Editorials

సుప్రీంలో మార్గదర్శికి చుక్కెదురు. 6నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశం.

సుప్రీంలో మార్గదర్శికి చుక్కెదురు. 6నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశం.

* ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్‌ రజని ఇచ్చిన తీర్పు రద్దు
* విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ
* హైకోర్టు తీర్పు ఏకపక్షం.. అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ
* అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం
* మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్లపై నిగ్గు తేలాలి.. సమగ్ర పరిశీలన చేయండి
* ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలి
* తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు – తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనా­న్షియర్స్, దాని యజమాని రామోజీరావుకు సుప్రీం­కోర్టు గట్టి షాక్‌నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్ప డినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియ ర్స్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్‌ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షి­యర్స్‌ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపు­చ్చింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన సొమ్ము­లను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపో­దని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షి­యర్స్‌ ద్వారా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలా­ల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్‌ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి ఆర్నెళ్లలో ముగించాలని హైకోర్టుకు సూచించింది. స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్‌ నోటీసు ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకోని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్‌ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది.

ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్‌ రజని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌ కుమార్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కేవీ విశ్వనాధన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి, రామోజీరావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు సీనియర్‌ ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ… ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒక రోజు ముందు అంటే 31.12.2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే మూడేళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్‌ పిటిషన్‌కు, ఈ తాజా క్వాష్‌ పిటిషన్‌కు ఎలాంటి తేడా లేదన్నారు. కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్‌ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ జోక్యం చేసుకొంటూ.. సేకరించిన రూ.2,600 కోట్లను 1,247 మంది డిపాజిటర్లకు 30.6.2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ, ప్రాసిక్యూషన్‌ స్టేట్‌ తెలంగాణ గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రూ.5.31 కోట్లు అన్‌ క్లెయిమ్డ్‌ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు.

మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఫిర్యాదులు లేవని, ఇప్పుడు వస్తాయని సింఘ్వి పేర్కొనగా.. సొమ్ములు మీవద్దే ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకొస్తారని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు పంపడానికి ఏమీ లేదని, ఇక్కడే ఆదేశాలు ఇవ్వాలని సింఘ్వీ గట్టిగా కోరారు. ఈ సమయంలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ కొత్త పరిణామాలు ఏమీ లేకుండా ఒకసారి హైకోర్టు తోసిపుచ్చిన అంశాలతోనే క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు ముందు వాదనలు జరిగిన సమయంలో తెలంగాణ నుంచి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఒక్కరే హాజరయ్యారన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడగా ఆ సమయంలో కోర్టు మాత్రం ఒక్కటే ఉందన్నారు. ఉల్లంఘనలు బయటకు రాగానే ఆ సమయంలో కొన్నాళ్లు డిపాజిట్లు నిలుపుదల చేసి మళ్లీ రూ.2,600 కోట్లు వసూలు చేశారని నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని ఇదంతా ప్రస్తుతం అనవసరమన్నారు.

తొలుత ముందుకు రాని ఏపీ ప్రభుత్వం సడన్‌గా ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోగలమని, అయితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపుతామని, అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుందని, విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రూ.2,600 కోట్లు తిరిగి చెల్లించేశామని సింఘ్వీ మరోసారి ప్రస్తావించడంతో… ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు నివేదించాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ వాదనే విన్నారని, అయితే హైకోర్టు ఏ ప్రక్రియ అనుసరించిందనేది పరిశీలించాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. పబ్లిక్‌ నోటీసు కన్నా మిన్నగానే తిరిగి చెల్లింపులు చేశామని, భవిష్యత్‌ మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆర్‌బీఐ స్టేటస్‌ రిపోర్టు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేయగా.. దాన్నేం మార్చలేం కదా? ఇప్పుడు అది అప్రస్తుతం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. అదృష్టమో, దురదృష్టమో రామోజీరావు ఈనాడు పబ్లిషర్‌ కావడంతో చాలా విషయాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనాడు చాలా పాత పేపరని, ఈటీవీ కూడా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఈనాడు తమపై వార్తలు రాస్తోందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వచ్చిందని ఆరోపించారు. ఇదంతా హైకోర్టులో చెప్పుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.5 కోట్లు మాత్రమే ఉన్నందున ఉండవల్లి పిటిషన్‌ను కొట్టివేసి, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ మరోసారి కోరగా హైకోర్టు ఎదుటే చెప్పుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z