Sports

తప్పుడు డోపింగ్ ప్రయత్నాలు

తప్పుడు డోపింగ్ ప్రయత్నాలు

తనను డోపింగ్‌లో పట్టుబడేలా చేసి ఒలింపిక్స్‌కు అర్హత సాధించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తులపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ‘‘నేను పారిస్‌ ఒలింపిక్స్‌ వెళ్లకుండా చేసేందుకు బ్రిజ్‌భూషణ్‌.. అతడి ప్రతినిధి సంజయ్‌సింగ్‌ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత భారత జట్టులో ఉన్న కోచ్‌లంతా బ్రిజ్‌భూషణ్‌కు అనుకూలంగా ఉండేవాళ్లే. మ్యాచ్‌ల సందర్భంగా నేను తాగే నీళ్లలో ఏదైనా నిషేధిత ఉత్ప్రేరకాన్ని కలిపి డోపింగ్‌లో పట్టుబడేలా చేసే అవకాశాలను కొట్టి పారేయలేం’’ అని వినేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. కుట్రలో భాగంగానే ఏప్రిల్‌ 19న ఆరంభమయ్యే ఆసియా ఒలింపిక్‌ అర్హత టోర్నీకి తన వ్యక్తిగత కోచ్‌, ఫిజియోలకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. ‘‘ఆసియా ఒలింపిక్‌ అర్హత టోర్నీకి నా కోచ్‌, ఫిజియోకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సిందిగా గత నెల రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. గుర్తింపు కార్డులు లేకుండా వాళ్లు నాతో ఉండలేరు. కానీ కార్డులు ఇవ్వలేదు. దానికి సరైన కారణాన్ని వెల్లడించలేదు. ఇంకా ఏన్నాళ్లు ఇలా మానసికంగా వేధిస్తారు’’ అని వినేశ్‌ వాపోయింది. అయితే వినేశ్‌ ఆరోపణలను రెజ్లింగ్‌ సమాఖ్య వర్గాలు ఖండించాయి. ‘‘కోచ్‌, ఫిజియో గుర్తింపు కార్డుల గురించి వినేశ్‌ మార్చి 18న అడ్‌హాక్‌ కమిటీ, టాప్స్‌ సీఈవోకు ఈమెయిల్‌ పంపింది. అప్పటికే అదనపు సిబ్బంది వివరాల నమోదు పూర్తయిపోయింది. వినేశ్‌ కోచ్‌, ఫిజియో పేర్లను ఈ జాబితాలో చేర్చాల్సిందిగా సాయ్‌ నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. సాధారణంగా 10 మంది రెజ్లర్లకు ముగ్గురు చొప్పున కోచ్‌లను పంపుతాం. అలాంటిది ఆసియా రెజ్లింగ్‌ టోర్నీలో పాల్గొనే అయిదుగురు మహిళా రెజ్లర్లకు ఇప్పటికే ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. మళ్లీ ఫొగాట్‌కు అదనపు కోచ్‌ ఎందుకు?’’ అని రెజ్లింగ్‌ సమాఖ్య ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z