Politics

సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ-NewsRoundup-Mar 31 2024

సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ-NewsRoundup-Mar 31 2024

* ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. పింఛను లబ్ధిదారులు ఆధార్‌ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సెర్ప్‌ సూచించింది. పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న పరికరాలను (మొబైల్స్‌/టాబ్లెట్స్‌/ఇతర) జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది. అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. వాలంటీర్ల పనితీరుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కథనాలతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంజయ్‌కుమార్‌ శనివారం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

* మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో అసహనం ప్రదర్శించారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తల పేరిట స్థానికేతరులను తీసుకొచ్చి పెత్తనం అప్పజెప్పారు కదా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీంతో కోపంగా “నేను డమ్మీనా”? అని ప్రశ్నిస్తూ మంత్రి బొత్స అసహనం వ్యక్తం చేశారు.

* కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భారాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించాలని కోరారు.

* ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీఎస్‌ ఖాతా లాగిన్‌కు సంబంధించి పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతను మరింత మెరుగు పరుస్తూ 2 ఫ్యాక్టర్‌ ఆధార్‌ బేస్డ్‌ అథంటికేషన్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. పాస్‌వర్డ్‌ ఆధారిత యూజర్లందరూ ఏప్రిల్‌ 1 నుంచి ఈ విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది. మార్చి 15న ఈ మేరకు ఓ సర్క్యులర్‌ జారీ చేసింది.

* వైకాపా కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్‌ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. వర్మ త్యాగం గొప్పదన్న పవన్‌.. ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ‘‘నేను రాష్ట్ర ప్రజల కోసం తగ్గాను. చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడు. అందరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తెలుగు తమ్ముళ్ల బాధ నన్ను కదిలించింది. తెదేపా ఎంతో సమర్థవంతమైన పార్టీ. స్ట్రక్చర్‌ కలిగిన పార్టీని నడపడం అంత సులువు కాదు. జనసేన దగ్గర స్ట్రక్చర్‌ లేదు కానీ బలం ఉంది. ఆ బలం స్ట్రక్చర్‌ కలిసి ముందుకు వెళితేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలం. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. నా కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేసి నా గెలుపునకు సహకరిస్తాననడం శుభ పరిణామం. చంద్రబాబు చెప్పారు నేను చేస్తా.. అని ఒకే మాట చెప్పారు. ఒంటరిగా పోరాడి గెలిచే దమ్మున్న నాయుడు వర్మ. కానీ, రాష్ట్రం బాగుపడాలని మంచి ఉద్దేశంతో ఆయన సీటు త్యాగం చేయడం శుభ పరిణామం. తెదేపా, భాజపా హక్కులకు, రాజకీయ మనుగడకు ఇబ్బంది లేకుండా పనిచేస్తాం. జనసేన, తెదేపా నాయకుల మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలి. పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి. ఆ బాధ్యత వర్మకు అప్పగిస్తున్నా’’ అని పవన్‌ అన్నారు.

* వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భాజపా చెబుతోన్న విషయం తెలిసిందే. వీటిపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కనీసం 200 నియోజకవర్గాల్లో గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేయబోమని ఉద్ఘాటించిన దీదీ.. సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే విదేశీయులుగా మారతారని హెచ్చరించారు. ‘400లకుపైగా స్థానాల్లో గెలుస్తామని భాజపా చెబుతోంది. కనీసం 200 మార్కు దాటమని చెప్పండి. సవాల్‌ విసురుతున్నా. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200లకుపైగా సీట్లలో గెలుస్తామని చెప్పారు. కానీ, 77 దగ్గరే ఆగిపోయారు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

* మనం ఒక్కోసారి ఆటో లేదా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు మొదట చూపించిన ఛార్జీకి, ప్రయాణం పూర్తయిన అనంతరం చూపించే రుసుముకు తేడా ఉంటుంది. అదనంగా ఇరవై, ముప్పై రూపాయలు అయినా చెల్లిస్తుంటాము. కాని అదే బిల్లు కోట్లలో వస్తే? ఓ ఉబర్‌ వినియోగదారునికి ఇదే పరిస్థితి ఎదురైంది. అసలేమైందంటే.. నోయిడాకు చెందిన దీపక్‌ టెంగూరియా ఉబర్‌ ఆటోను బుక్‌ చేసుకున్నాడు. ఆ సమయంలో చెల్లించవలసిన మొత్తం రూ.62గా చూపించింది. అనంతరం యాప్‌లో ఏకంగా రూ.7.66కోట్ల బిల్లు చెల్లించాలని నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో దీపక్‌ నిర్ఘాంతపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అతని స్నేహితుడు ఆశిష్ మిశ్రా ఎక్స్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. పోస్టులో అతడు ‘‘ఉబర్‌ ఆటో బుక్‌ చేసుకున్నందుకు ఆ కంపెనీ నా స్నేహితుడిని గొప్పవాడిని చేసింది. ఈ ఫ్రాంచైజీనే కొనాలనుకుంటున్నాడు. విచిత్రమేంటంటే ట్రిప్ రద్దు కాకపోవడం విశేషం. 62రూపాయలకు ఆటోను బుక్ చేసుకొని మీరు కూడా కోటీశ్వరులుగా మారండి. ’’అంటూ రాసుకొచ్చారు.

