Politics

అందుకే నేను భాజపాతో మళ్లీ కలిశాను-NewsRoundup-Apr 06 2024

అందుకే నేను భాజపాతో మళ్లీ కలిశాను-NewsRoundup-Apr 06 2024

* కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్న సదుద్దేశంతో భాజపాతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా కలిసింది రాష్ట్రం కోసమేనని చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రావణాసురుడిని చంపేందుకు వానర సైన్యమంతా కలిసిందన్నారు.

* దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నాశనం చేశారని కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు భాజపా (BJP)లో చేరేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలను పెంచి పోషించే విషయంలో ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

* నిష్పక్షపాత వైఖరి కోల్పోయి.. ఒక రాజకీయ పార్టీకి అండగా పనిచేస్తున్న అధికారులు చింతించే రోజు తప్పకుండా వస్తుందని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) సంస్థ ఉపాధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రవర్తనా లోపాలతో మచ్చలేని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభాసుపాలు చేయొద్దని హితవు పలికారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించి, ఆదరించి, ఆచరించి, పోటీ చేసిన అభ్యర్థులందరికీ నమ్మకాన్ని కలిగించాల్సిన తరుణమొచ్చిందని సీఎఫ్‌డీ ప్రతినిధులు పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకున్నవాళ్లం కాదంటూ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. జిల్లా కలెక్టరు నుంచి సీఎస్‌ వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు నిష్పక్షపాత వైఖరి చూపించాలని పిలుపునిచ్చారు. ఈసీ ఆదేశాలు విఫలమయ్యేలా చేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

* వైఎస్‌ వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే.. వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు. వైఎస్‌ వివేకా హత్యపై ఐదేళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని చెప్పారు. తనకు చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అని వివరించారు. అవినాష్‌ రెడ్డిని గెలవకుండా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తన పోరాటం రాజకీయం కోసం కాదని.. న్యాయం కోసమని స్పష్టం చేశారు.

* కడప లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన. ‘‘నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని. కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా!’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.

* కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పర్యావరణం, నీటి నిర్వహణ విభాగాలలో థాయ్‌లాండ్, న్యూయార్క్‌లోని బఫెలో నది చిత్రాలను వినియోగించిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పర్యావరణ విభాగం కింద థాయ్‌లాండ్‌లోని గడ్డి భూముల ఫోటోలను, నీటి నిర్వహణ విభాగం కింద ‘బఫెలో రివర్ ఆఫ్ న్యూయార్క్’ చిత్రాల్ని ఉపయోగించిందంటూ ఆధారాలతో సహా బయటపెట్టింది.

* అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం అని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్‌ ఉన్నాడని తెలిపారు.

* చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని.. ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. జనసేన, బీజేపీలో ఉన్నవాళ్లకు నిరాశే. కూటమిలో ఉన్నా చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారు అయ్యాయి. కానీ, 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారు. పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంది.

* విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేరళలోని వయనాడ్‌ (Wayanad)లో కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై సీపీఐ తన అభ్యర్థిని నిలబెట్టడాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు. ‘‘విపక్షాల పరిస్థితి ఎలా ఉందంటే.. అవి వయనాడ్‌ (Wayanad)లో పోట్లాడుకుంటున్నాయి. రాహుల్‌గాంధీ ఉత్తర్‌ ప్రదేశ్‌ (అమేఠీ)కి ఎందుకు వెళ్లడం లేదని లెఫ్ట్‌ పార్టీలు అడుగుతున్నాయి. మళ్లీ అవే పార్టీలు దిల్లీ వెళ్లి ఇండియా కూటమి సమావేశాల్లో పాల్గొంటాయి. ఇక్కడ విమర్శించిన నేతలు.. అక్కడ రాహుల్‌ను ఆలింగనం చేసుకుంటాయి’’ అని ఇరానీ ఎద్దేవా చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z