* ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను (Infosys Results) ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.7,969 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.6,128 కోట్లతో పోలిస్తే 30 శాతం మేర వృద్ధి నమోదైంది. సమీక్ష త్రైమాసికంలో ఆదాయం రూ.37,441 కోట్ల నుంచి ఒక శాతం పెరిగి రూ.37,923 కోట్లుగా నమోదైనట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.24,095 కోట్ల నుంచి 8.9 శాతం వృద్ధితో రూ.26,233 కోట్లకు పెరిగింది. ఆదాయం 4.7 శాతం వృద్ధితో రూ.1,53,670 కోట్లుగా నమోదైంది. ఈసందర్భంగా భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల వద్ద 1-3 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.20 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.8 చొప్పున స్పెషల్ డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. జర్మనీకి చెందిన ఇన్-టెక్‌లో నూరు శాతం వాటాను 450 మిలియన్ యూరోలకు కొనుగోలు చేయనున్నట్లు ఈసందర్భంగా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫీ షేరు బీఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ.1420.5 వద్ద ముగిసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో మొత్తం 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. ప్రస్తుతం 3.17 లక్షల మంది పని చేస్తున్నారు. మార్చి త్రైమాసికంలో 5,423 మంది ఉద్యోగులు కంపెనీని వీడారు. డిమాండ్‌ను బట్టి నియామకాలు చేపడతామని సీఈఓ సలీల్ పరేఖ్ ఫలితాల వెల్లడి సందర్భంగా పేర్కొన్నారు.
* దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా (Worlds Best Airport 2024) నిలిచింది. సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండో స్థానంలో ఉంది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను ఈ రెండే పంచుకుంటుండడం విశేషం. స్కైట్రాక్స్ ఏటా విడుదల చేసే ఈ నివేదికలో గతేడాది ఛాంగి అగ్రభాగాన నిలిచింది. సియోల్ ఇన్చెయాన్ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. 2024లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టుగానూ ఇది అవార్డు సొంతం చేసుకుంది. టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. కొవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం అందుకు దోహదం చేసింది. అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం కూడా తొలి 20 స్థానాల్లో లేకపోవడం గమనార్హం. సియాటెల్‌లోని టకోమా ఎయిర్‌పోర్టుకు దక్కిన 24వ ర్యాంకే ఆ దేశానికి అత్యుత్తమైనది. ఐరోపా ప్రాంతంలో ప్యారిస్ చార్లెస్ డి గలే, మ్యూనిచ్, జ్యూరిక్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
* ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) తన క్విక్- కామర్స్ విభాగమైన ఇన్‌స్టామార్ట్ (Instamart) వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. ఇప్పటివరకు నిత్యావసర సరకుల డెలివరీకే పరిమితమైన ప్లాట్‌ఫామ్.. ఇకపై దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్టేషనరీ.. ఇలా 35 రకాల వస్తువులను అందించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా తన ఆన్‌లైన్ రిటైల్ విభాగమైన స్విగ్గీ మాల్ (Swiggy Mall)ను ఇన్‌స్టామార్ట్‌తో అనుసంధానం చేసినట్లు గురువారం తెలిపింది.
* దేశంలో విస్తృతంగా వినియోగించే నెస్లే ఇండియాకు (Nestle India) చెందిన బేబీ ఫుడ్స్‌లో చక్కెర, తేనె వంటి పదార్థాలు వినియోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ‘పబ్లిక్ ఐ’ దీనికి సంబంధించిన కొన్ని అంశాలను బయట పెట్టినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. తాజాగా నెస్లే ఇండియా దీనిపై వివరణ ఇచ్చింది. భారత్ సహా కొన్ని పేద దేశాల్లో నెస్లే విక్రయించే బేబీ ఫుడ్స్‌లో చక్కెర వినియోగం అధికంగా ఉంటోందని తమ పరిశోధనలో తేలినట్లు పబ్లిక్ ఐ పేర్కొంది. చిన్నారుల్లో స్థూలకాయం, దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టేందుకు నిర్దేశించిన అంతర్జాతీయ మార్గదర్శకాలకు నెస్లే ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన ఆహారంలో ఒక్కో సర్వ్‌లో 3 గ్రాముల చక్కెర ఉంటోందని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో యూకే సహా ఇతర యూరోపియన్ మార్కెట్లలో ఎలాంటి చక్కెరా ఉండడం లేదని వెల్లడించింది. భారత్‌తో పోలిస్తే థాయ్‌లాండ్, ఇథియోపియాలో చక్కెర వినియోగం మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తన నివేదికలో తెలిపింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా వడ్డీ రేట్ల కోతపై ఆశలు క్షీణించడం, మధ్యప్రాశ్చంలో ఘర్షణ వాతావరణం వంటి కారణాలు సూచీలను పడేశాయి. ఉదయం సెన్సెక్స్ 73,183.10 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,473.05 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో ఒక్కసారిగా పతనమైంది. ఇంట్రాడేలో గరిష్ఠాల నుంచి దాదాపు వెయ్యి పాయింట్ల మేర క్షీణించింది. చివరికి 454.69 పాయింట్ల నష్టంతో 72,488.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 152.05 పాయింట్ల నష్టంతో 21,995 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.55గా ఉంది.
* ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ తన హాయబుసా 25వ వార్షికోత్సవం సందర్భంగా సుజుకి హాయబుసా (Suzuki Hayabusa) 25వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది. దీని ధర రూ.17.7 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలికింది. 1998లో తొలుత జర్మనీలోని ఇంటర్ మోట్‌లో ప్రదర్శించిన సుజుకి హాయబుసా జీఎస్ఎక్స్1300ఆర్ మోటార్ సైకిల్ విక్రయాలు 1999లో ప్రారంభం అయ్యాయి. 2016లో భారత్ లో ఉత్పత్తి చేసి విక్రయించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న థర్డ్ జనరేషన్ హాయబుసా బైక్ తొలుత 2021లో మార్కెట్లోకి ఎంటరైంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z