* గత రెండు పర్యాయాలుగా దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా.. అక్కడ హస్తానిదే పైచేయి. భాజపా నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నా విజయం మాత్రం కాంగ్రెస్‌దే. అదే స్వర్ణదేవాలయానికి నిలయమైన పంజాబ్‌లోని అమృత్‌సర్‌ లోక్‌సభ నియోజకవర్గం. భాజపా శనివారం రాత్రి అభ్యర్థులను ప్రకటించిన 11 స్థానాల్లో ఇదొకటి. అమెరికాలో భారత రాయబారిగా పని చేసిన తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ఈ స్థానంలో తరణ్‌జీత్‌ విజయం నల్లేరు మీద నడక కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 సార్లు ఎన్నికలు నిర్వహించగా.. కేవలం 5 సార్లు మాత్రమే భాజపా విజయం సాధించింది. 2004-2009 మధ్య కాలంలోనే 3 సార్లు ఎన్నికలు జరగ్గా.. భాజపా తరఫున నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గెలుపొందారు.

* పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా కొన్ని విలువైన సూచనలు చేశారు. చిన్న వయసులోనే మదుపు ప్రారంభించాలని ప్రోత్సహించే ఆమె.. పిల్లల కోసం కూడా వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. కీలక పత్రాలను చేయించడంతో మొదలుపెట్టి నెలనెలా సిప్‌ చేయాలని సూచించారు. లక్ష్యాలను నిర్దేశించుకొని.. పరిస్థితులకు అనుగుణంగా వాటిని సమీక్షించాలని ఎక్స్‌ వేదికగా సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ అకౌంట్‌ వంటి డాక్యుమెంట్లను చేయించాలి. మైనర్లు అయినప్పటికీ వీటన్నింటినీ పొందొచ్చు. పిల్లల కోసం మదుపు చేసే ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు వారి ఉన్నత చదువులు. దీన్ని తిరిగి చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని.. ఒక్కో ఏడాది ఎంత ఇన్వెస్ట్‌ చేయాలో నిర్ణయించుకోవాలి. ప్రతినెలా క్రమానుగత పెట్టుబడి పథకాల్లో (SIP) మదుపు చేయాలి. కనీసం 2, 3 ఫండ్లలో సిప్‌ చేస్తే మేలు. మార్కెట్‌ ఎక్స్‌పోజర్‌ కోసం లార్జ్‌/మిడ్‌ ఇండెక్స్‌ ఫండ్‌, రిస్క్‌ కోసం మిడ్‌/స్మాల్‌ ఫండ్‌, విదేశీ విద్య కోసం కరెన్సీ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇంటర్నేషనల్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వాటికి చేరువవుతున్న కొద్దీ పొదుపుగా వ్యవహరించాలి. పిల్లలకు అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత వారిని కూడా ఈ ప్రయాణంలో భాగం చేయాలి. ఇది ప్రతిఒక్కరికీ సరిపోయే ప్రణాళిక కాదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరికి వారు వాళ్ల ప్రణాళికలను రచించుకోవాలి. ‘‘ఆట వస్తువులతో ఇంటిని నింపి స్థలం లేకుండా చేసుకోవడానికి బదులు ఇలాంటి ఆర్థిక బహుమతుల వల్ల వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. వీటి వల్ల ప్రయోజనమే కాకుండా.. ఇంట్లో స్థలమూ మిగులుతుంది’’ అని గుప్తా సరదాగా వ్యాఖ్యానించారు.

* గత పదేళ్లలో ట్రైలర్‌ మాత్రమే చూశారని, అసలు అభివృద్ధి ముందుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న ఐదేళ్లలో దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు భాజపా రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసిందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరట్‌లో ప్రధాని పర్యటించారు. ముచ్చటగా మూడోసారి భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేరట్‌ విప్లవాల గడ్డ అని, విప్లవకారులకు పుట్టినిల్లని అన్నారు. చౌదరి చరణ్‌సింగ్‌ లాంటి ఎందరో నాయకులను దేశానికి అందించిన మహమాన్వితమైన నేల మేరట్‌ అని కొనియాడారు.

