* కాంటాక్టుల్లో లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించేందుకు ఉపయోగించే ట్రూకాలర్ (Truecaller).. మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. వాట్సప్, టెలిగ్రామ్ తరహాలో ‘ట్రూ కాలర్ వెబ్’ను తీసుకొచ్చింది. దీనిద్వారా మీ మొబైల్‌ను డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్ చేసి గుర్తుతెలియని నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ట్రూ కాలర్ వెబ్ (Truecaller web) సాయంతో ఆండ్రాయిడ్ యూజర్లు తమ డివైజ్‌ను ల్యాప్‌టాప్/ పీసీకి కనెక్ట్ చేయొచ్చు. ఫోన్‌లో వచ్చే ఎస్సెమ్మెస్ ఇన్‌బాక్స్‌ను రీడ్ చేయొచ్చు. కావాలంటే అక్కడి నుంచే రిప్లై కూడా ఇవ్వొచ్చు. ఏదైనా కాల్/ మెసేజ్ వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేకుండానే ఇన్‌కమింగ్ కాల్/మెసేజ్ అలర్ట్‌లను డెస్క్‌టాప్‌లో పొందొచ్చు. వెబ్‌కు కనెక్ట్ చేయగానే మొబైల్‌లో ఇప్పటివరకు ఉన్న సందేశాలను ట్రూకాలర్ సెకన్లలో చూపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్టు వివరాలు తెలుసుకోవడంతో పాటు కంప్యూటర్ కీబోర్డు ద్వారా వేగంగా సందేశాలను పంపించడానికి వీలవుతుందని ట్రూకాలర్ పేర్కొంది. మొబైల్ తరహాలోనే డెస్క్‌టాప్‌లోనూ సందేశాలు ఎన్‌క్ట్రిప్ట్ చేసి ఉంచుతామని పేర్కొంది.
* ఇండిగో (Indigo) పేరిట సేవలందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సరికొత్త మైలురాయిని అందుకుంది. సంవత్సరం క్రితం టాప్-10 ఎయిర్‌లైన్స్ జాబితాలో కూడా లేని సంస్థ.. ఏడాది తిరగకముందే ఆ జాబితాలో టాప్-3లో చోటు దక్కించుకుంది. మార్కెట్ వాటా పరంగా ఇప్పటికే దేశీయ అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా కొనసాగుతున్న ఇండిగో.. మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్ మార్కెట్ విలువ పరంగా 30.4 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ర్యానైర్ హోల్డింగ్స్ సంస్థ 26.5 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విలువ 17.3 బిలియన్ డాలర్లు కాగా.. 17.6 బిలియన్ డాలర్లతో ఇండిగో మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇండిగో షేరు వరుసగా నాలుగో రోజూ 4.73 శాతం లాభపడి 3,806.00 వద్ద ముగిసింది. ఈ క్రమంలో మార్కెట్ విలువ పరంగా మూడో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఇండిగో అవతరించింది. గత ఒక్క నెలలోనే ఇండిగో షేరు విలువ దాదాపు 22 శాతం మేర పెరిగింది. గత ఏడాదిలో దాదాపు రెట్టింపైంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో రిలయన్స్, ఐటీసీ, ఎయిర్‌టెల్ వంటి షేర్లలో కొనుగోళ్లు.. సూచీలకు కలిసొచ్చింది. గత ట్రేడింగ్ సెషన్‌లో 75వేల మార్కును దాటిన సెన్సెక్స్.. ఇవాళ తొలిసారి 75 వేల ఎగువన ముగిసింది. నిఫ్టీ సైతం 22,700 పైన స్థిరపడింది. సెన్సెక్స్ ఉదయం 74,953.96 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 74,807.55 – 75,105.14 మధ్య ట్రేడయిన సూచీ.. చివరికి 354.45 పాయింట్ల లాభంతో 75,038.15 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల లాభంతో 22,753.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్‌లో ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ చమురు ధర 89.70 డాలర్లు, బంగారం ఔన్సు ధర 2,365.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
* జీప్ ఇండియా ఈరోజు కంపాస్ మోడల్‌లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్‌ను (Jeep Compass Night Eagle limited edition) విడుదల చేసింది. దీని ధర రూ.20.5 లక్షలు (ఎక్స్‌షోరూం). ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో లేదా దగ్గర్లో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. ఈ నైట్ ఈగిల్ ఎడిషన్‌లో (Jeep Compass Night Eagle limited edition) బ్లాక్ డ్యుయల్-టోన్ రూఫ్ ప్రామాణికంగా వస్తోంది. ఎక్స్‌టీరియర్ కోసం నలుపు, తెలుపు, ఎరుపు రంగులను కంపెనీ ఆప్షన్‌గా ఇస్తోంది. గ్రిల్, గ్రిల్ రింగులు, డేలైట్ ఓపెనింగ్‌లు, రూఫ్ రెయిల్స్‌కు గ్లాస్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. డ్యాష్‌క్యామ్, వెనకభాగంలో ఎంటర్‌టైన్‌మెంట్ యూనిట్, ప్రీమియం కార్పెట్ మ్యాట్స్, అండర్‌బాడీ లైటింగ్, యాంబియెంట్ లైట్లు, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అనలాగ్ డయల్స్‌తో కూడిన ఏడు అంగుళాల డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్, స్టార్ట్/స్టాప్ పుష్‌బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా వస్తున్నాయి. కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్ (Jeep Compass Night Eagle limited edition) సింగిల్ ఇంజిన్, టూ గేర్ బాక్స్ ఆప్షన్లతో వస్తోంది. 2.0 లీటర్, 4-సిలిండర్, టర్బోఛార్జ్ డీజిల్ ఇంజిన్‌ను పొందుపర్చారు. ఇది 350 ఎన్‌ఎం టార్క్, 168 హెచ్‌పీ పవర్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను ఇచ్చారు.
* భారత్‌లోకి టెస్లా (Tesla) ప్రవేశంపై గతకొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. దేశంలో తయారీ కేంద్రం ఏర్పాటు నిమిత్తం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో (RIL) టెస్లా చర్చలు జరపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ హిందూ బిజినెస్‌లైన్ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనంలోని వివరాల ప్రకారం.. దాదాపు నెలరోజులుగా రెండు కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అయితే, వాహన తయారీలోకి రిలయన్స్ (RIL) ప్రవేశిస్తున్నట్లుగా ఈ పరిణామాన్ని భావించొద్దని సదరు వర్గాలు వెల్లడించాయి. విద్యుత్తు వాహన తయారీ, విక్రయాలు సహా ఇతర అనుబంధ సేవలను మాత్రమే కంపెనీ సమకూర్చనున్నట్లు తెలిపాయి.
* పతంజలి ఆయుర్వేద (patanjali case) సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు (supreme court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. వారివురు సమర్పించిన ప్రమాణ పత్రాలను జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో తాము ఉదారంగా వ్యవరించలేమంటూ స్పష్టంచేసింది. పతంజలి ధిక్కరణ కేసులో బుధవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z