Business

ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం-BusinessNews-Apr 09 2024

ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం-BusinessNews-Apr 09 2024

* ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా క్యాబ్స్‌ (Ola cabs) కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల్లోని తన కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు కల్లా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఉన్న తన వ్యాపారాన్ని మూసివేయనుంది. ఇప్పటికే యూజర్లకు నోటిఫికేషన్లు పంపుతోంది. ఆయా దేశాల్లో ఎదురవుతున్న పోటీ, ఫ్లీట్‌ను పూర్తిగా విద్యుదీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా భారత్‌ మార్కెట్‌పైనే ఓలా దృష్టి పెట్టనుంది. తమ ప్రాధాన్యాలను సమీక్షించుకున్నాక యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని తమ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వ్యక్తిగత వాహన విభాగంతో పాటు క్యాబ్‌ సేవల విభాగంలోనూ విద్యుత్‌ వాహనాలదే భవిష్యత్‌ అని పేర్కొన్నారు. భారత్‌లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన పలికే అవకాశం ఉంది.

* పోగొట్టుకున్న మొబైల్‌ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్‌ దొంగిలిస్తే దానిపై ఆశలు వదలుకోవాల్సిన పరిస్థితి. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించేందుకు ‘ఫైండ్‌ మై డివైజ్‌’ (Find My Device) లాంటి సదుపాయం ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా, డివైజ్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నా గుర్తించడం కష్టం. ఇలాంటి సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ గూగుల్‌ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన Find My Device సదుపాయాన్ని అప్‌గ్రేడ్‌ చేసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో సరికొత్త జీవనకాల గరిష్ఠాలను సూచీలు నమోదు చేశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 75 వేలు మార్కును దాటగా.. నిఫ్టీ కూడా 22,750 పాయింట్ల ఎగువకు చేరింది. గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. త్వరలో క్యూ4 ఫలితాలు వెలువడనుండడం, అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో మదుపరులు అప్రమత్తతకు కారణం.

* రాయల్ బ్యాంక్‌ ఆఫ్ కెనడా (RBC) తన చీఫ్ ఫైనాన్షియల్‌ ఆఫీసర్(CFO)కు ఉద్వాసన పలికింది. కంపెనీ నియమావళిని ఉల్లంఘిస్తూ.. సంస్థ ఉద్యోగితో కొనసాగించిన సన్నిహిత సంబంధమే అందుకు కారణమైంది. ఆ తొలగింపు గురించి బ్యాంక్‌ ఇటీవల ఒక ప్రెస్‌ నోట్ విడుదల చేసింది. కెనడాలో అతిపెద్ద బ్యాంకుల్లో ఆర్‌బీసీ ఒకటి. నాదిన్‌ అహ్న్‌ (Nadine Ahn).. 1999లో ఆ సంస్థలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి.. 2021 నాటికి సీఎఫ్‌ఓ స్థాయికి చేరారు. అయితే, ఆమె రహస్యంగా సహోద్యోగితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో బ్యాంకు దర్యాప్తు ప్రారంభించగా.. ఆమె నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. ఆ సంబంధం కారణంగా సదరు ఉద్యోగికి ప్రమోషన్, పరిహారం పెంపు వంటి వాటితో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తించింది. నాయకత్వ హోదాలో ఉన్న అధికారులు పారదర్శక, గౌరవప్రదమైన రిలేషన్స్‌ కలిగి ఉండటమే కాకుండా.. జవాబుదారీతో వ్యవహరించాలని తన ప్రకటనలో సంస్థ పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z