Business

ఉద్యోగులకు సుందర్ పిచయ్ హెచ్చరిక-BusinessNews-Apr 19 2024

ఉద్యోగులకు సుందర్ పిచయ్ హెచ్చరిక-BusinessNews-Apr 19 2024

* ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి (Narayana Murthy) ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌మూర్తి మరింత సంపన్నుడు కానున్నాడు. తాత బహుమానంగా ఇచ్చిన కంపెనీ షేర్ల ద్వారా ఊహ తెలియకముందే కోట్లాది రూపాయలకు యజమానిగా మారిన ఈ చిన్నారి.. ఇప్పుడు మరో రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ గురువారం వార్షిక డివిడెండ్ ప్రకటించడమే ఇందుక్కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్‌ నిన్న ప్రకటించింది. దీంతో పాటు రూ.20 తుది డివిడెండ్‌, మరో రూ.8 ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటించింది. అంటే ఒక్కో షేరుకు రూ.28 చొప్పున డివిడెండ్‌గా చెల్లించాలని ఇన్ఫీ నిర్ణయించింది. ఇందుకు మే 31 రికార్డు డేట్‌గా పేర్కొంది. ఈ ఏడాది జులై 1న చెల్లింపులు చేయనుంది. అలా నారాయణమూర్తి మనవడైన రోహన్‌ కూడా డివిడెండ్‌ రూపంలో రూ.4.2 కోట్లు అందుకోనున్నాడు.

* చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన తొలి నియామకాన్ని చేపట్టింది. దేశంలో తన కార్యకలాపాలను విస్తృతం చేయాలనుకుంటున్న నేపథ్యంలో ప్రగ్యా మిశ్రాను ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా నియమించింది. గతంలో ట్రూకాలర్‌లో ప్రభుత్వ సంబంధాల విభాగం అధిపతిగా మిశ్రా విధులు నిర్వర్తించారు. అంతకుముందు వాట్సప్‌లోనూ ఆమె పని చేశారు. భారత్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓపెన్‌ఏఐ ఈ నియామకం చేపట్టడం గమనార్హం. గతేడాదిలోనే ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ప్రధాని మోదీని కలిసి, ఏఐ సాంకేతికత గురించి కొనియాడారు. ఇతర దేశాల కంటే ముందుగా భారత్‌లోనే చాట్‌జీపీటీని ఎక్కువమంది ఉపయోగించడం ప్రారంభించారని తెలిపారు. మరోవైపు ఏఐ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో దీనిపై నియంత్రణ తీసుకురావాలని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఈ నిబంధనలను అమలుచేసేందుకు ఓపెన్‌ ఏఐ చేపట్టిన తాజా నియామకం తోడ్పడనుంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. దీంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌- ఇరాన్ నడుమ నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల గత కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్లు పడుతూ వస్తున్నాయి. అయితే, తమ దేశం భూభాగంపై తాజాగా జరిగిన పేలుడు ఘటనలకు ప్రతీకార దాడులు చేయబోమంటూ ఇరాన్‌ పేర్కొనడంతో మదుపరులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది సూచీల పరుగుకు కారణమైంది. ఉదయం 71,999.65 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం వరకు అదే పంథాలో కొనసాగింది. తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. ఇంట్రాడేలో 71,999.65- 73,210.17 పాయింట్ల మధ్య చలించింది. చివరికి 599 పాయింట్లు లాభపడి 73,088.33 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 151 పాయింట్లు లాభపడి 22,147 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.46గా ఉంది. సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, నెస్లే ఇండియా, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ రకం బ్యారెల్‌ చమురు ధర 86.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* నెస్లే ఉత్పత్తులపై ఇటీవల వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలను తేల్చాలని ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI)’ను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) ఆదేశించింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందని ఈ సంస్థపై (Nestle India) ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై స్పందించి.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు ఆదేశాలు జారీ చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలని FSSAIకి లేఖ రాసినట్లు సీసీపీఏ చీఫ్‌ నిధి ఖరే శుక్రవారం వెల్లడించారు. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ సైతం దీనిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు చక్కెరను గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని ఆ సంస్థ (Nestle India) గురువారం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఎప్పటికప్పుడు మా ఉత్పత్తులను సమీక్షిస్తూ, రీఫార్ములేట్‌ చేస్తూ చక్కెర స్థాయిలను తగ్గిస్తాం. పోషకాలు, నాణ్యత, భద్రత, రుచి విషయంలో రాజీ పడకుండా చూస్తాం’ అని నెస్లే ఇండియా ప్రతినిధి వివరించారు.

* గూగుల్ కార్యాల‌యం రాజ‌కీయాల‌కు వేదిక కాద‌ని ఉద్యోగుల‌కు పంపిన అంత‌ర్గ‌త మెమోలో టెక్ దిగ్గ‌జం సీఈవో సుంద‌ర్ పిచాయ్ హెచ్చ‌రించారు. ఇది వ్యాపార‌మ‌ని, ఉద్యోగులు స‌హోద్యోగులు అభ‌ద్ర‌త‌కు లోన‌య్యేలా గూగుల్‌ను త‌మ వ్య‌క్తిగ‌త ప్లాట్‌ఫాంగా వాడుకోరాద‌ని స్ప‌ష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబ‌స్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపిన 28 మంది ఉద్యోగుల‌పై గూగుల్ వేటు వేసిన అనంత‌రం సుంద‌ర్ పిచాయ్ ఉద్యోగుల‌కు ఈ మెమో పంప‌డం గ‌మ‌నార్హం.

* వరుస లాభాలతో రికార్డుల్ని సృష్టించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ఇప్పుడు వరుస నష్టాలతో అల్లాడిపోతున్నాయి. నాలుగు రోజులుగా సూచీలు పతనం దిశగానే అడుగులు వేస్తుండటంతో లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపద ఆవిరైపోయింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ)లో నమోదైన సంస్థల మార్కెట్‌ విలువ గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.9,30,304.76 కోట్లు హరించుకుపోయింది. అంతకుముందు రూ.400 లక్షల కోట్లకుపైనే ఉండటం గమనార్హం. కానీ ఇప్పుడు రూ.3,92,89,048.31 కోట్లుగానే ఉన్నది. హెవీ వెయిట్‌ షేర్లతోపాటు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ సూచీల్లోని షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండటంతో మార్కెట్లు నిలబడలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా సంస్థల మార్కెట్‌ విలువ కూడా అంతకంతకూ దిగజారిపోతున్నది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z