* ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభంలో బంగారం, వెండి ధరలు ధగధగమెరుస్తున్నాయి. శనివారం (2024 ఏప్రిల్ 6) దేశీయ బులియన్ మార్కెట్లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.1200 పెరిగి రూ.65,350లకు చేరుకున్నది. మరోవైపు 24 క్యారట్ల మేలిమి బంగారం తులం ధర రూ.1310 పెరిగి రూ.71,290 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నది. ఏప్రిల్ నెల తొలి ఆరు రోజుల్లోనే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.3300, 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.3600 పెరిగాయి. ఇంతకుముందు మార్చి 29న 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1300, 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1,420 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ బంగారం ధర 2300.49 డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు ఇంట్రా డే ట్రేడింగ్‌లో 2304.09 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ.1800 పెరిగి రూ.83,500లకు చేరుకుంది.
* మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినా, దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయాలన్నా బ్యాంకుల్లో డీ-మ్యాట్ ఖాతాలు తెరవడం తప్పనిసరి. దేశంలో డీమ్యాట్ ఖాతాలు కొత్త రికార్డు నమోదు చేశాయి. భారత్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో డీమ్యాట్ ఖాతాలు కొత్తగా 3.70 కోట్ల ఖాతాలు ప్రారంభం అయ్యాయి. ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆకర్షణీయ లాభాలు వస్తుండటంతో ఇన్వెస్టర్లలో సానుకూలత నెలకొంది. ప్రతి నెలా సరాసరి 30 లక్షల మందికి పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలను తెరుస్తున్నారు. దీంతో డీమ్యాట్ ఖాతాలు 15 కోట్లకు చేరాయి.
* దేశీయ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మార్చి 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు రూ.2.95 బిలియన్ డాలర్లు పెరిగి రూ.645.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైం గరిష్టం. ఇంతకు ముందు వారం (మార్చి 22) లో 140 మిలియన్ డాలర్లు పెరిగి 642.63 బిలియన్ల డాలర్లకు చేరాయి ఫారెక్స్ రిజర్వు నిల్వలు. వరుసగా ఆరు వారాలుగా ఫారెక్స్ రిజర్వు నిల్వలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 642.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
* ఇప్పుడు రోజువారీ కిరాణ సరుకులు మొదలు.. సినిమా టికెట్లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతుంటాయి. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత మొబైల్ యాప్స్‌తో చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతాయి. రోజురోజుకు పెరుగుతున్న యూపీఐ పేమెంట్స్ గత నెలలో సరికొత్త రికార్డు నెలకొల్పాయి. గత నెలలో 1,344 కోట్ల లావాదేవీల్లో రూ.19.78 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. గత ఫిబ్రవరి యూపీఐ పేమెంట్స్ రూపంలో రూ.18.28 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయి. గతేడాది మార్చి లావాదేవీలతో పరిగణిస్తే లావాదేవీలు 55.35 శాతం పెరిగితే చెల్లింపులు 40.81 శాతం పుంజుకున్నాయి. 2023 మార్చిలో యూపీఐ ద్వారా రూ.14.05 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి.
* శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్న 4.9 కిలోల బంగారాన్ని కోస్ట్ గార్డ్, కస్టమ్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ).. విభాగాల అధికారులు జాయింట్ ఆపరేషన్‌లో జప్తు చేశారు. రూ.3.43 కోట్ల విలువ గల బంగారాన్ని జప్తు చేసినట్లు తెలిపారు. ఇండియన్ కోస్ట్‌గార్డులు (ఐసీజీ), కస్టమ్స్ ప్రివెంటివ్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సంయుక్తంగా సముద్రం మధ్యలో వెధలాయి కోస్తా తీరప్రాంతం మండపం వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చేపల వేటకు వినియోగించే బోట్ ద్వారా వెధలాయి కోస్తా మీదుగా శ్రీలంక నుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం లభించడంతో డీఆర్ఐ, ఐసీజీ విభాగాల అధికారులు ఈ నెల మూడో తేదీ నుంచి నాలుగో తేదీ వరకూ కోస్తా తీర ప్రాంతంపై నిఘా పెట్టారు. ఏప్రిల్ నాలుగో తేదీ తెల్లవారుజామున సముద్ర మధ్య ఒక పడవ వస్తున్నట్లు గుర్తించారు. ఇండియా కోస్ట్‌గార్డ్స్ ఓడ ద్వారా వెళ్లి, ఆ పడవను, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పట్టుకునే లోపే పడవపై వస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తమ వెంట తీసుకువస్తున్న లగేజీని సముద్ర జలాల్లో పడవేస్తున్న దృశ్యాలను అధికారులు చూశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తమ నేరాన్ని అంగీకరించారు.సముద్ర గర్భంలో వెలికి చూడగా బంగారం బయట పడింది. శనివారం సముద్ర గర్భం నుంచి వెలికి తీసిన బంగారం ధర రూ.9.43 కోట్లు ఉంటుందని అంచనా.
* ప్రపంచ కుబేరుడు, టెస్లా ఇంక్ అధినేత శనివారం ఎలాన్ మస్క్ రోబో టాక్సీపై కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఆగస్టు 8న టెస్లా రోబో ట్యాక్సీ ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. తొలిసారిగా రోబో టాక్సీపై మస్క్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రోబో టాక్సీ ఓనర్స్ కార్లను వినియోగించుకోని సమయంలో అద్దెకు ఇచ్చి కొంత డబ్బును సంపాదించేందుకు అవకాశం ఉంది. ఇందులో కంపెనీ కమిషన్ వసూలు చేస్తుంది. అయితే, రోబోటాక్సీ సర్వీసెస్ మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు టెస్లా చాలా అవాంతరాలు ఎదుర్కొంది. దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయడానికి టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ రెగ్యులరేటరి ఆమోదం పొందడం ప్రధాన అడ్డంకిగా మారింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) బీటా సాఫ్ట్‌వేర్‌లో సమస్యలను గతేడాది గుర్తించింది. దాంతో టెస్లా అనేక వాహనాలను రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో రోబో టాక్సీ లాంచ్ డేట్‌ను పొడిగించాల్సి వచ్చింది. టెస్లా కార్లలోని సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా వేగం పరిమితులను ఉల్లంఘిస్తాయని రెగ్యులేటరి హెచ్చరించింది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు టెస్లా కార్లను రీకాల్ చేయాల్సి వచ్చింది. ఇటీవల డ్రైవర్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ తాజా వెర్షన్ ఇటీవల విడుదల చేసింది. తమ తర్వాతి తరం వెహికిల్ ప్లాట్‌ఫామ్‌లో సరసమైన కారు, డెడికేటెడ్ రోబోటాక్సీ రెండూ ఉంటాయని కంపెనీ తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z