Politics

జగన్‌పై రాయి కేసు…వడ్డెరకాలనీ వాసులు ఆందోళన-NewsRoundup-Apr 16 2024

జగన్‌పై రాయి కేసు…వడ్డెరకాలనీ వాసులు ఆందోళన-NewsRoundup-Apr 16 2024

* వివేకా హత్యకేసులో దస్తగిరి అప్రూవర్‌ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని సునీత అన్నారు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి.. పోలీసులతోగానీ, సీబీఐతోగానీ ఈ విషయంపై ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా? దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చేస్తారా? అని మండిపడ్డారు. రాజకీయాలే కాకుండా ప్రతి ఒక్కరికీ జీవితం కూడా ఉంటుందని గుర్తించాలని హితవు పలికారు. ‘‘తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నామని అవినాష్‌ అంటున్నారు. వివేకా కుటుంబం గురించి ఏమైనా ఆలోచించారా?వివేకా హత్యకేసు దర్యాప్తు గురించి పోలీసులతో, సీబీఐతో ఎప్పుడైనా మాట్లాడారా? గూగుల్‌ టేకౌట్‌ ఫ్యాబ్రికేటెడ్‌ అని అంటున్నారు. గూగుల్‌ టేకౌట్‌ రిపోర్టును సీబీఐ, సర్వే ఆఫ్‌ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్‌ తయారు చేశాయి. అవినాష్‌పై సర్వే ఆఫ్‌ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్‌కు కూడా కోపం ఉంటుందా? మీ ఫోన్‌ దర్యాప్తు అధికారికి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.

* సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తమవారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా డాబాకొట్ల సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రూ.200 ఇస్తామని చెప్పి జగన్‌ రోడ్‌షోకు తీసుకెళ్లారని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎక్కడున్నారో కూడా చెప్పడం లేదని ఆవేదనకు గురయ్యారు. సీఎంపై రాయి దాడి జరిగిన సమయంలో తమ వారు ఆ ప్రాంతంలో లేకపోయినా ఐదుగురు పిల్లలను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విడుదల చేయకపోతే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

* ఓ సంస్థ చేసిన చిన్న పొరబాటు కారణంగా ఒక జంటకు అనుకోకుండా విడాకులు మంజూరైన ఘటన ఇది. ఆన్‌లైన్‌ వేదికగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు.. చర్చల దశలో ఉండగానే వారికి ఊహించని పరిణామం ఎదురైంది. కోర్టుకు సమర్పించే పత్రాల్లో వేరే జంటకు బదులు వీరి పేరు చేర్చడమే అందుకు కారణం. న్యాయమూర్తి తీర్పుతో నిమిషాల వ్యవధిలోనే వీరికి విడాకులు మంజూరుకావడం గమనార్హం. యూకేకి చెందిన విలియమ్స్‌ అనే మహిళకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. గతేడాది నుంచి దంపతులు విడివిడిగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో వార్దాగ్స్‌ అనే ఓ ప్రముఖ సంస్థను సదరు మహిళ ఆశ్రయించారు. దంపతుల మధ్య ఆర్థిక అంశాలు సంప్రదింపుల దశలో ఉండగానే.. మరో క్లయింట్‌ తుది విడాకుల కోసం రూపొందించిన పత్రాల్లో పొరబాటున విలియమ్స్‌ దంపతుల పేరును చేర్చారు. ఈ పత్రాలను అలాగే కోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కేవలం 21 నిమిషాల వ్యవధిలోనే ఆ పత్రాల్లో ఉన్న జంటకు విడాకులు మంజూరుచేసింది. ఈ తప్పిదాన్ని కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ గుర్తించింది. తాము అందజేసిన పత్రాల్లో పొరపాటు జరిగిందని, వీటిని రద్దు చేయాలని కోరుతూ విలియమ్స్‌ తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. కానీ, వారి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. వార్దాగ్స్‌ వ్యవస్థాపకులు అయేషా వర్దాగ్ స్పందిస్తూ..‘‘ఇది తప్పుడు నిర్ణయం. కొందరు చేసిన తప్పిదాల ఆధారంగా విడాకులు ఇవ్వకూడదు. విడాకులు కోరుకునే వ్యక్తులు ఉద్దేశం కచ్చితంగా ఉండాలి. ఇది న్యాయవ్యవస్థ నిర్ణయాన్ని బలపరుస్తుంది. సాంకేతిక తప్పు జరిగిందని గుర్తించి, దాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినప్పుడు.. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు.

