Politics

ప్రజలే జగన్ బెండ్ తీస్తారు-NewsRoundup-Mar 30 2024

ప్రజలే జగన్ బెండ్ తీస్తారు-NewsRoundup-Mar 30 2024

* ప్రజలు జగన్‌ బెండ్‌ తీయడం ఖాయమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టా.. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేని పాలన జగన్‌ది అని విమర్శించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పదవి ఉంటే ఒదిగి పనిచేసిన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. ‘‘ప్రజాగళం సభలు జనంతో కళకళలాడుతుంటే.. సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి. జగన్‌ ఓ విధ్వంసకారుడు, అహంకారి, అవినీతిపరుడు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశాం. తిరుపతి, చెన్నైలో విమానాశ్రయాలు ఉన్నాయి. నెల్లూరులో కూడా ఓ విమానాశ్రయం నిర్మించాలని భావించా. రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాం. మనం పరిశ్రమలు తెస్తే వైకాపా నేతలు వాటి నుంచి వసూళ్లు మొదలుపెట్టారు. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం కలిపి టెంపుల్‌ టూరిజం ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాం. స్మగ్లర్లకు వైకాపా టికెట్లు ఇచ్చింది. తెదేపా హయాంలో కోతలు లేని కరెంట్‌ ఇచ్చాం. ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ మార్చడం జగన్‌ మార్క్‌. తన సామాజిక వర్గానికే డబుల్‌ ప్రమోషన్‌ ఇవ్వడం ఆయన మార్క్‌. ఐదేళ్లుగా గాడితప్పిన పాలనను మేం వచ్చాక సరిచేస్తాం. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అభివృద్ధి అంటే పేదవాడి ఆదాయం పెరగాలి. మద్య నిషేధం అన్నారు.. దానిపైనే రూ.25వేల కోట్లు అప్పు తెచ్చారు. మా హయాంలో సంక్షేమానికి 19.5శాతం ఖర్చు చేశాం. వైకాపా హయాంలో సంక్షేమానికి 13.5 శాతం ఖర్చు చేశారు’’ అని విమర్శించారు.

* అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తిలో పర్యటిస్తున్న సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సు వైపు గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసరడం కలకలం రేపింది. బస్టాండు సమీపంలో బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

* ఈ ఏడాది చివర్లో జరిగే అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ల మధ్య గట్టి పోటీనే ఉంది. దీంతో ఇరువురు నేతలు ప్రచార జోరు పెంచారు. ఈక్రమంలోనే అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ గెలవకూడదని ప్రపంచ నేతలు తనతో చెప్పారని అన్నారు. అలా జరిగితే ప్రజాస్వామ్య దేశాలకు ప్రమాదకరమని వారు భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం న్యూయార్క్‌లో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్‌ పాల్గొన్నారు. ‘‘నవంబరులో తాను ఓడిపోతే రక్తపాతమే అని ట్రంప్‌ చెబుతున్నారు. ఇది అత్యంత ఆందోళనకర అంశం. ఈ మధ్య నేను ఏ దేశాధినేతను కలిసినా వారు ఒకటే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను (ట్రంప్‌) గెలవనివ్వకండి అని అడుగుతున్నారు. భారత్‌లో జరిగిన జీ20 సదస్సులోనూ దాదాపు ప్రతీ ప్రపంచ నేత ఇదే కోరారు. ఆయన గెలిస్తే వారి ప్రజాస్వామ్యాలు ప్రమాదంలో పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు’’ అని అగ్రరాజ్య అధినేత వెల్లడించారు.

* లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 8 మంది భాజపా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి (MaheshwarReddy) ఆక్షేపించారు. అసలు మీ తమ్ముడు మీతో టచ్‌లో ఉన్నారో లేదో తెలుసుకోవాలని మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వెంకట్‌రెడ్డి (Komatireddy VenkatReddy)తో పాటు ఐదుగురు మంత్రులు భాజపా అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా.. 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు.

* బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ (హెచ్‌ఎఎం-ఎస్) వ్యవస్థాపకులు జితన్ రామ్ మాంఝీ గయా స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అతడు ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అఫిడవిట్‌లో జితన్‌ రామ్‌ వద్ద రూ.11.32 లక్షల విలువైన చరాస్తులు, రూ.13.50 లక్షల స్థిరాస్తులు, రూ.49,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. చరాస్తుల్లో నాలుగు బ్యాంకు ఖాతాలు, రెండు నాలుగు చక్రాల వాహనాలు, ఒక డీబీబీఎల్‌ తుపాకీ, రెండు ఆవులు ఉన్నట్లు అందులో చూపించారు. బిహార్‌లోని గయా, నవాడ, జాముయి, ఔరంగాబాద్‌లలో మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. ఈనేపథ్యంలో గయా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడానికి మాంఝీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో భార్య శాంతిదేవికి ఒక బ్యాంకు ఖాతా, రూ.3.78 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.76,500 వెండి ఆభరణాలు, రూ.13.50లక్షల విలువైన ఇంటిని కలిగి ఉన్నట్లు తెలిపారు.

* లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రత్యర్థుల పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, ఎమ్మెల్యే శివశంకరప్ప మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భాజపా అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వరను ఉద్దేశిస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె వంట గదికి మాత్రమే సరిపోతారు’ అంటూ కించపర్చారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళలు వంటగదికే పరిమితం అవ్వాలంట – కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలివి. అమ్మాయిలు పోరాడగలరు అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదు. నేను మైదానంలో ఆడి భారత్‌కు పతకాలు సాధించినప్పుడు.. కాంగ్రెస్‌ పార్టీ ఏం ఆలోచించింది? నేను ఎలా ఉంటే బాగుండేది అనుకుంది? ఓవైపు నారీశక్తికి వందనం అని చెబుతూనే.. మహిళలు పలు రంగాల్లో పెద్ద పెద్ద కలలు కంటున్నప్పుడు ఇలా ఎందుకు కించపరుస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. మరోవైపు, స్త్రీద్వేష వ్యక్తుల నుంచి మహిళలకు అవమానం జరుగుతోంది. ఇది నిజంగా చాలా బాధాకరం’’ అని సైనా రాసుకొచ్చారు.

* ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)ను (AP DSC Exam) షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే డీఎస్సీ షెడ్యూల్‌ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్ష కేంద్రాల ఎంపికకు ఈ నెల 20 నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కానీ, ఇంతవరకు వెబ్‌సైట్‌లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శనివారం సీఈవో ప్రకటనతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలను మార్చి 14నే విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. (ap tet results 2024) ఈసీ నిర్ణయం మేరకు కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే.

* వైవాహిక జీవితంలో విఫలమైన ఓ జంట ఒకరినొకరు భూతం, పిశాచి వంటి పేర్లను వాడుతూ దూషించుకోవడం ‘క్రూరత్వం’తో సమానం కాదని పట్నా హైకోర్టు (Patna High Court) పేర్కొంది. తన నుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు వెలువరించిన ఓ తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె మాజీ భర్త, మామ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సమయంలో హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది. బిహార్‌లోని నవాదాకు చెందిన మహిళకు 1993లో ఝార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్‌గుప్తాతో వివాహమైంది. అయితే.. అదనపు కట్నం కింద కారు డిమాండ్‌ చేస్తూ తనను హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె 1994లో తన భర్తతోపాటు మామ సహదేవ్‌ గుప్తాపై స్వస్థలంలో కేసు నమోదు చేశారు. తండ్రీకొడుకుల అభ్యర్థనపై ఈ కేసు నలందకు బదిలీ అయ్యింది. 2008లో కోర్టు ఇద్దరికీ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు అదనపు సెషన్స్ కోర్టుకు వెళ్లగా.. పదేళ్ల తర్వాత అప్పీల్‌ తిరస్కరణకు గురైంది. దీన్ని సవాల్‌ చేస్తూ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా ఆ జంటకు ఝార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

* పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు అఖిల (20) మృతి చెందింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహ క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది. బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నవవధువు మృతి చెందినట్లు నిర్ధారించారు.

* అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం తింటుకూరు అటవీ ప్రాంతంలో ఓ మద్దిచెట్టు నుంచి నీరు ఉబికివస్తోంది. బేస్‌క్యాంప్‌ వద్ద జిల్లా అటవీ శాఖ అధికారితో పాటు సిబ్బంది ఫీల్డ్‌ వర్క్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో 100 మద్ది చెట్లను గుర్తించారు. వాటిలో ఒక చెట్టుకు రంధ్రం చేయగా సుమారు 20 లీటర్ల వరకు నీరు వచ్చింది.

* ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్‌, మొబైల్‌ డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు.

* కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీనియర్‌ నేత కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియంపై అనర్హతవేటు వేసేందుకు సిద్ధమైన్లు సమాచారం. కేసీఆర్‌ సూచన మేరకు శనివారం మధ్యాహ్నాం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం ఒకటి అసెంబ్లీకి చేరుకుంది. కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అందుబాటులో లేరని సమాచారం. దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసే యత్నం చేయగా.. ఆయన కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. దీంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కడియంపైన కాకుండా.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు ఫిర్యాదు చేసేందుకు ఈ బృందం వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో ఇద్దరిపైన లేకుంటే ఇద్దరిలో ఒకరిపైనే బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుకు సిద్ధమైందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎవరి మీద అయినా.. ఆలస్యం చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను బీఆర్‌ఎస్‌ కోరనుందని సమాచారం. ఒకవేళ అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌ స్వీకరిస్తే గనుక.. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయా? అనే ఆసక్తి నెలకొంది.

