Business

UPI నుండి శుభవార్త-BusinessNews-Apr 05 2024

UPI నుండి శుభవార్త-BusinessNews-Apr 05 2024

* ఆర్థిక నిపుణుల ముందస్తు అంచనాలకు అనుగుణంగానే ‘రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును (Repo Rate) 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయాణానికి దగ్గరి సంబంధం ఉందని దాస్‌ అన్నారు. సంస్థపై ఉన్న బహుళ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను స్వీకరిస్తామన్నారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆర్‌బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* సౌలభ్యం, వేగం కారణంగా భారత్‌లో యూపీఐకి (UPI) గణనీయమైన ప్రజాదరణ లభిస్తోంది. డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తోంది. ఈ నేపథ్యంలో దీని వినియోగాన్ని ఆర్‌బీఐ (RBI) ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. తాజాగా నగదు డిపాజిట్లను సైతం యూపీఐ ద్వారా చేసే సదుపాయాన్ని త్వరలో తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. ‘క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్ల (CDM)’లో ఇప్పటి వరకు డెబిట్‌ కార్డు ద్వారా మాత్రమే నగదు డిపాజిట్‌ చేసే సదుపాయం ఉంది. త్వరలో యూపీఐని ఉపయోగించి కూడా సీడీఎంలో డబ్బును జమ చేసే వెసులుబాటును తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. బ్యాంకుల్లో భారీ క్యూలను నివారించేందుకు ఆర్‌బీఐ సీడీఎం వసతిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో సూచీలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల కోత ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టమైన సంకేతాలు లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటివి మదుపరులపై ప్రభావం చూపాయి. దీంతో సూచీలు స్తబ్దుగా ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 74,287.02 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా లాభ, నష్టాల మధ్య కదలాడింది. 73,946 – 74,361 మధ్య చలించిన సూచీ.. చివరికి 20.59 పాయింట్ల వద్ద 74,248.22 ముగిసింది. నిఫ్టీ సైతం 0.95 పాయింట్ల నష్టంతో 22,513.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.30గా ఉంది. సెన్సెక్స్‌లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా లాభపడగా.. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్‌ రకం బ్యారెల్‌ 90.98 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు 2314 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* భారత వృద్ధి అంచనాలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ స్పందించింది. వృద్ధి అంచనాలు ఆయన వ్యక్తిగతమని, వాటితో తమకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. ఐఎంఎఫ్‌ వెలువరించిన అంచనాలకు భిన్నంగా భారత్ 8 శాతం వృద్ధి సాధిస్తుందన్న సుబ్రమణియన్‌ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఐఎంఎఫ్‌ అధికార ప్రతినిధి జూలీ కొజాక్‌ ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఆ అంచనాలతో తమకు సంబంధం లేదన్నారు.

* ఆటో మొబైల్‌ విభాగంలో అడుగుపెట్టేందుకు ‘ప్రాజెక్ట్‌ టైటన్‌’ పేరిట కసరత్తు చేసిన యాపిల్‌ (Apple).. చివరకు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. అనివార్య కారణాలతో స్మార్ట్‌ కార్‌ ప్రాజెక్ట్‌కు స్వస్తి పలికింది. ఇప్పుడు టెక్‌ దిగ్గజం తాజాగా హోమ్‌ రోబోటిక్స్‌ (home robotics) విభాగంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. యాపిల్‌ తీసుకురానున్న ఈ రోబో యజమానిని అనుసరిస్తూ.. వారికి పనులు చేయడంలో సాయపడుతుంది. ఇంటి పనుల్లో తోడ్పడుతుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు డిస్‌ప్లే చూపిస్తుంది. ఈ రోబో రెండు చేతులు, ఒక డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ విభాగాలు ఈ ప్రాజెక్ట్‌పై పని చేయనున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని, దీనిపై యాపిల్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z