Business

భారీ నష్టాల్లో భారత మార్కెట్లు-BusinessNews-Apr 15 2024

భారీ నష్టాల్లో భారత మార్కెట్లు-BusinessNews-Apr 15 2024

* సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్‌ అంటే బాధ్యతలతో పాటు వేతనాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలూ పెరుగుతాయి. కానీ, అవేవీ లేకుండా కేవలం బాధ్యతలను మాత్రమే పెంచితే దాన్ని డ్రై ప్రమోషన్‌ (Dry Promotion) అంటున్నారు. కంపెనీలో డెసిగ్నేషన్‌ కూడా మారుతుంది. పనిభారం పెరుగుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. కానీ, వేతనం, ప్రోత్సాహకాలు మాత్రం మారవు.

* ఎలాన్‌ మస్క్‌కు (Elon musk) చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఉద్యోగ కోతలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 14వేల మందిపై ఈ ప్రభావం పడనుంది. ఈమేరకు ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ లేఖ రాసినట్లు ఎలక్ట్రెక్ అనే వెబ్‌సైట్‌ తన కథనంలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది డిసెంబర్‌ నాటికి టెస్లాలో 1.40 లక్షల మంది పని చేస్తున్నారు. ఇందులో పది శాతం శాతం అంటే దాదాపు 14వేల మందిని టెస్లా తొలగించనుంది. కొన్ని రోల్స్‌లో డూప్లికేషన్‌ కారణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు మస్క్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం కంపెనీకి సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో కొనసాగుతున్నవారు సవాళ్లకు సిద్ధమవ్వాలని సూచించారు. ఏయే విభాగాల వారిని తొలగిస్తున్నదీ ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులకు సిస్టమ్‌ యాక్సెస్‌ నిలిపివేసినట్లు సమాచారం.

* అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్స్‌ తమిళనాడులోని తూత్తుకుడిలో మై హోం గ్రూప్‌కు చెందిన 1.50 MTPA సిమెంట్‌ గ్రైండిండ్‌ యూనిట్‌ను రూ.413.75 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు అంబుజా సిమెంట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్‌ పోర్ట్‌ సమీపంలో 61 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఒప్పందంతో దక్షిణాది మార్కెట్లలో అంబుజా సిమెంట్స్‌ తన ఉనికిని మరింత మెరుగుపర్చుకోనుంది. భారతదేశంలోని ప్రముఖ సిమెంట్‌ కంపెనీల్లో ఒకటైన అంబుజా..దాని అనుబంధ సంస్థలైన ఏసీసీ లిమిటెడ్‌, సంఘీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌తో కలిపి దేశవ్యాప్తంగా 18 ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ ఉత్పత్తి ప్లాంట్లు, 19 సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్లు కలిగి ఉంది. దీంతో అదానీ గ్రూప్‌ సిమెంట్‌ సామర్థ్యం 78.90 MTPAకు చేరింది.

* విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా (Ola electric) తన ఎంట్రీ లెవెల్‌ స్కూటర్లయిన ఎస్‌1 ఎక్స్‌ (S1 X) సిరీస్‌ ధరలను తగ్గించింది. వీటి ధరలు ఇకపై రూ.69,999 (ఎక్స్‌ షోరూమ్‌) నుంచే ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కొత్త ధరలను కంపెనీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తొలిసారి విద్యుత్‌ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం తక్కువ ధరలకే స్కూటర్లను అందుబాటులో ఉంచినట్లు ఓలా తెలిపింది. వచ్చే వారం నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని పేర్కొంది. కొత్త ఎస్‌1 ఎక్స్‌ మూడు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 2 kWh వేరియంట్‌ ధర రూ.69,999 (ప్రారంభ ఆఫర్‌), 3 kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.84,999, 4 kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూటర్లు 8 ఏళ్లు/80వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తున్నాయని కంపెనీ తెలిపింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఎస్‌1 ఎక్స్‌ స్కూటర్లు ఫిజికల్‌ కీ ఇస్తున్నారు. ఇందులో 2 kWh స్కూటర్‌ ఐడీసీ రేంజ్‌ 95 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 3 kWh స్కూటర్‌ 143 కిలోమీటర్లు, 4 kWh 190 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు సూచీలను పడేశాయి. ఇరాన్‌ జరిపిన దాడులకు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు తెగబడొచ్చన్న అంచనాలు మదుపరులను కలవరపెట్టాయి. దీంతో మన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 800కు పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22,300 దిగువకు చేరింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.394 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 73,315.16 పాయింట్ల వద్ద దాదాపు 900 పాయింట్ల భారీ నష్టంతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,905 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకినప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. చివరికి 845.12 పాయింట్ల నష్టంతో 73,399.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 246.90 పాయింట్ల నష్టంతో 22,272.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.45గా ఉంది. సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రధానంగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో 27, నిఫ్టీ-50లో 44 స్టాక్స్‌ నష్టపోవడం గమనార్హం.

* బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. బంగారం ధరలు సమీప భవిష్యత్తులో రూ.లక్షకు చేరుకోనుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకుగల కారణాలను మార్కెట్‌ నిపుణులు, అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో సెంట్రల్‌ బ్యాంకులు ఫారెక్స్‌ నిలువలు అమ్మేశాయి. దాంతో గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారాన్ని అమ్మి డాలర్లతో దేశాలకు కావాల్సిన ముడిచమురు వంటి కీలక అవసరాలను తీర్చుకున్నాయి. దాంతో బంగారం నిలువలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సెంట్రల్‌ బ్యాంకులు తిరిగి గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం నిల్వలను కొనడం ప్రారంభించాయి. దాంతో గోల్డ్‌ ధర పెరగడానికి ఇది ఒక కారణంగా ఉంది. ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అనిశ్చితి కూడా బంగారం పెరిగేందుకు ఒక కారణం. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు బంగారం సురక్షిత సాధనంగా ఆకర్షిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ తన దాడులను లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపైకి విస్తరించింది. ఇదీ బంగారం ధరల పెరుగుదలకు కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు.

* ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్‌ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. అయితే, ఇప్పుడు సంస్థకు మరో కొత్త కష్టం వచ్చి పడింది. అంతర్గతంగా పరిస్థితులు దిగజారడంతో ఉన్నత స్థాయి నాయకత్వం కంపెనీని వీడుతోంది. గతేడాది బైజూ ఇండియా సీఈవో మృణాల్‌ మోహిత్‌ సంస్థను వీడిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో అర్జున్‌ మోహన్‌ (Arjun Mohan) బైజూస్‌ ఇండియా సీఈవోగా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయన కూడా తన పదవికి రాజీనామా చేసేశారు (CEO Quits). సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే సంస్థను వీడాడు. సోమవారం ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. దీంతో స్టార్టప్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ (Byju Raveendran) సంస్థ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z