* కాంగ్రెస్‌ పార్టీ భాజపా గెలవాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుందని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధినేత గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ మంగళవారం ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాము భాజపాను గెలిపించాలనుకుంటున్నామని అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆజాద్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఆజాద్‌ రాజ్యసభ నుంచి పదవీవిరమణ పొందిన సమయంలో ఆయనకు మోదీ భావోద్వేగ వీడ్కోలు పలికిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘రాజ్యసభ నుంచి మీరు రిటైర్డ్‌ అయినప్పుడు ఎవరు డ్రామా చేశారు’ అని ప్రశ్నించారు. ‘భాజపా మద్దతుతో సౌత్ అవెన్యూ బంగ్లాను ఎవరు ఆక్రమిస్తున్నారు?’ అని అడిగారు. ‘జమ్మూకశ్మీర్‌లో భాజపా తరపున ఉన్నది ఎవరు’ అని నిలదీశారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్‌ను నిరాకరించడాన్ని కాంగ్రెస్‌ నేత ప్రస్తావించారు. ‘పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి పద్మభూషణ్‌ను నిరాకరించినప్పటికీ, భాజపా నుంచి పద్మ అవార్డును ఎవరు స్వీకరించారు?’ అని పద్మభూషణ్ అవార్డును ఆజాద్ అంగీకరించడాన్ని జైరాం రమేష్ ప్రశ్నించారు. వీటన్నిటికీ సమాధానాలు తెలియజేయాలని ఆజాద్‌ను కోరారు.

* అధికార యంత్రాంగాన్ని ఏపీలోని వైకాపా ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్డీయే కూటమి నేతలు ఆరోపించారు. ఈమేరకు కనక మేడల రవీంద్రకుమార్‌ (తెదేపా) నాదెండ్ల మనోహర్‌ (జనసేన), జీవీఎల్‌ నరసింహారావు (భాజపా) తదితరులు దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ…‘‘ ప్రతిపక్ష నేతలను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరాం. సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌ల్లో వీడియో రికార్డింగ్‌ చేపట్టాలి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కొందరు అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ తదితరులను బదిలీ చేయాలని కోరాం. వివేక్‌ యాదవ్‌, ధర్మారెడ్డి, రఘురామిరెడ్డిపై కూడా ఫిర్యాదు చేశాం’’ అని తెలిపారు.

* సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు యువకులను సిట్‌ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సీసీఎస్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని విజయవాడలోని అజిత్‌ సింగ్‌ నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా భావిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

* బోయపాటి-బాలకృష్ణ (Balakrishna) సినిమా వస్తుందంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. దీంతో వీళ్లిద్దరి తర్వాత ప్రాజెక్ట్‌పై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై బోయపాటి శ్రీను మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది. ఇవి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని తెలిపారు. ఇప్పటికే దీని స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

* ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం (EVM) ఓట్లతో వీవీప్యాట్‌ (VVPAT) స్లిప్‌లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారణ జరిపింది. ఈసందర్భంగా రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటీషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్‌ (Voting) ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని సూచించింది. ఈ పిటిషన్‌పై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. ‘‘జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్‌ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిని వినియోగించాలి. లేదా వీవీప్యాట్‌ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. లేదా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్‌ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి’’ అని వాదించారు.

* నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా గత ఏడాది ఆగస్టులో 64 ఏళ్ల రామ్‌ ఇస్రానీని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. దానిని సవాలు చేస్తూ అతడు కోర్టును ఆశ్రయించారు. తాను విచారణకు సహకరించానని, పిలిచినప్పుడల్లా హాజరైనా సరే అరెస్టు చేశారని, అది చట్ట విరుద్ధమంటూ తన పిటిషన్‌లో ఆరోపించారు. గత ఆగస్టు 7న అధికారులు తనను రాత్రి అంతా విచారించి మర్నాడు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. ఇస్రానీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే అతడిని రాత్రి అంతా ప్రశ్నించడాన్ని మాత్రం తప్పుపట్టింది. నిందితుడి అంగీకారంతోనే తెల్లవారుజాము మూడు గంటల వరకు విచారించినట్లు ఈడీ తరపు న్యాయవాది వాదించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

* పశ్చిమాసియాలో ని ఇజ్రాయెల్‌–ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు, దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లిన తెలంగాణవాసులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇజ్రాయెల్‌లో పనిచేస్తు న్న నిజామాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్లు చేసి తమ క్షేమసమాచారాన్ని అందించారు. అయినప్పటికీ వరుసగా చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడున్న వారిలో ఆందోళన నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఆదివారం ఇరాన్‌ 185 డ్రోన్లు, 110 బాలిస్టిక్‌ మిస్సైల్స్‌, 36 క్రూయీజ్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. మధ్యధరా సముద్రంలోని యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌, జోర్డాన్‌ దళాలు అడ్డుకుంటున్నాయి. అదేవిధంగా ఐరన్‌ డోమ్‌, ఐరన్‌ బీమ్‌(లేజర్‌ టెక్నాలజీ)లతో ఆయా మిసైల్స్‌ను ఇజ్రాయెల్‌ తమ భూ భాగంలో పడకుండా అడ్డుకుంటోంది. దాదాపు 95 శాతం మిసైల్స్‌ను ఇజ్రాయెల్‌ నిర్వీర్యం చేసింది. అయితే శనివారం 17 మంది భారతీయులు ఉన్న సౌకను ఇరాన్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

* మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో సందేశం వినిపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ మంగళవారం మీడియా సమావేశంలో సీఎం సందేశాన్ని వినిపించారు. ‘నా పేరు అరవింద్‌ కేజ్రీవాల్‌. నేను ఉగ్రవాదిని కాను’ అని సందేశంలో ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌ అని.. దాని ద్వారా బీజేపీకి లంచాలు వచ్చాయని విమర్శించారు. అయిని ప్రధాని ఎలక్టోరల్‌ బాండ్‌ స్కీమ్‌కు అండగా ఉంటున్నారని.. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారన్నారు.

* కేసీఆర్‌ సర్కారు హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను(Irrigation projects) పూర్తి చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలకేంద్రంలో పార్లమెంట్‌ ఎన్నికల(Parliament Elections) నేపథ్యంలో సోమవారం బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

* కుటుంబ నియంత్ర‌ణ పాటించిన రాష్ట్రాల్లో పార్ల‌మెంట్ సీట్లు పెంచ‌ర‌ట‌.. కానీ కుటుంబ నియంత్ర‌ణ పాటించ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు పిల్ల‌ల‌ను క‌న్న రాష్ట్రాల్లో పార్ల‌మెంట్ సీట్లు పెంచుతార‌ట అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. 2026లో దేశం మొత్తం కొత్త‌గా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రగ‌బోతోంది. శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతాయి. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు కూడా లెక్క ప్ర‌కారం పెర‌గాలి. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచ‌న‌ను కొంత‌మంది విలేక‌ర్లు పేప‌ర్ల‌లో రాశారు. 1970, 1980లో భార‌త‌దేశ జ‌నాభా విప‌రీతంగా పెరుగుతుంద‌ని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాల‌ని నాటి కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింది. మేమిద్ద‌రం.. మాకు ఇద్ద‌రు.. ఈ స్లోగ‌న్‌తో కుటుంబ నియంత్ర‌ణ చేయ‌మ‌ని ఆదేశించారు.

* సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ వైఎస్‌ జగన్‌ది పేదలపక్షమని.. తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పపశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లపై నిప్పులు చెరిగారు. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. వీళ్లందరూ నాపై బాణాలు ఎక్కుపెట్టారు. వారి బాణాలు తగిలేవి.. జగన్‌కా? సంక్షేమ పథకాలకా? అని సభకు హాజరైన అవేష జనవాహినిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z