Business

బెంగుళూర్ విద్యుత్ ట్రక్కుల కంపెనీకి భారీ ఆర్డర్-BusinessNews-Apr 07 2024

బెంగుళూర్ విద్యుత్ ట్రక్కుల కంపెనీకి భారీ ఆర్డర్-BusinessNews-Apr 07 2024

* బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్‌ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్‌ చెల్లింపుల కింద 44 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్‌ నివేదించింది.

* ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్‌ దక్కించుకుంది. జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్‌ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్‌, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్‌ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో ఎంత రేంజ్‌ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు. “మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది” అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్‌ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్‌లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు.

* ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లూయెన్సర్) రవీంద్ర బాలుకు సెబీ భారీ షాకిచ్చింది. స్టాక్‌ మార్కెట్‌ పేరుతో అక్రమంగా సంపాదించిన మొత్తం రూ.12 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందచ్చనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి పలువురు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇదే అంశంపై మార్కెట్‌ నియంత్రణ మండలి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్‌ రెగ్యులేటర్‌ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలు, వ్యక్తులపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (RBEIPL)వ్యవస్థాపకుడు రవీంద్ర బాలుకు సెబీ నోటీసులు అందించింది. రవీంద్రబాలు,తన భార్య శుభాంగి భారతితో కలిసి 2016 నుంచి భారతి షేర్‌ మార్కెట్‌ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, మార్కెట్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిపేలా మదుపర్లకు క్లాసులు ఇస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్‌సైట్‌ ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుంచి 1000 శాతం వరకు లాభాలు గడించవచ్చనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై సమాచారం అందుకున్న సెబీ రవీంద్ర బాలుకు సంబంధించిన అన్నీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పెట్టుబడి సలహా సేవలు, ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనొద్దంటూ సెబీ వారిని నిషేధించింది.

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అలాగే ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1కోటి జరిమానా విధించింది. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్ లిమిటెడ్, పంజాబ్ ఆధారిత భాటియా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్ ఆధారిత జీవన్‌జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలో నిర్వచించిన విధంగా ఈ కంపెనీలు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు. ఇక ‘రుణాలు, అడ్వాన్సులు – చట్టబద్ధమైన ఇతర పరిమితులు’పై ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు గానూ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు రూ.1కోటి పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుకు ఇదివరకే షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది.

* దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వాహన ఎగుమతుల్ని చేసిన కంపెనీ.. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త మోడళ్లను ఆవిష్కరించనునుంది. 2030నాటికి విదేశీ ఎగుమతులను 8లక్షల యూనిట్లకు చేర్చడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘దాదాపు మూడేళ్ల క్రితం సంవత్సరానికి చేసే వాహన ఎగుమతులు 1 లక్ష యూనిట్ల నుంచి 1.2లక్షల యూనిట్లుగా ఉండేవి. తర్వాత వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. 2022-23లో 2.59 లక్షల యూనిట్లుగా ఉన్న ఎగుమతులు 2023-24నాటికి 2.83 లక్షల యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో ఇతర కార్ల ఎగుమతులు 3శాతం తగ్గితే మారుతీ మాత్రం 9.3శాతం వృద్ధి చెందింది’’ అని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి పేర్కొన్నారు. భారత్‌ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన కార్లలో 42శాతం కార్లు మారుతీ సుజుకీవే అని అన్నారు. వచ్చే రెండేళ్లలో వాహన ఎగుమతులు 3 లక్షల యూనిట్లకు పెరగనున్నాయని.. 2030 నాటికి ఆ సంఖ్య 8లక్షల యూనిట్లకు చేరనుందన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z