* లిక్కర్‌ కేసులో ఆమ్‌ఆద్మీపార్టీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఇటీవలే ఈ కేసులో పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ తాజాగా ఢిల్లీ ప్రభుత్వంలోని మరో మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ను శనివారం(మార్చ్‌ 30) ఐదు గంటల పాటు విచారించింది. లిక్కర్‌ స్కామ్‌ సొమ్మును గోవా ఎన్నికల్లో ఆప్‌ పార్టీ ఖర్చు చేసిన విషయం తనకు తెలియదని గెహ్లాట్‌ ఈడీకి సమాధానమిచ్చినట్లు తెలిసింది.

* కే కేశ‌వ‌రావు, క‌డియం శ్రీహ‌రి.. ఊస‌ర‌వెల్లి, పాము లాంటోళ్లు అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఊస‌ర‌వెల్లి ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే రంగులు మారుస్త‌దట‌. పాము గ‌డ్డు స‌మ‌యంలోనే త‌న‌ను ఎవ‌రైనా కొట్టి చంపుతార‌ని అనుకున్న‌ప్పుడు అది ప‌డ‌గ విప్పి కాటేస్త‌ద‌ట‌. కేకే, క‌డియం ఈ రెండింటి కంటే ప్ర‌మాద‌క‌రం అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

* పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకుంటే.. ఆయన భారతదేశ చరిత్రలో నిలిపోతారన్నారు. నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారని.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని.. పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంటూ ఆయన ప్రశ్నించారు.

* Keerthi Bhat | ఈ మధ్య సైబర్‌ నేరాలు ఎక్కువైపోయాయి. అమాయకుల ఆశలు, అవసరాలను ఆసరా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాలుగా మభ్యపెట్టి అకౌంట్లలో దాచుకున్న సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ, సీరియల్‌ నటి కీర్త భట్‌ కూడా సైబర్‌ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. కొరియర్‌ కోసం ఓ లింక్‌పై క్లిక్‌ చేసి సుమారు 2 లక్షల రూపాయలను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్‌ ద్వారా వివరంగా తెలియజేస్తూ బాధపడింది. తనకు రావాల్సిన ఓ కొరియర్‌ ఆలస్యం కావడంతో ఇటీవల ఆమె కొరియర్‌ వాళ్లకు కాల్‌ చేసిందట. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో నెంబర్‌ నుంచి కాల్‌ చేసి మీ అడ్రస్‌ అప్‌డేట్‌ లేకపోవడంతో కొరియర్‌ రాలేదని చెప్పారు. లొకేషన్‌ అప్‌డేషన్‌ కోసం వాట్సాప్‌లో అడ్రస్‌ పంపించమని అడిగారు. వాళ్ల మాటలు నమ్మి కీర్తి భట్‌ వాట్సాప్‌లో లొకేషన్‌ షేర్‌ చేసింది. ఆ తర్వాత నార్మల్‌ మెసేజ్‌ చేయమని చెప్పారు. వాళ్లు చెప్పినట్టే కీర్తి భట్‌ చేసింది. అయితే అడ్రస్‌ అప్‌డేషన్‌కు రెండు రూపాయలు ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుందని చెప్పి ఒక లింక్‌ పంపించారు. వాళ్లు పంపించిన లింక్‌పై క్లిక్‌ చేయగానే 2రూపాయలు కట్‌ అయ్యాయి. సర్లే అనుకుని కీర్తి భట్‌ షూటింగ్‌కు వెళ్లిపోయింది. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో 99 వేలు కట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చింది. ఆ వెంటనే మరో 99వేలు కూడా కట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. వెంటనే ఏం చేయాలో అర్థం కాక తన భర్తతో కలిసి సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. డబ్బులు కట్‌ అయిన వెంటనే ఫిర్యాదు చేశారు కాబట్టి వెంటనే వాళ్ల అకౌంట్లు బ్లాక్‌ చేయించగలిగామని.. కచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని చెప్పారని కీర్తి భట్‌ ఆ వీడియోలో తెలిపింది. ఇలాంటి సైబర్‌ నేరాలు మీకు జరగవచ్చు.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కీర్తి భట్‌ తన ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చింది. సైబర్‌ నేరాలు జరిగినప్పుడు వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z