం మాస్కోకు ఏమాత్రం మింగుడు పడలేదు. ఈనేపథ్యంలోనే తాజా వ్యాఖ్యలు చేసింది.
* నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. సీతారామపురంలో ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా.. జనం ఒక్కసారిగా లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు సైతం ప్రసంగం సమయంలోనే ఇంటిబాట పట్టారు. దీన్ని గమనించిన వైకాపా నేతలు వెళ్లవద్దు ఆగండి ఆగండి అని బ్రతిమలాడుకున్నారు. భోజనాలు ఉన్నాయి అంటూ మైక్‌లో అనౌన్స్ చేస్తూ వారిని ఆపే ప్రయత్నం చేశారు.
* నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలో కూటమి ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రఘురామ ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయనకు సీటు ఇవ్వడంపై మూడు పార్టీలు చర్చిస్తున్నాయి.
* అభ్యర్థుల తుది జాబితాను తెదేపా (TDP) ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలించినా.. చివరికి గతంలో పోటీ చేసిన భీమిలినే కేటాయించారు. కదిరి స్థానంలో అభ్యర్థిని తెదేపా మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా.. ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు టికెట్ ఇచ్చింది. సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు భాజపాకు కేటాయించారు. దీంతో ఆ ఇద్దరు నేతలకు వేరే చోట అవకాశం కల్పించింది. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్‌సభకు కలిశెట్టి అప్పలనాయుడును ఆ పార్టీ బరిలో నిలిపింది.
* సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు. అక్కడ అవినీతి జరిగింది. ఎన్నికల తర్వాత విచారణ చేపడతాం. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తాం. ఆయన చేసిన పాపాల వల్ల కరవు వచ్చింది. వర్షం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వర్షం. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు.
* లోక్‌సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోన్న ఎన్నికల సంఘం.. అనేక మార్గాల్లో పౌరులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులోభాగంగా ‘సీ-విజిల్’ మొబైల్ అప్లికేషన్ ద్వారా 79వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే మెజార్టీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపింది. ‘‘ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు కోడ్ ఉల్లంఘనలపై (MCC) 79వేల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో దాదాపు 99శాతం సమస్యలను పరిష్కరించాం. 89శాతం కేసులను 100 నిమిషాల్లోనే పూర్తిచేశాం. 58,500 ఫిర్యాదులు అక్రమ హోర్డింగులు, బ్యానర్ల గురించే వచ్చాయి. నగదు, తాయిళాలు, మద్యం పంపిణీకి సంబంధించి 1400లకుపైగా కంప్లెయింట్‌లు వచ్చాయి. స్థలాల అక్రమ వినియోగం, మారణాయుధాలతో బెదిరింపులు, సమయం ముగిసిన తర్వాత ప్రచారం వంటి ఫిర్యాదులు వందల సంఖ్యలో వచ్చాయి’’ అని ఈసీ తెలిపింది. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు సీ-విజిల్ అనేది పౌరుల చేతుల్లో ఉన్న సమర్థమంతమైన సాధనమని పేర్కొంది.
* లోక్‌సభలోని (Loksabha) 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైమాటే. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదుకాగా.. వారిలో ఐదుగురు భాజపాకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది భాజపాకి చెందినవారే కావడం గమనార్హం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
* తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్‌లో 43.3, నల్గొండ జిల్లా నాంపల్లిలో 43, గద్వాల్ 42.8, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దనొరాలో 42.7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z