అమెరికాలోని మిస్సోరి రాష్ట్ర సెయింట్ లూయిస్ నగరంలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మే 24 నుండి 28 వరకు అయిదు రోజుల పాటు శాస్త్రోక్తంగా, వీనులవిందుగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణ సన్నాహక సమావేశాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు, బ్రహ్మోత్సవాల కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సాక్షి విజయ్, ఉత్సవాల కార్యదర్శి పుట్టగుంట మురళీ తదితరులతో పాటు బోర్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, భక్తులు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొని బ్రహ్మోత్సవాల విజయవంతానికి తీసుకోవల్సిన చర్యలు, చేయవల్సిన ఏర్పాట్లపై సమీక్షించారని బ్రహ్మోత్సవాల మీడియా కమిటీ అధ్యక్షుడు సూరపనేని రాజా ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు https://www.hindutemplestlouis.org/services/ వెబ్సైట్ చూడవచ్చు.
ఈ సమావేశంలో వాలంటీర్లను కమిటీల్లోకి నియమించారు. వీరిని ఆయా కమిటీల్లోకి చేరవల్సిందిగా కోరారు. మాజీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి నాయుడు గంట మోగించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రారంభించారు. తంజావూరు నుండి ప్రత్యేకంగా తయారు చేసిన నంది, గజ, హనుమ, సూర్య, శేష వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు కోసం ఆలయం వెలుపల మాఢవీధులను నిర్మిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఊరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని సైతం తయారు చేస్తున్నామని వెల్లడించారు. దీనితో పాటు అర్చకస్వాముల నివాస గృహాలను కూడా నిర్మిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z