* మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం (Old Financial Year) కాల పరిమితి ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం (New Financial Year) ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Union Finance Ministry) దృష్టికి వచ్చింది. ఈ మేరకు కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ పలు కీలకాంశాలను ‘ఎక్స్ (ట్విటర్)’లో పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న అంశాలు ఇవే. 01.04.2024 నుంచి పన్ను విధానంలో కొత్తగా మారేదీ ఏదీ లేదు. ప్రస్తుత పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానం ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్ (స్టాండర్డ్ డిడక్షన్ 50,000, ఫ్యామిలీ పెన్షన్ 15,000 మినహా) కొత్త విధానంలో లేవు.కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై (RBI) ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. గడిచిన 10 ఏళ్ల బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంలో ఆర్‌బీఐ కీలక భూమిక పోషించిందని కొనియాడారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబయిలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌బీఐ గవర్నర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారకు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు.
* బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి ధర (Gold price) సరికొత్త గరిష్ఠాలకు చేరింది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర సోమవారం సాయంత్రం నాటికి రూ.70,978 (పన్నులతో కలిపి) పలుకుతోంది. అంతక్రితం రోజుతో పోలిస్తే రూ.వెయ్యికి పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుతున్నాయి. వెండి సైతం కిలో రూ.1,120 మేర పెరిగి రూ.78,570కి చేరింది.
* భారత్‌ను ‘గ్రీన్ ఎకానమీ’ (Green Economy)గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ (GST) తగ్గించడంతోపాటు 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి దేశానికి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవడం సాధ్యమేనా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘100 శాతం సాధ్యమే’ అని ధీమా వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని లాభాలతో ఆరంభించాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకిన సూచీలు.. కాస్త క్షీణించి ఓ మోస్తరు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల మూలంగా సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 74 వేలు, నిఫ్టీ 22,450 ఎగువన ముగిశాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z