Business

$2291 వద్ద బంగారం ధర-BusinessNews-Apr 03 2024

91 వద్ద బంగారం ధర-BusinessNews-Apr 03 2024

* యాపిల్‌ (Apple) ఉత్పత్తులను వినియోగించే యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన హెచ్చరికలు చేసింది. ఐఫోన్‌ (iPhone), మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, విజన్‌ ప్రో హెడ్‌ సెట్లకు ‘హై-రిస్క్‌’ అలర్ట్‌ ఇచ్చింది. ఈ ఉత్పత్తుల్లో ‘రిమోట్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌’కు సంబంధించి క్లిష్టమైన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు తాము గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) వెల్లడించింది. ఈ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేసి మన డివైజ్‌లను రిమోట్‌గా ఆపరేట్‌ చేసే ముప్పు ఉందని హెచ్చరించింది. అందువల్ల యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్‌ సెక్యూరిటీ వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.4.1, 16.7.7 కంటే ముందు వెర్షన్ల, సఫారీ 17.4.1, మ్యాక్‌ఓఎస్‌ వెంట్యురా 13.6.6, మ్యాక్‌ఓఎస్‌ సొనోమా 14.4.1, యాపిల్‌ విజన్‌ ఓఎస్‌ 1.1.1 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది.

* అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్‌ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది.

* జపాన్‌ను సందర్శించాలనుకునే భారతీయులు ఇకపై తమ పాస్‌పోర్ట్‌లపై భౌతిక వీసా స్టిక్కర్లను పొందాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుండి, జపాన్ భారతీయ పర్యాటకుల కోసం ఈ-వీసాల జారీని ప్రారంభించింది. పర్యాటకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ జపాన్ ఈ-వీసా ప్రోగ్రామ్‌.. వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ వీసా ప్రోగ్రామ్‌ ప్రత్యేకంగా పర్యాటక ప్రయోజనాల కోసం సింగిల్-ఎంట్రీ స్వల్పకాలిక వీసాను అందిస్తుంది. జపాన్‌లో గరిష్టంగా 90 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు, విదేశీ పౌరులు ఈ ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

* గుజరాత్‌లోని ఖావ్‌డా సోలార్‌పార్క్‌లో కొత్తగా 2,000 మెగావాట్ల సౌర ఇంధన సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Limited- AGEL) బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో 10వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉన్న తొలి కంపెనీగా నిలిచినట్లు తెలిపింది. మొత్తంగా కంపెనీ నిర్వహణ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం 10,934 మెగావాట్లకు చేరినట్లు వెల్లడించింది. తమ నిర్వహణలోని పోర్ట్‌ఫోలియోలో 7,393 మెగావాట్ల సోలార్‌, 1,401 మెగావాట్ల పవన విద్యుత్తు, 2,140 మెగావాట్ల పవన-సౌర హైబ్రిడ్‌ విద్యుత్తు సామర్థ్యం ఉన్నట్లు అదానీ గ్రీన్‌ తెలిపింది. 2030 నాటికి 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. తమ 10,934 మెగావాట్ల సామర్థ్యంతో 58 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా అవుతుందని తెలిపింది. ఏటా 2.1 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించొచ్చని పేర్కొంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాలో వెలువడిన తాజా గణాంకాల ప్రభావంతో వడ్డీ రేట్ల తగ్గింపు తాత్సారం కావొచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. దీంతో సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 73,757.23 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,540.27 – 74,151.21 మధ్య చలించింది. చివరికి 27.09 పాయింట్ల నష్టంతో వద్ద 73,876.82 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 18.65 పాయింట్లు నష్టంతో 22,434.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడగా.. నెస్లే ఇండియా, కోటక్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 89.12 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,291 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z