NRI-NRT

UAE వరద బాధితుల కొరకు హెల్ప్‌లైన్ ప్రారంభం-NewsRoundup-Apr 18 2024

UAE వరద బాధితుల కొరకు హెల్ప్‌లైన్ ప్రారంభం-NewsRoundup-Apr 18 2024

* పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE)లోని దుబాయ్‌ భారీ వర్షాల (Heavy Rains)తో అతలాకుతలం అయ్యింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి కురవడంతో అక్కడి జనజీవనం స్తంభించింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ (Dubai) ఎయిర్‌పోర్టులో నీరు నిలిచిపోవడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నగరంలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం అక్కడి దౌత్య కార్యాలయం (Indian Consulate) హెల్ప్‌లైన్‌ నంబర్లు విడుదల చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌, ఉత్తర ఎమిరేట్స్‌ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులు సాయం కోసం +971501205172, +971569950590, +971507347676, +971585754213 నంబర్లకు ఫోన్‌ చేయాలని వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు యూఏఈ అధికారులతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ప్రయాణికులు, భారత్‌లోని వారి కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు సదుపాయాలు కల్పించినట్లు పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ హెల్ప్‌లైన్‌ నంబర్లు కొనసాగుతాయని తెలిపింది.

* ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను 2023 నుంచి అమలుచేస్తున్నారు. ఈ నిబంధన వల్ల ప్రతీ జట్టు మ్యాచ్‌ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఆడించుకోవచ్చు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్‌ స్థానంలో స్పిన్నర్‌ను ఇంపాక్ట్‌ ఆటగాడిగా తీసుకోవచ్చు. ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్‌ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్‌ స్థానంలో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్‌ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్‌ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. ఈ నిబంధన వల్ల చాలా జట్లు ప్రయోజనం పొందుతున్నాయి కూడా. అయితే, ఈ రూల్‌పై ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల శివమ్‌ దూబె, వాషింగ్టన్ సుందర్‌ వంటి ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని, ఇది భారత క్రికెట్‌కు అంత మంచిది కాదని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

* సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, 1017 మందిని విధుల నుంచి తప్పించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.180 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులను సీజ్‌ చేశామని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటనలో ఒకరిని అరెస్టు చేశారని మీనా తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు ప్రత్యేక పరిశీలకుడు త్వరలోనే ఈసీకి నివేదిస్తారని, తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు. పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు.

* తెదేపా- జనసేన- భాజపా కూటమి తరఫున ప్రముఖ నటుడు హైపర్ ఆది (Hyper Aadi) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గం కసింకోటలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు మద్దతుగా గాజు గ్లాస్‌ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. ఎంపీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌కు.. కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. దుకాణాలు, పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

* హీరో నిఖిల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తన కుమారుడి పేరును వెల్లడించారు. తండ్రి అయిన తర్వాత తనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నా.. ఇంట్లో వాళ్లతో సమయం గడపడానికే ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తన కుమారుడి కోసం కొన్ని అలవాట్లను మార్చుకున్నట్లు తెలిపారు. ‘మా అబ్బాయి పేరు ధీర సిద్ధార్థ్‌. వాడు పుట్టిన దగ్గర నుంచి తన కోసమే సమయాన్ని కేటాయిస్తున్నాను. ఎంతో త్వరగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. పిల్లాడి బాధ్యతను పంచుకోవడానికి నావంతు ప్రయత్నం చేస్తున్నాను. వారానికి ఒక్కసారైనా పార్టీకి వెళ్లడం నాకు అలవాటు. ఇప్పుడు పూర్తిగా వెళ్లడం మానేశాను. తల్లిదండ్రులుగా మారిన తర్వాత కొన్ని అలవాట్లను వదులుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నిటికి దూరం కావాలి. ఇప్పుడు నేను అన్నిరకాలుగా ఆనందంగా ఉన్నాను. నా జీవితం ఇలా ఉంటుందని 15 ఏళ్ల క్రితమే ఎవరైనా చెబితే ఇన్ని సంవత్సరాలు ఇంత ఒత్తిడికి గురయ్యేవాడిని కాదు’ అని చెప్పారు.

* మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. న్యాయం కోసం తాము పోరాడుతున్నామని.. షర్మిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

* మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi excise scam case)లో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. అయితే, ఆరోగ్య కారణాలు చూపించి ఈ కేసులో బెయిల్‌ పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తాజాగా ఆరోపించింది. డయాబెటీస్‌ ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఆయన రోజూ తీసుకుంటున్నారని పేర్కొంది. చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్‌ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్‌ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. దిల్లీ సీఎం అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ.. ఆయనపై కీలక ఆరోపణలు చేసింది. ‘‘ఇంటి భోజనానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఉంది. దీంతో ఆయన తనకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నారు. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారు. ఇలాంటివి తింటే షుగర్‌లెవల్స్‌ పెరుగుతాయని ఆయనకు తెలుసు. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు’’ అని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

* వైఎస్ఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన వైకాపా.. ఆ హామీని మరిచిందని విమర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామన్నారని.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. లెదర్ పార్కు హామీని సైతం మరిచారని ఆరోపించారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు.

