భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోందని పేర్కొంది. ఇందుకోసం కృత్రిమ మేధను (AI) అస్త్రంగా చేసుకోనుందంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తెలిపింది. ప్రజాస్వామ్యానికి జీవనాడులుగా భావించే ఎన్నికలకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ హెచ్చరిక చేసింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ ప్రకారం.. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూప్‌లు ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను వాడనుందని మైక్రోసాఫ్ట్ టీమ్ పేర్కొంది.
తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఉత్తర కొరియాతో కలిసి ఈ చర్యలకు పాల్పడనుందని ఆ సంస్థ థ్రెట్ అనాలసిస్ సెంటర్ జనరల్ మేనేజర్ క్లింట్ వాట్స్ బ్లాగ్ పోస్టు పెట్టారు. అలాగే ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చి, యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా నకిలీ ఖాతాలను ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు ఏఐ వినియోగాన్ని పెంచిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఏఐతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల గురించి చర్చించారు. ‘‘ఏఐ శక్తిమంతమైనదే. కానీ.. సరైన శిక్షణ లేకుండా దీన్ని అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా వినియోగించొచ్చు. డీప్‌ఫేక్‌తో నా గొంతును కూడా అనుకరించారు’’ అని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏఐ పెద్ద అవకాశమని.. అయితే సవాళ్లు ఉన్నాయని బిల్‌గేట్స్ హెచ్చరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z