మంచినీటి ట్యాంకులో పడి దాదాపు 30 కోతులు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవిహార్ సమీపంలోని 200 గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు నీటిసరఫరా విభాగం ఓ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకులోని నీళ్లు తాగేందుకు కోతులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ట్యాంకులోకి దిగిన వానరాలకు బయటకు వచ్చే దారి దొరక్క.. అందులోనే మృత్యువాత పడ్డాయి. బుధవారం అధికారులు గుర్తించి దాదాపు 30 వానర కళేబరాలను వెలికితీశారు. నీటి ట్యాంకులో కోతులు మృతి చెందిన విషయం వెలుగు చూడటంతో స్థానికంగా నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోతులు చనిపోయి దాదాపు పదిరోజులపైనే అయింటుందని, అప్పటి నుంచి ఆ నీటినే తాగుతున్నామని చెబుతున్నారు. అనారోగ్యం బారిన పడతామని భయపడుతున్నారు. కాలనీలోని నివాసగృహాలకు నీటిని సరఫరా చేసే ట్యాంకులను ప్రతి ఆరు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలని, అధికారులు మాత్రం ఏనాడూ శుభ్రం చేయించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన నీటి సరఫరా విభాగం అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z