2024 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానంతో పాటు దీని పరిధిలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి కచ్చితంగా గెలుస్తుందని విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఆదివారం ఉదయం ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రవాసులతో ఆయన ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ప్రసంగించారు.
ఎసీ, ఎస్టీ, మైనార్టీలను తెదేపా-జనసేన-భాజపా కూటమికి చేరువ చేసేలా అవగాహనా కార్యక్రమాలను పెంపొందిస్తున్నామని, కలల రాజధాని అమరావతికి కేంద్ర సాయం అవసరమని అందుకే భాజపాతో పొత్తు కుదుర్చుకున్నామని చిన్ని పేర్కొన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా 2024 ఎన్నికలకు శంఖారావం పూరించామన్న చిన్ని, తాము ఏది చేసినా బాహాటంగా, ప్రజాశ్రేయస్సు కోరి, ధైర్యంగా, ముక్కుసూటిగా చేస్తామని, లాలూచీ రాజకీయాలు తమకు చేతకాదన్న్నారు.
ఒకే కడుపున పుట్టిన తోడబుట్టిన వాడిని రాజకీయ రణక్షేత్రంలో ఎలా ఎదుర్కొంటున్నారని ప్రవాసులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…తాను ఎన్నడూ వ్యక్తిగత విమర్శలకు చోటు ఇవ్వలేదని, కేవలం రాజకీయంగా, విధానపరంగా మాత్రమే తమ మధ్య విబేధాలు ఉన్నాయని తన అంతిమ లక్ష్యం విజయవాడ పార్లమెంట్ పరిధి అభివృద్ధి అని చిన్ని స్పష్టం చేశారు.
ఏపీ సీఎస్, డీజీపీల బలం కన్నా ప్రజాస్వామ్యానికి బలం ఎక్కువని, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉద్యోగవకాశాల కల్పన వంటి వాటిపై కూటమి ప్రభుత్వం తప్పక దృష్టి సారిస్తుందని హామీనిచ్చారు. ప్రవాసులు చిన్ని గెలుపుకు అవసరమైన సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ఉత్తర అమెరికాలొ ఏపీ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం స్వాగతోపన్యాసం చేశారు. తెదేపా-జనసేన-భాజపాకు గెలుపు అవకాశాలౌ పుష్కలంగా ఉన్నాయని, చిన్నికి భారీ మెజార్టీ తప్పక వస్తుందని పేర్కొన్నారు. తిరువూరు మాజీ జడ్పీటీసీ కిలారు బిందు తదితరులు పాల్గొన్నారు. ప్రవాసులు సూరపనేని రాజా, చండ్ర దిలీప్‌కుమార్‌లు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z