* కచ్చతీవు (Katchatheevu) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్(S Jaishankar) ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ప్రశ్నించారు. దేశానికి ద్రోహం చేసి ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలను సమర్థిస్తూ జై శంకర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఎక్స్(ట్విటర్) వేదికగా హస్తం పార్టీ నేత స్పందించారు. ‘‘గత 50 ఏళ్లుగా మత్స్యకారుల్ని నిర్బంధిస్తున్నారన్నది వాస్తవం. అలాగే శ్రీలంక మత్స్యకారుల్ని భారత్ అదుపులోకి తీసుకుంటుంది. శ్రీలంకతో కేంద్రంలోని ప్రతీ ప్రభుత్వం చర్చలు జరిపి, వారిని విడిపిస్తోంది. జై శంకర్.. ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా, విదేశాంగ శాఖ సెక్రటరీగా, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఘటనలు జరిగాయి. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదా..? తమిళనాడులో ఇతర పార్టీలతో అధికార భాజపా పొత్తులో ఉన్నప్పుడు జరగలేదా..? ఇప్పుడు కాంగ్రెస్, డీఎంకేపై విమర్శలు చేయడానికి కొత్తగా కనిపించిన కారణం ఏంటి..? 27-1-2015 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. ఆ దీవిని శ్రీలంకకు ఇవ్వడానికి గల కారణాన్ని అందులో వివరించారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆ మంత్రిత్వ శాఖ పిల్లిమొగ్గలు వేస్తోంది. ఒక ఉదారవాద అధికారి ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్-భాజపా మౌత్‌పీస్‌గా మారిపోయారు. కొందరు ఎంత వేగంగా రంగులు మార్చగలరో’’ అని మంత్రిని ఉద్దేశించి విమర్శించారు.
* పింఛన్ల పంపిణీపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు సూచించారు. వారంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ ఇబ్బంది లేదని, నగరాలు, పట్టణాల్లో కొంచెం కష్టతరమవుతుందని చెప్పారు. ఒకవేళ గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేస్తే.. సౌకర్యాలు కల్పించాలని కొందరు కలెక్టర్లు సీఎస్‌కు వివరించారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎస్ ఈ రాత్రికి పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తామన్నారు.
* శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది కూడా భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. టీఎస్‌ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
* పింఛన్లు పంపిణీ చేయకుండా వైకాపా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పంపిణీకి రాష్ట్రంలో ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. దిల్లీలో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ విషయంపై సీఎస్‌తో మాట్లాడాను. 3వ తేదీ నుంచి వారం పాటు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులు పింఛను అందుకునేందుకు 10 రోజులు నిరీక్షించాలా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ఇవ్వాలని ఈసీ ఆదేశాలిస్తే ఎందుకు అమలు చేయడం లేదు? డీబీటీ ద్వారా వెంటనే పింఛన్లను పంపిణీ చేయాలి. లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతాం’’ అని షర్మిల హెచ్చరించారు.
* రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పోలీసుశాఖ, ఇతర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాల్లోనూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలపై నిఘా పెంచాలన్నారు. నగదు అక్రమ రవాణా తదితర అంశాలపై ఇతర రాష్ట్రాల అధికారులతోనూ సమావేశాలు నిర్వహించినట్లు డీజీపీ రవి గుప్తా సీఎస్‌కు తెలియజేశారు. 85 సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్లెయింగ్ స్క్వాడ్‌లు బృందాలను ఏర్పాటు చేశామన్న ఆయన.. గత 15 రోజుల్లో రూ.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు సరిహద్దు చెక్‌పోస్టుల్లో రూ.5.19 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వాణిజ్య పన్నుల కమిషనర్ సీఎస్‌కు వివరించారు. పరిశ్రమలు, గోదాములపై నిఘా పెంచామన్నారు.
* మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో రెండు వారాల పాటు ఆయన తిహాడ్ జైలులోనే ఉండనున్నారు. భారీ భద్రత నడుమ ఈ సాయంత్రమే ఆయనను జైలుకు తరలించారు. సీఎంకు రెండో నంబరు గదిని కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా ప్రస్తుతం ఇదే జైలులో ఒకటో నంబరు గదిలో ఉన్నారు. ఇక, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు ఐదో నంబరు గదిని కేటాయించారు. మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ ఏడో నంబరు సెల్‌లో ఉన్నారు.
* తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో బస్సు శేషచలం లోయలో పడకుండా ఓ చెట్టు అడ్డుగా నిలిచింది. దీంతో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై తితిదే, ఆర్టీసీ అధికారులు ఆరా తీస్తున్నారు.
* అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టీ (Eric Garcetti) 2023 మేలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)ను తాను మొదటిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాను షారుఖ్‌ను కలిసినప్పుడు అతనెవరో తెలియదని అనంతరం తన స్నేహితుల ద్వారా షారుఖ్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలుసుకున్నానని అన్నారు. ఇటీవల ఓ వార్తాసంస్థతో ముచ్చటిస్తున్న సమయంలో గార్సెట్టీ షారుఖ్‌ను కలిసిన విషయం గుర్తు చేసుకున్నారు. ‘‘నేను ఫారుఖ్‌ను ముంబయిలోని అతడి నివాసం మన్నత్‌లో మొదటిసారి కలిసినప్పుడు మేము క్రికెట్ గురించి చర్చించుకున్నాం. ఎందుకంటే ఆయన లాస్ ఏంజిల్స్ జట్టులో ఓ భాగానికి యజమానిగానే నాకు తెలుసు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను చూసినప్పుడు మా కార్యాలయంలోని వారంతా ఆశ్యర్యపోయారు. మీరు ఎవరిని కలిశారో తెలుసా.. అతను ఇండియాలోని ప్రముఖ నటుల్లో ఒకరు అని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న పాపులారిటీని, అభిమానులను చూసి షాక్ అయ్యాను.’’అని తెలిపారు. 2023 మేలో షారూఖ్‌ను, ఎస్‌ఎస్ రాజమౌళిని కలిసినట్లు అప్పట్లోనే గార్సెట్టీ తన ఎక్స్ ఖాతాలో వారితో కలిసి తీసుకున్న ఫొటోలను పోస్టు చేశారు.
* సూర్యాపేటలో భారాస అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. భారాస నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతుంటే ఆయన తట్టుకోలేపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా?అని ప్రశ్నించారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. మైక్ సమస్య వస్తే..కరెంట్ కోతలు అంటూ అబద్ధాలు మాట్లాడారని చెప్పారు.
* ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ మేరకు అభ్యర్థుల జాబితాకు తుది రూపు తీసుకొచ్చినట్లు సమాచారం. సీఈసీ భేటీకి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. 117 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులుగా పలువురి పేర్లకు ఆ పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు సత్యారెడ్డి (విశాఖపట్నం), పళ్లంరాజు (కాకినాడ), జేడీ శీలం (బాపట్ల) అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z