* ఎన్నికల బాండ్ల వివరాలతో భాజపా అసలు స్వరూపం బయటపడిందని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. భాజపాను ‘భ్రష్ట్‌ (అవినీతి) జనతా పార్టీ’గా పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం అజిత్‌ పవార్‌, అశోక్‌ చవాన్‌, నవీన్‌ జిందాల్‌ వంటి కళంకితులను స్వాగతిస్తోందని విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సభలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చిన ఠాక్రే ఈ మేరకు మాట్లాడారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టిన కమలదళం.. ఉద్ధవ్‌ పాలనలోని అవినీతిని వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

* ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. శాశ్వత, తాత్కాలిక ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్‌ ఎంబసీ ఒక నోటీసును ప్రచురించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రాథమిక అర్హత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి. ఖతార్‌లోని ఇండియన్‌ ఎంబసీలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా గుర్తింపు ఉన్న సంస్థ లేదా కార్యాలయంలో క్లరికల్ పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. అరబిక్‌లో ప్రావీణ్యం అదనపు అర్హత. అభ్యర్థులు తమ అదనపు అర్హతలు, పని అనుభవం లేదా సర్టిఫికెట్లను అప్లికేషన్‌లో చూపవచ్చు. అన్ని అలవెన్సులతో కలిపి నెలవారీ జీతం 5,500 ఖతార్ రియాల్స్ అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 1.25 లక్షలు ఉంటుంది. చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న అభ్యర్థులు 2024లోపు ఏప్రిల్ 7 దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పంపడానికి ప్రచురించిన నోటీసుతో పాటు ఇండియన్‌ ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో లింక్ అందుబాటులో ఉంటుంది.

* బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్‌‌లో చేర్చుకున్నారు. అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున అటూ-ఇటూ నేతలు మారుతూనే ఉంటారు. ఖైరతాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరడం, స్వయంగా రేవంత్ కాంగ్రెస్‌ కండువా కప్పడం కచ్చితంగా అభ్యంతరకరం అని చెప్పాలి. కేసీఆర్‌ గతంలో తమకు చేసిన అవమానానికి ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని సీఎం చెప్పవచ్చు. అంతేకాక తన ప్రభుత్వాన్ని పడగొడతానంటున్నారు కనుక తానే ఎడ్వాన్స్ అవుతున్నానని అనవచ్చు. ఇక్కడ విశేషం ఏమిటంటే బీఆర్‌ఎస్‌ నుంచి ఎంత మంది దొరికితే అంతమందిని తమ పార్టీలలో కలుపుకోవడానికి కాంగ్రెస్‌, బీజేపీలు పోటీ పడుతున్నాయి. దీనిని ఎదుర్కోవడం బీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు పెద్ద సవాలే! ఇప్పటికే పాతిక మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రేవంత్‌కు టచ్‌లోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. బహుశా గతంలో కేసీఆర్‌ చేసినట్లుగానే బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నట్లు ప్రకటిస్తారేమో చూడాలి. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఇది గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుసరించినట్లే కాంగ్రెస్‌ స్పీకర్ ప్రసాదకుమార్ కూడా వ్యవహరించారు. పోచారం మాదిరే ప్రసాద్‌ కూడా బీఆర్‌ఎస్‌ ఫిర్యాదును తీసుకోవడానికి ఇష్టపడలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కూడా ఒక్కొక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పార్టీ మారిన తర్వాత, అందరు కలిసి విలీనం అయినట్లు లేఖ ఇస్తే దానికి పోచారం ఆమోదముద్ర వేశారు. సరిగ్గా అదే స్ట్రాటజీని ఈ స్పీకర్ కూడా ఫాలో అవుతుండవచ్చు.

* గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్‌ పంపిణీ బదులు సచివాలయంలో పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీకి ప్రత్యామ్నాయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయంలోని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ కార్డు, బయో మెట్రిక్ ఆధారంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ విధానం నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 3 నుంచి సచివాలయంలో పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.

* మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక బ్లాక్‌బస్టర్‌ సినిమా మంజుమ్మెల్‌ బాయ్స్‌. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. మాలీవుడ్‌లో మునుపెన్నడూ ఊహించని రేంజ్‌లో బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ మూవీ తెలుగులోకి రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం (మార్చి 31) మంజుమ్మెల్‌ బాయ్స్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

* అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. ఫలితంగా భీకర ఫామ్‌లో ఉండిన సన్‌రైజర్స్‌కు శృంగభంగం ఎదురైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. గుజరాత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డేవిడ్‌ మిల్లర్‌ సిక్సర్‌ బాది మ్యాచ్‌ ముగించాడు.

* ఇటీవల అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరేన్‌లను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్‌ చేసింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్‌ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్‌(ఈసీ)ని కూటమి డిమాండ్‌ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్‌, మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి.

* కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ అస్తవ్యస్తంగా తయారైందని, ఈ వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన పొలం బాటలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిపెట్టి నష్టపోయామని రైతులు‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారన్నారు. తమకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు. మూడు నెలల్లోనే ఈ పరిస్థితంటే రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే భయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ‘చీఫ్‌ మినిస్టర్‌ వేర్‌ ఆర్‌ యూ స్లీపింగ్‌’ అని ప్రశ్నించారు. డిసెంబర్‌ 9న చేస్తానన్న రైతు రుణమాఫీ ఏమైందో చెప్పాలన్నారు. డిసెంబర్‌ 9 వెళ్లి ఎన్నిరోజులైందని నిలదీశారు. ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.

* వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z