* భద్రతా మండలి (UNSC) సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ బుధవారం స్పష్టం చేసింది. యూఎన్‌ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇటీవల ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ అగ్రరాజ్య విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) గతంలో సర్వప్రతినిధి సభలో మాట్లాడారు. విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చారు. భద్రతా మండలి సహా ఐరాస సంస్థల్లో సంస్కరణలకు మేం ఎప్పుడూ అనుకూలమే. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలి’’ అని మీడియా సమావేశంలో వేదాంత్‌ పటేల్‌ అన్నారు.

* మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections) పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటైన బారామతిలో పవార్‌ కుటుంబం నుంచి ఇద్దరు మహిళా నేతలు పోటీ పడుతుండటం ఉత్కంఠగా మారింది. ఇదే సీటు నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన సుప్రియా సూలేతో, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ తలపడుతున్నారు. చీలిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటి ప్రజల మద్దతు తమకే ఉందని చాటిచెప్పేందుకు రెండు వర్గాలూ ప్రయత్నిస్తుండటంతో ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. మే 7న జరగనున్న ఎన్నికలకు సుప్రియ, సునేత్ర గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు, కేంద్రమాజీ మంత్రి శరద్‌పవార్‌ కుమార్తె సుప్రియాసూలే ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు బారామతి నుంచి గెలుస్తూ వచ్చారు. అజిత్‌ తిరుగుబాటుతో ఈసారి ఎన్సీపీ-ఎస్‌పీ నుంచి నాలుగోసారి పోటీపడుతుండగా.. ఎన్సీపీ నుంచి అజిత్‌ పవార్‌ సతీమణి తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

* తన తదుపరి చిత్రం ‘రత్నం’ (Rathnam) ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌లో సందడి చేశారు నటుడు విశాల్‌ (Vishal). ఇందులో భాగంగా ఆయన వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. అనంతరం, తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్‌ కార్డ్‌ జారీ చేయడంపై స్పందించారు. ‘‘ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కి గతంలో నేనూ ప్రెసిడెంట్‌గా వర్క్‌ చేశా. నాకు తెలిసినంత వరకూ రెడ్‌ కార్డ్‌ అనేది ఫుట్‌బాల్‌లో ఇస్తారు. సినిమాల్లో కాదు. సినిమాలు తెరకెక్కించకుండా ఖాళీగా కూర్చొనే వాళ్లే ఇలాంటివి ఆలోచిస్తారు. సినిమాలు తీసేవారు ఎవరూ ఇలా ఆలోచించరు’’ అని అన్నారు.

* కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణభవన్‌లో పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు కొందరు తనతో టచ్‌లో ఉన్నారని, అక్కడ అంతా భాజపా పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న మన ప్రభుత్వాన్ని కూల్చేందుకే భాజపా ప్రయత్నించింది.. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ను వదిలిపెడుతుందా? లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళం తలెత్తుతుంది. ఏం జరిగినా మనకే మేలు. రాష్ట్రంలో భవిష్యత్‌ భారాసదే’’ అని కేసీఆర్‌ అన్నారు.

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఏ1 నిందితుడు సతీష్‌ రిమాండ్‌ రిపోర్టు బయటకు వచ్చింది. దాడి వెనుక సీఎం జగన్‌ను చంపాలన్న దురుద్ధేశం ఉందని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించారు. సీఎంను హత్య చేయాలనే కుట్రతోనే వేముల సతీష్‌ పదునైన రాయితో దాడి చేసినట్లు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు సీఎం జగన్‌కు గాయం మాత్రమే అయిందన్నారు. సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్‌ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్‌ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్‌ కాన్‌స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్‌ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

* లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. దేశంలో ఎన్నికలు సజావుగా, నిస్పక్షపాతంగా జరిగేలా అనుసరించే చర్యలను వివరించాలని ఈసీ కోరింది. ‘ఇది ఎన్నికల ప్రక్రియ. పవిత్రంగా ఉండాలి. ఓటర్లు ఆశించినది జరగడం లేదని ఎవరూ భయాందోళన చెందకుండా చూసుకోవాలి’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ (ఈవీఎం) ఓట్లతో వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించిన పేపర్ స్లిప్‌లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారణ జరిపింది. ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది మణిందర్‌సింగ్‌, పిటిషనర్లలో ఒకరి తరపున అడ్వకేట్‌ నిజాంపాషా మాట్లాడుతూ.. ఓటరు ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌ స్లిప్‌ తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. అయితే అలాంటి ప్రక్రియ ఓటరు గోప్యతను ప్రభావితం చేయదా అని జస్టిస్‌ ఖన్నా ప్రశ్నించారు. ఇది ఓటర్‌ గోప్యతను, ఓటరు హక్కులను భంగం కలిగించదని పాషా బదులిచ్చారు.

* ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ కార్గోషిప్‌లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ సిబ్బందిలోని కేరళ మహిళ (Kerala woman) స్వదేశానికి చేరుకున్నది. భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ గురువారం తన రాష్టానికి తిరిగి వచ్చింది. కొచ్చిన్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో స్థానిక పాస్‌పోర్ట్ అధికారి ఆమెను రిసీవ్‌ చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z